Lok sabha elections 2024: ‘‘ఇది రాయల్ పోలింగ్ బూత్.. ఇక్కడ సింహాససం, కిరీటం.. అన్నీ ఉన్నాయి’’
Lok Sabha Polls: ఓటర్లను ప్రోత్సహించడానికి కర్నాటకలోని షిమోగా జిల్లాలో ఒక పోలింగ్ బూత్ ను రాయల్ పోలింగ్ బూత్ తరహాలో రూపొందించారు. ఇక్కడ ఓటు వేసిన అనంతరం ఓటర్లు సింహాసనం పై కూర్చుని,కిరీటం పెట్టుకుని ఫొటో దిగొచ్చు.
Lok sabha elections 2024: కర్ణాటకలోని షిమోగా జిల్లా పంచాయతీ ఓటర్లను తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వినూత్నంగా ఒక పోలింగ్ బూత్ ను ఆవిష్కరించింది. అందులో ఓటర్ల కోసం ప్రత్యేకంగా సింహాసనాలను, కిరీటాలను ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యంలో పౌరులే ప్రభువులు అనే భావనతో ఓటర్లను రాజులు, రాణులుగా చిత్రీకరిస్తూ ఈ ప్రత్యేక పోలింగ్ కేంద్రంను రూపొందించారు. ఈ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన అనంతరం ఓటర్లు తలపై కిరీటం ధరించి సింహాసనంపై కూర్చుని ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఏర్పాటు ఓటర్లకు ఎంతగానో ఆకట్టుకుంది. సింహాసనం పై కూర్చుని కిరీటం పెట్టుకుని దిగిన ఫొటోలను ఓటర్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసుకున్నారు.
కర్నాటకలో బీజేపీకి 25 సీట్లు
కర్నాటక లో బీజేపీకి 25 సీట్లు వస్తాయని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప అన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, ఈ లోక్ సభ ఎన్నికల కోసం రెండేళ్ల క్రితమే సన్నాహకాలు ప్రారంభించామని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు. ఓటర్ల జాబితా తయారీ నుంచి పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయడం, బలగాల మోహరింపు, సమస్యాత్మక బూత్ లను గుర్తించడం, బూత్ ల వద్ద లైట్, నీడ, ర్యాంపుల వంటి కనీస సౌకర్యాల కల్పన... మొదలైనవి చేపట్టామన్నారు. మహిళలు, యువతతో సహా ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనడం చాలా అవసరమని కుమార్ తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు గరిష్ఠంగా పాల్గొనేలా ఓటింగ్ లో చూడాలన్నారు. వారికి ఇంటి వద్ద నుంచే ఓటు వేసే వెసులుబాటు కూడా ఉందన్నారు. బూత్ కు వచ్చి ఓటు వేయాలనుకునేవారి కోసం ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేస్తామని, బూత్ వద్ద వీల్ చెయిర్లను అందిస్తామని సీఈసీ రాజీవ్ వెల్లడించారు.
3వ దశ పోలింగ్
12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్ సభ స్థానాలకు మంగళవారం మూడో దశ పోలింగ్ జరుగుతోంది. ఇందులో కర్నాటకలోని 14 స్థానాలు సహా అసోం (4), బీహార్ (5), ఛత్తీస్ గఢ్ (7), దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ (2), గోవా (2), గుజరాత్ (25), కర్ణాటక (14), మహారాష్ట్ర (11), మధ్యప్రదేశ్ (8), ఉత్తరప్రదేశ్ (10), పశ్చిమబెంగాల్ (4) ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. సూరత్ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మొత్తం 28 లోక్ సభ స్థానాలున్న కర్ణాటకలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 26న 14 స్థానాలకు పోలింగ్ ముగియగా, మిగిలిన 14 స్థానాలకు ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది.