CM Revanth Campaign : అలా జరిగితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది - పాతబస్తీ ప్రజలకు రేవంత్ ప్రత్యేక విజ్ఞప్తి-loksabha polls 2024 cm revanth reddy called for the congress party to win if hyderabad is to be developed ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cm Revanth Campaign : అలా జరిగితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది - పాతబస్తీ ప్రజలకు రేవంత్ ప్రత్యేక విజ్ఞప్తి

CM Revanth Campaign : అలా జరిగితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది - పాతబస్తీ ప్రజలకు రేవంత్ ప్రత్యేక విజ్ఞప్తి

CM Revanth Campaign in Hyderabad Loksabha : మతాల మధ్య విబేధాలను సృష్టించి బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

హైదరాబాద్ లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం

CM Revanth Reddy Campaign in Hyderabad : హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం గోషామహల్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన ఆయన…. హైరదాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అద్భుతమైన అభివృద్ధి చేసే బాధ్యత తనది అని చెప్పారు.

400 ఏళ్ల పాతబస్తీ పేరు ప్రఖ్యాతలు పెరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి సమీర్ వలీవుల్లా గెలవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మనుషులు, మతాల మధ్య విభేదాలు సృష్టించి గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎస్సీ, బీసీ ముస్లిం రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయని పునరుద్ఘాటించారు. ఎంఐఎంని గెలిపించడం వల్ల హైదరాబాద్ కు ఏం ఉపయోగం లేదు" అని విమర్శించారు.

“హైదరాబాద్ కు మెట్రో తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ.. మోదీ, ఓవైసీ పాతబస్తీకి మెట్రో తీసుకు రాలేకపోయారు.. మన మధ్య విభేదాలు సృష్టించే వారిని ఓడించండి. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ పాతబస్తీకి మెట్రో ఎందుకు తీసుకురాలేదు..? మూసీ ప్రక్షాళనకు మోదీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆరు గ్యారెంటీ ల్లో ఐదింటిని అమలు చేశాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచాం” అని గుర్తు చేశారు.

పాత బస్తీ ప్రజలు ఆలోచించాలని.. మార్పు తీసుకురావాలని రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యతన తనదని చెప్పారు. ఇరవై యేళ్లు గా హిందూ, ముస్లిం ల మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు. మత సామరస్యం వల్లనే హైదరాబాద్ లో ఐటీ సంస్థలు వచ్చాయని పేర్కొన్నారు. పాతబస్తీ ప్రజలు కర్ఫ్యూ లు మరిచిపోయారన్న రేవంత్ రెడ్డి… వినాయక చవితి, రంజాన్ కలిసి మెలిసి జరుపుకుంటున్నామన్నారు.

“ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ విద్వేషాలు సృష్టిస్తోంది. గొడవలు సృష్టించి హైదరాబాద్ పెట్టుబడులను గుజరాత్ కు తరలించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ 400 సీట్లు కావాలంటోంది. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ ను గెలిపించాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది. విద్వేష ప్రసంగాలు వినొద్దు.. ఈ ప్రాంతం మనది ,కలిసిమెలిసి ఉండాలి.. కర్ఫ్యూ లు వస్తే జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయి” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.