Manmohan Singh attacks Modi: ‘‘గతంలో ఏ ప్రధాని కూడా ఇంతగా దిగజారలేదు’’: మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మండిపాటు-manmohan singh attacks modi no pm in past has uttered such hateful terms ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Manmohan Singh Attacks Modi: ‘‘గతంలో ఏ ప్రధాని కూడా ఇంతగా దిగజారలేదు’’: మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మండిపాటు

Manmohan Singh attacks Modi: ‘‘గతంలో ఏ ప్రధాని కూడా ఇంతగా దిగజారలేదు’’: మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మండిపాటు

HT Telugu Desk HT Telugu
May 30, 2024 03:07 PM IST

ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని స్థాయిని నరేంద్ర మోదీ దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లోప్రధాని మోదీ విద్వేష భాషను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. నిరంకుశ పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మన్మోహన్ సింగ్ ఓటర్లను కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్
ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్

సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని లేదా ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ విద్వేషపూరిత, అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగిస్తున్నారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం ఆరోపించారు.

పంజాబ్ ఓటర్లకు లేఖ

జూన్ 1న ఏడో దశ లోక్ సభ ఎన్నికలకు ముందు పంజాబ్ ఓటర్లకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ‘‘భారతదేశంలో నియంతృత్వ పాలన నుండి ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని రక్షించాలి’’ అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అందుకు ఇదే చివరి అవకాశమన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో తాను రాజకీయ ప్రసంగాలను నిశితంగా గమనిస్తున్నానని సింగ్ అన్నారు. మోదీ అత్యంత దుర్మార్గమైన విద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడుతున్నారని, అవి పూర్తిగా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే స్వభావం కలిగి ఉన్నాయని మన్మోహన్ మండిపడ్డారు.

ప్రధాని గౌరవాన్ని దిగజార్చారు..

ప్రజాప్రతినిధి గౌరవాన్ని, ప్రధాని పదవికి ఉన్న స్థాయిని ప్రధాని మోదీ దిగజార్చారని, అలా ప్రధాని స్థాయిని దిగజార్చిన తొలి ప్రధాని మోదీ యేనని మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. ‘‘గతంలో ఏ ప్రధాని కూడా సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని లేదా ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ద్వేషపూరిత, అన్ పార్లమెంటరీ, ముతక పదాలను ఉచ్చరించలేదు’’ అని మన్మోహన్ విమర్శించారు. తనపై కూడా కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారు. ‘‘నా జీవితంలో ఎప్పుడూ ఒక సామాజికవర్గాన్ని మరో సామాజికవర్గం నుంచి వేరు చేయలేదు. అది బీజేపీకి మాత్రమే ఉన్న ఏకైక కాపీరైట్’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.

అగ్నివీర్ స్కీమ్ తప్పుడు విధానం

సాయుధ దళాల్లో రిక్రూట్మెంట్ కు సంబంధించిన అగ్నివీర్ పథకం కూడా సరైంది కాదని మాజీ ప్రధాని మన్మోహన్ అన్నారు. దేశభక్తి, ధైర్యసాహసాలు, సేవకు విలువ కేవలం నాలుగేళ్లు మాత్రమేనని బీజేపీ భావిస్తోందని విమర్శించారు. ఇది బీజేపీ నకిలీ జాతీయవాదానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘‘దేశభక్తి, ధైర్యసాహసాలు, సేవాభావాలను బీజేపీ కేవలం నాలుగేళ్లకే పరిమితం చేస్తోంది. రెగ్యులర్ రిక్రూట్ మెంట్ కోసం శిక్షణ పొందిన వారిని ప్రస్తుత ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. సాయుధ దళాల ద్వారా మాతృభూమికి సేవ చేయాలని కలలు కంటున్న రైతు కుమారుడైన పంజాబ్ యువకుడు ఇప్పుడు కేవలం 4 సంవత్సరాల కాలానికి మాత్రమే రిక్రూట్ మెంట్ అని, సాయుధ దళాల్లో చేరడం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాడు. అగ్నివీర్ (agneepath) పథకం జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించింది. అందుకే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది’’ అని మన్మోహన్ విమర్శించారు

Whats_app_banner