Lok Sabha Election Nominations : నామినేషన్లకు సర్వం సిద్ధం, ఈ నెల 18 నుంచి 25 వరకు స్వీకరణ
Lok Sabha Election Nominations : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి మొదలుకానుంది. కరీంనగర్ , పెద్దపల్లి స్థానాలకు ఆయా కలెక్టరేట్లలో నామినేషన్లు స్వీకరించనున్నారు.

Lok Sabha Election Nominations : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియకు(Lok Sabh Nominations) సర్వం సిద్ధమైంది. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్ లను పరిశీలించి ఉపసంహరణకు 29 వరకు గడువు ఇచ్చారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అధికారులు ఏర్పాట్లన్ని పూర్తి చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్లను కరీంనగర్ కలెక్టరేట్ లో, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్లను పెద్దపల్లి కలెక్టరేట్ లో స్వీకరిస్తారు.
నోటిఫికేషన్ జారీ.. వెంటనే నామినేషన్ల స్వీకరణ
ఎన్నికల షెడ్యూల్ (Election Schedule)మార్చి 16 వెలువడింది. అప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నాలుగో విడత మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ చేస్తారు. గురువారం ఉదయం 10గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ జారీ చేస్తారు. 11 గంటల నుంచి నామినేషన్ లు స్వీకరిస్తారు. ఈ నెల 18 నుంచి 25 వరకు ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ లు స్వీకరిస్తారు.
కరీంనగర్ ఆర్వో పమేలా సత్పతి
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి (Karimnagar Paliament)ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వ్యవహరిస్తారు. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ లుగా కరీంనగర్, సిరిసిల్ల అదనపు కలెక్టర్ లు ప్రపుల్ దేశాయ్, పూజారి గౌతమి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ వ్యవహరిస్తారు. నోటిఫికేషన్ జారీ చేసిన వెనువెంటనే నామినేషన్ లను స్వీకరిస్తారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్వో పమేలా సత్పతి ప్రకటించారు.
పెద్దపల్లి ఆర్వో ముజామిల్ ఖాన్
పెద్దపల్లి(Peddapalli) పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పెద్దపల్లి కలెక్టర్ ముజామిల్ ఖాన్ వ్యవహరిస్తారు. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ లుగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల అధనపు కలెక్టర్ లు పనిచేస్తారు.
ఆర్వో లకు దిశానిర్దేశం చేసిన వికాస్ రాజ్
నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్(CEO Vikas Raj) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి పరిశీలన.. ఉపసంహరణ వరకు రిటర్నింగ్ ఆఫీసర్లు (Returning Officer)అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా ప్రత్యేక దృష్టిసారించాలని పేర్కొన్నారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో నిబంధనలు పాటించేలా చూడాలని సూచించారు. అభ్యర్థుల వెంట వచ్చేవారు.. వాహనాల సంఖ్యను నిబంధన మేరకు అనుమతించాలని సూచించారు. నామినేషన్ల నుంచి పోలింగ్ జరిగే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. స్టాటస్టిక్ సర్వే లైన్స్ టీమ్ లు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సువిధ కింద ప్రచారం, సభలు సమావేశాలకు సంబంధించి అనుమతులను వెంటవెంటనే ఇవ్వాలని తెలిపారు. సి-విజిల్ యాప్(C-Vigil App) ద్వారా వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్(Postal Ballot) ద్వారా ఓటు హక్కును ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ప్రచారానికి సంబంధించి వచ్చే పోస్టులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ముద్రణ సమయంలో సింబల్ అలాట్మెంట్ జాగ్రత్తగా జరిగేలా చూడాలని తెలిపారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ నెల 19న బండి సంజయ్, వంశీకృష్ణ నామినేషన్
ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుండగా తొలి రోజు ప్రధానపార్టీల అభ్యర్థులు నామినేషన్ వెయ్యడం లేదు. 19న కరీంనగర్ (Karimnagar)లో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్(Bandi Sanjay) తొలి సెట్, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ నామినేషన్ వేస్తున్నారు. బండి సంజయ్ అట్టహాసంగా 25న భారీ ర్యాలీతో రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక పెద్దపల్లి లో బిజెపి అభ్యర్థిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం ఆ పార్టీలో కలకలం సృష్టిస్తుంది. కరీంనగర్, పెద్దపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థులు బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ లకు 18న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ బి ఫామ్ అందజేయన్నారు. ఆ తర్వాత ఇద్దరు నామినేషన్(Nominations) దాఖలు చేయమన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి(Congress Candidate) ఎవరనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుండడంతో పలువురు ఆ పార్టీ పేరుతో నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
HT CORRESPONDENT K.VREDDY, Karimnagar