Lok Sabha polls 2024: మళ్లీ రాజకీయాల్లోకి బాలీవుడ్ నటుడు గోవిందా..! ఆ పార్టీ నుంచే లోక్ సభ బరిలోకి..!
Lok Sabha polls: బాలీవుడ్ నటుడు, హీరో గోవిందా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. ఇటీవల గోవిందా మహారాష్ట్ర సీఎం, శివసేన షిండే వర్గం నేత ఏక్ నాథ్ షిండే తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Lok Sabha polls: లోక్ సభ ఎన్నికలకు ముందు నటుడు గోవిందా తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గోవిందా నార్త్-వెస్ట్ ముంబై లోక్ సభ స్థానం నుండి ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల, మూడు రోజుల క్రితం, నటుడు గోవిందా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) ను కలిశారు.
గతంలో కాంగ్రెస్ లో..
2004 లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections 2024) ముంబై నార్త్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన గోవిందా (Actor Govinda) బీజేపీ సీనియర్ నేత రామ్ నాయక్ ను ఓడించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ ను వీడారు. కాగా, ముంబైలోని వర్లీలో శివసేన షిండే వర్గం పార్టీ క్యాడర్ తో సీఎం షిండే (Eknath Shinde) గురువారం లోక్ సభ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లు వచ్చేలా కృషి చేయాలని కోరారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లాలని షిండే పార్టీ సభ్యులకు సూచించారు. ప్రజాసంక్షేమం కోసం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు గట్టిగా బదులివ్వాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ‘‘పార్టీ క్రమశిక్షణ పాటించాలి. ఎవరూ రాజులా ప్రవర్తించకూడదు. ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా పనిచేయాలి. పార్టీ ఆదేశాలను పాటించాలి" అని మహారాష్ట్ర సిఎం అన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం మహాకూటమి భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకాలపై చర్చ జరుగుతోందని, త్వరలోనే ప్రకటిస్తామని షిండే తెలిపారు. మహారాష్ట్రలోని 48 లోక్ సభ స్థానాలకు గాను 45 స్థానాలను గెలుచుకోవాలని మహాకూటమి లక్ష్యంగా పెట్టుకుంది.