Lok Sabha Polls 2024 : ఒకే ఒక్కసారి జంగారెడ్డి…! ఈసారైనా ఓరుగల్లులో 'కమలం' వికసిస్తుందా..?-loksabha polls 2024 bjp is trying hard to win the warangal lok sabha seat this time ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Polls 2024 : ఒకే ఒక్కసారి జంగారెడ్డి…! ఈసారైనా ఓరుగల్లులో 'కమలం' వికసిస్తుందా..?

Lok Sabha Polls 2024 : ఒకే ఒక్కసారి జంగారెడ్డి…! ఈసారైనా ఓరుగల్లులో 'కమలం' వికసిస్తుందా..?

HT Telugu Desk HT Telugu
May 05, 2024 09:56 AM IST

Lok Sabha Elections in Warangal: ఓరుగల్లుపై బీజేపీ గురి పెట్టింది. ఈసారి ఎలాగైనా ఇక్కడ జెండా ఎగరవేయాలని చూస్తోంది. దశాబ్ధాలుగా విజయం కోసం ప్రయత్నిస్తుండగా…ఈసారి నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

వరంగల్ పై బీజేపీ గురి
వరంగల్ పై బీజేపీ గురి

Warangal BJP: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వరంగల్ పార్లమెంట్​ స్థానాలు(Warangal Lok Sabha constituency) సవాల్​ గా మారాయి. ఉమ్మడి వరంగల్​ లో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా.. ఆ రెండింటిలో ఇంతవరకు కమలం పార్టీ బోణీ కొట్టలేకపోయింది.

ఇదివరకు సరైనా నాయకత్వం, ఓటు బ్యాంక్​ లేకపోవడం పార్టీకి సమస్యగా మారగా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి కొంత మెరుగుపడింది. గతంలో ఐదారు వేల ఓట్లు కూడా రాని నియోజకవర్గాల్లో ఏకంగా 30 వేల పైచీలుకు ఓట్లు పెరగడంతో ఆ పార్టీలో కొంత జోష్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను సానుకూలంగా మలచుకొని పార్లమెంట్ నియోజకవర్గాల్లో నెగ్గాలని చూస్తోంది.

ఇదివరకు హనుమకొండ లోక్​ సభ స్థానం నుంచి చందుపట్ల జంగారెడ్డి(Jangareddy) ఒక్కసారి విజయం సాధించి రికార్డులెకక్కగా, మోదీ ( BJP Modi)మేనియా, కేంద్ర పథకాలతో మహబూబాబాద్​, వరంగల్ నియోజకవర్గాల్లో నెగ్గి హిస్టరీ క్రియేట్​ చేయాలని చూస్తోంది.

ఒకే ఒక్కసారి జంగారెడ్డి…

ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో చందుపట్ల జంగారెడ్డి (Jangareddy)అంటే తెలియని వాళ్లే ఉండరు. బీజేపీ ఉనికిలో లేని సమయంలో దేశ వ్యాప్తంగా 543 స్థానాల్లో పోటీ చేస్తే.. ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరాయన. ఉమ్మడి జిల్లాలో ఇదివరకు హనుమకొండ లోక్​సభ నియోజకవర్గం ఉండేది. దాని పరిధిలో జనగామ, చేర్యాల, స్టేషన్​ ఘన్​ పూర్​, హనుమకొండ, శాయంపేట, పరకాల, కమలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. 1977 లో దీనిని ఏర్పాటు చేయగా 2008 వరకు కొనసాగింది.

2009 నియోజకవర్గాల పునర్విభజనలో హనుమకొండ లోక్​ సభ స్థానాన్ని రద్దు చేసి దాని పరిధిలోని నియోజకవర్గాలను వరంగల్, భువనగిరి, కరీంనగర్​ పార్లమెంట్ స్థానాల్లో సర్దుబాటు చేశారు.ఇదిలాఉంటే 1984లో లోక్​ సభ ఎన్నికలు జరగగా, బీజేపీ దేశవ్యాప్తంగా 543 స్థానాల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో అటల్​ బిహారీ వాజ్​ పేయీ, లాల్​ కృష్ణ అడ్వానీ లాంటి బీజేపీ అగ్ర నాయకులంతా ఓటమి మూటగట్టుకోగా.. దేశ వ్యాప్తంగా రెండు స్థానాల్లో కమలం పార్టీ వికసించింది. గెలిచిన ఇద్దరిలో ఒకరు గుజరాత్​ లో ఏకే పటేల్ కాగా.. మరొకరు హనుమకొండ నుంచి పోటీ చేసిన చందుపట్ల జంగారెడ్డి కావడం విశేషం. దీంతో జంగారెడ్డి పేరు చరిత్రకెక్కినట్లయ్యింది. సౌత్​ ఇండియా నుంచి బీజేపీ తొలి ఎంపీగా జంగారెడ్డి రికార్డుకెక్కారు.

