KTR Comments : వారిద్దరూ కలిసి నమ్మించి మోసం చేశారు - కేటీఆర్-ktr serious comments on ranjith reddy and mahender reddy ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ktr Comments : వారిద్దరూ కలిసి నమ్మించి మోసం చేశారు - కేటీఆర్

KTR Comments : వారిద్దరూ కలిసి నమ్మించి మోసం చేశారు - కేటీఆర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Mar 29, 2024 02:49 PM IST

BRS Party Latest News: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి ఇద్దరూ కూడా నమ్మించి మోసం చేశారని అన్నారు.

కేటీఆర్
కేటీఆర్

KTR Comments : మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి ఇద్దరూ కూడా కలిసి నమ్మించి మోసం చేశారని అన్నారు కేటీఆర్(BRS KTR). ఇవాళ తెలంగాణ భవన్‌లో జరిగిన చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్… ఈ ఇద్దరు నేతలు ఆస్కార్ అవార్డు పొందే స్థాయిలో యాక్టింగ్ చేశారంటూ ఎద్దేవా చేశారు. పార్టీ మారటం లేదని చెబుతూనే.. కాంగ్రెస్ లోకి వెళ్లారని కామెంట్స్ చేశారు. తీరా చూస్తే… ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు అయ్యారని చెప్పుకొచ్చారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు తిరిగొచ్చి కేసీఆర్ (KCR)కాళ్ళు పట్టుకున్నా మళ్లీ రానియ్యని హెచ్చరించారు.

వాళ్లను మళ్లీ రానివ్వం - కేటీఆర్

BRS working President KTR : కేకే, కడియం(Kadiyam Srihari) లాంటి నాయకులు పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారని అన్నారు కేటీఆర్. “పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారు.. వాళ్ళు చేస్తున్న విమర్శలపైన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను.. కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది. ఈరోజు నాయకులు పార్టీని వదిలేసినా.. పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్తా. ఇన్ని రోజులు పార్టీ కోసం, నాయకుల కోసం పనిచేసిన కార్యకర్తల కోసం నేనుస్వయంగా వస్తా. రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2014లో విశ్వేశ్వర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీగా చేసినం. 2019లో రంజిత్ రెడ్డి మాదిరి పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరితే చేవెళ్ల ప్రజల చైతన్యంతో ఓడిపోయినారు. కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్‌లోకి పోయిన రంజిత్ రెడ్డి. పట్నం మహేందర్ రెడ్డిల పైన మన పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ వచ్చి కేసీఆర్ గారి కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయం" అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మల్కాజ్‌గిరిలో పోటీ చేయాలని విసిరిన సవాలుకు రేవంత్ రెడ్డి(Revnath Reddy) స్పందించలేదన్నారు కేటీఆర్. ఆయన సొంత సిట్టింగ్ ఎంపి స్థానంలోనే పోటీకి వెనకంజ వేసిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సీట్లను గెలిపిస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు పోయినవి, ఆరు గారడీలు మిగిలినవి అంటూ సెటైర్లు విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఅర్ఎస్ బీజేపీ బీ-టీమ్ అన్నారని… కానీ ఎన్నికల తర్వతా రేవంత్ రెడ్డి బీజేపీ బీ-టీమ్‌గా మారిండని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నారా.. లేదా మోడీ కోసమా చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్ధితి లేదన్న కేటీఆర్… బీజేపీని అపేది బలమైన స్ధానిక నేతలే అని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే, అది బీజేపీకి లాభం అవుతుందని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు.. పార్టీకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని అన్నారు. చేవెళ్లలో నిలబడ్డది కాసానికి జ్ఞానేశ్వర్ కాదు కేసీఆరే(BRS KCR) అన్నట్టుగానే పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Whats_app_banner

టాపిక్