Kadiyam Vs Aroori : 20 ఏళ్ల గురుశిష్యుల బంధం..! నేడు ఢీ అంటే ఢీ
Warangal Lok Sabha Constituency : నాడు గురుశిష్యులుగా ఉన్న కడియం శ్రీహరి, అరూరి రమేశ్… ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నారు. వరంగల్ ఎంపీ(Warangal) స్థానంలో గెలుపే లక్ష్యంగా ఇద్దరు నేతలు కూడా పావులు కదుపుతున్నారు.
Kadiyam Srihari Vs Aroori Ramesh: ఒకప్పుడు గురుశిష్యులుగా పేరుపొందిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు బద్ధ శత్రువులయ్యారు! నిన్నమొన్నటి వరకు ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగి.. ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో చేరి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునేంతలా మారిపోయారు. వారెవరో కాదు.. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తండ్రి కడియం శ్రీహరి(Kadiyam Srihari), మరొకరు బీజేపీ వరంగల్ అభ్యర్థి అరూరి రమేశ్(Aroori Ramesh). ఇద్దరి మధ్య దాదాపు 20 ఏళ్ల గురుశిష్యుల బంధం ఉండగా.. ఎంపీ ఎన్నికల పుణ్యమాని ఇద్దరి మధ్య వైరం పెరిగింది. కూతురు రాజకీయ జీవితం కోసం కడియం శ్రీహరి అన్నీ తానై మోస్తుండగా, అరూరి రమేశ్ ఎంపీగా గెలిచేందుకు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నాడు. ఇద్దరి టార్గెట్ ఒకటే కావడంతో ఇప్పుడు కడియం శ్రీహరి, అరూరి రమేశ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది.
బీఆర్ఎస్ తో స్ట్రాంగ్ బాండింగ్
కడియం శ్రీహరి రాజకీయ ప్రస్థానం 1987లో టీడీపీ నుంచి ప్రారంభమైంది. మొదట్లో టీడీపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన ఆయన 1988లో కుడా చైర్మన్ గా, 1994లో తొలిసారి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అదే టర్మ్ లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆ తరువాత 1999, 2004, 2009 ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గంలో పోటీ చేశారు. ఇదిలాఉంటే కాంట్రాక్టర్గా, రియల్టర్ గా పేరున్న అరూరి రమేశ్ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి, ఆ పార్టీ తరఫున స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరిపైనే పోటీ చేశారు. అంతకుముందు నుంచే ఇద్దరి మధ్య సఖ్యత ఉండగా.. ఆ ఎన్నిక పూర్తయిన తరువాత ఇద్దరూ బీఆర్ఎస్ లో చేరారు. అందులో కడియం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తే.. అరూరి రమేశ్ వర్ధన్నపేట నియోజకవర్గంలో స్థిరపడ్డారు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య గురుశిష్యుల బంధం ఏర్పడింది. ఇద్దరూ ఒకరికొకరు అన్నివిధాలా సహకరించుకోవడం కూడా చేసేవారు. ఇలా ఇద్దరి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. ఒకరి విజయానికి మరొకరు సహరించుకుంటూ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో గురుశిష్యులుగా ప్రత్యేక గుర్తింపు కూడా పొందారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే క్లాషెస్
ఆరూరి రమేష్ వర్ధన్నపేట ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందగా.. అందుకు కడియం శ్రీహరి కూడా సహకరించారు. ఆరూరి కూడా కడియం శ్రీహరికి రాజకీయాల్లో మద్దతుగా నిలవడంతో పాటు అవసరమైన సాయం చేసుకుంటూ వచ్చారు. ఇలా ఇద్దరి మధ్య దాదారు 20 ఏళ్ల అనుబంధం ఉంది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇద్దరి మధ్య స్పర్థలు స్టార్ట్ అయ్యాయి. కడియం శ్రీహరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగా.. అందుకు అరూరి కొంత సహకరించాడు. కానీ అరూరి ఓటమి చెందగా.. కడియం శ్రీహరి సహకరించకపోవడం వల్లే కొంత మైనస్ అయ్యిందని రమేశ్ వర్గం నేతలు భావిస్తున్నారు. అంతేగాకుండా ఇప్పటికే రెండు సార్లు బంపర్ మెజారిటీతో గెలిచిన అరూరి, హ్యాట్రిక్ కొడితే మంత్రి పదవి రేసులో ఉంటారనే టాక్ నడిచింది. అదే జరిగితే దాదాపు 40 ఏళ్ల సీనియార్టీ ఉన్న తనకు మంత్రి పదవి దక్కదనే ఉద్దేశంతోనే కడియం సహకరించలేదనే ఆరోపణలున్నాయి. దీంతో పాటు తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం కూడా ఆరూరి రమేష్‌కు చెక్ పెట్టారనే ప్రచారం కూడా ఉంది. అందుకే మొదట్నుంచీ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ అరూరికి ఇవ్వకుండా కడియం శ్రీహరే అడ్డుపడ్డారనే ఆరోపణలున్నాయి. కారణాలేమైనా అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇద్దరి మధ్య వైరం పెరిగిపోయింది.
ఇప్పుడు ఢీ అంటే ఢీ
రాజకీయ కారణాలతో కడియం శ్రీహరి(Kadiyam Srihari), అరూరి రమేశ్ ఇద్దరూ పార్టీ మారారు. కడియం శ్రీహరి, తన కూతురు కడియం కావ్యతో కలిసి కాంగ్రెస్ లో చేరగా.. ఆ పార్టీ అధిష్ఠానం కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇదిలాఉంటే అంతకుముందే అరూరి రమేశ్ కారు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి వరంగల్ ఎంపీ టికెట్ సాధించారు. దీంతో ఒకే స్థానంలో కడియం(Kadiyam Srihari), అరూరి పోటీ పడుతున్నట్లయ్యింది. దీంతో నిన్నమొన్నటి వరకు ఒకేపార్టీలో కొనసాగిన గురు-శిశ్యులు ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో చేరి ప్రత్యర్ధులుగా మారారు. ఓ వైపు గురువు, గురువు కూతురు పోటీ పడుతుండగా.. మరోవైపు శిష్యుడైన అరూరి రమేశ్ బరిలో నిలిచారు. ప్రత్యర్థులుగా మారినప్పటి నుంచి వ్యక్తిగత విమర్శలు, ధూషణలు కూడా మొదలు పెట్టారు. దీంతో ఎంపీ ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. వరంగల్ గడ్డ మీద జరుగుతున్న ఈ పోరులో కడియం, తన కూతురు గెలిచి పంతం నెగ్గించుకుంటారా.. లేదా అరూరి నెగ్గి, గురువును మించిన శిష్యుడు అనిపించుకుంటాడా చూడాలి.