దశాబ్ధాలుగా నిరీక్షణ

హనుమకొండ లోక్​ సభ స్థానం రద్దు తరువాత వరంగల్, మహబూబాబాద్​(Mahabubabad Lok Sabha constituency) నియోజకవర్గాలు కొనసాగుతుండగా.. ఇంతవరకు బీజేపీ నుంచి ఏ ఒక్కరూ ఎంపీగా గెలిచిన దాఖలాలు లేవు. 1952లో ఏర్పడిన వరంగల్ స్థానంలో 19సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో పీపుల్స్​ డెమోక్రటిక్​ ఫ్రంట్​, కాంగ్రెస్​, తెలంగాణ ప్రజా సమితి, టీడీపీ, బీఆర్​ఎస్​ తప్ప బీజేపీ ఇంతవరకు విజయాన్ని అందుకోలేదు.

ఇక ​ 1957లో ఏర్పడిన మహబూబాబాద్​ నియోజకవర్గం(Mahabubabad Lok Sabha constituency) 1967 నుంచి 2008 వరకు ఉనికిలో లేదు. 2009లో మళ్లీ మహబూబాబాద్​ లోక్​ సభ స్థానాన్ని ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు మొత్తంగా ఇక్కడ ఆరు సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్​, బీఆర్​ఎస్ తప్ప వేరే పార్టీకి అవకాశం దక్కలేదు. దీంతోనే కొన్ని దశాబ్ధాలుగా బీజేపీ వరంగల్ లో విజయం కోసం వేచిచూస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల ఊపుతో..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2023 అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కొంత ఊపును తెచ్చాయి. ఇదివరకు ఏ ఎన్నికల్లోనైనా ఐదారు వేల ఓట్ల వరకే పరిమితమైన బీజేపీ, శాసన సభ ఎన్నికల్లో మాత్రం కొన్ని చోట్లా 30 వేల మార్కు దాటింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఆ మార్పు కనిపించింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అభ్యర్థిని రావు పద్మారెడ్డి 30వేలకు పైగా ఓట్లు సాధించి, మూడో స్థానంలో నిలవగా, పరకాలలో డాక్టర్​ కాళీప్రసాద్​ రావు 38 వేల వరకు ఓట్లు సంపాదించారు.

ఇక వరంగల్ తూర్పు నియోజవకర్గంలో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్​ రావు ఏకంగా 52 వేల పైచీలుకు ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఒక దశలో ఆయనే గెలుస్తారని అందరూ భావించారు. ఇలా ఉనికే లేదనుకున్న పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టించే పరిస్థితి ఏర్పడగా, పెరిగిన ఓటు బ్యాంకు, ప్రధానిగా మోదీకి ఉన్న పేరు, కేంద్ర ప్రభుత్వంతో వరంగల్​ ఉమ్మడి జిల్లాకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ బీజేపీ నాయకులు జనాల్లోకి వెళ్తున్నారు.

కాంగ్రెస్​ లో అంతర్గత కుమ్ములాటలు, బీఆర్​ఎస్​ క్యాడర్​ అంతా పక్క పార్టీలోకి జంప్ కావడంతో బీజేపీ వరంగల్ ఎంపీ సీట్లపై ఎక్కువ ఫోకస్​ పెట్టింది. ఎలాగైనా ఒక్క సీటైనా గెలిచి ఓరుగల్లు గడ్డపై పాగా వేయాలని చూస్తోంది. మరి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

రిపోర్టింగ్ - వరంగల్ జిల్లా ప్రతినిధి,HT తెలుగు.

Whats_app_banner