Nalgonda MP Seat: నల్గొండ లోక్‌సభకు... వార్ వన్ సైడేనా? చివరి దశకు చేరిన ఎన్నికల ప్రచారం
Nalgonda MP Seat: లోక్ సభ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుండగా, నలబై ఎనిమిది గంటల ముందే ప్రచారానికి తెరపడనుంది. ఇన్ని రోజులపాటు ఎన్నికల ప్రచారంలో మునిగి పోయిన ఆయా పార్టీల అభ్యర్థు, పార్టీల నాయకులు ఇపుడు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

Nalgonda MP Seat: నల్గొండ లోక్‌సభ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామన్న ధీమాలో మూడు పార్టీలూ ఉన్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు కాంగ్రెస్, ఈ సారైనా గెలవాలని పట్టుదలగా ఉన్న బీఆర్ఎస్, పట్టు నిరూపించేందుకు శ్రమిస్తున్న బీజేపీ.. ఇలా, ప్రధాన పార్టీలకు ఎవరి ఎత్తులు వారికున్నాయి.
నల్గొండలో కాంగ్రెస్ తరపున ఈ నెల 10వ తేదీన ఆలిండియా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రచారంలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి కోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలోపాల్గొని వెళ్లారు.
ఈ దశలో ఏ పార్టీకి విజయవకాశాలు ఉన్నాయన్న చర్చ, సమీకరణలు మొదలయ్యాయి. గత ఎన్నికల విజయాలు, గెలుపోటముల రికార్డు, సాధించిన ఓట్లు, ప్రస్తుం రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పార్టీల గెలుపోటములపై అంచనాలు వేస్తున్నారు.
వార్... వన్ సైడా..?
నల్గొండ లోక్ సభ నియోజకవర్గాని ఇప్పటి దాకా జరిగిన ఎన్నికల చరిత్రను గమనిస్తే... కాంగ్రెస్ కే ఎక్కువ విజయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్థానం కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కూడా. బీఆర్ఎస్ నల్గొండలో ఇప్పటి వరకు 2014, 2019 ఎన్నికల్లో మాత్రమే రెండు సార్లు పోటీ చేసింది.
2014 ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ 2019 లో మాత్రం రెండో స్థానానికి చేరుకుంది. బీజేపీ పలు ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క సారి కూడా నెగ్గలేదు. కాగా, కాంగ్రెస్ కు విజయాల రికార్డ్ ఉంది. 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం ఒక్క చోట మాత్రమే ఎమ్మెల్యే ఉన్నా.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించింది.
ఈ ఎన్నికల విషయానికి వస్తే.. సూర్యాపేటలో మినహా.. మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. గతేడాది డిసెంబరు జరిగిన శాసన సభ ఎన్నికల్లో మంచి మెజారిటీలతో గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకత్వం, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల్లో పనిచేస్తున్నారని, తమ గెలుపు ఖాయమైందని, కేవలం మెజారిటీ కోసం మాత్రమే ఆలోచిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
నల్గొండ ఎంపీ సీట్ లో జరిగే పోటీ వార్ వన్ సైడ్ లా ఉంటుందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి ఈ సారి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య క్యాడర్ ఆ పార్టీకి టాటా చెప్పి కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు.
దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాలు దాదాపు ఖాళీ అయ్యాయి. హూజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండడంతో ఆయన వెంట బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లిపోయాయి. మిగిలిన వారంతా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలో గణనీయమైన ఓట్లున్న సీపీఎం, అదే మాదిరిగా సీపీఐలు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాయి. ఇన్ని పాజిటివ్ అంశాల నేపథ్యంలోనే.. తమదే గెలుపు అన్న ధీమాను కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ ఈక్వేషన్స్ ఏవీ పనిచేయవని, రాష్ట్రంలో అయిదు నెలల కాంగ్రెస్ పాలనతో విసుగెత్తారని, ఓటర్లు తమ వెంటే నిలుస్తారని బీఆర్ఎస్, కేంద్రంలో మూడో సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా తమకు కలిసి వస్తుందని బీజేపీ నమ్మకంగా ఉన్నాయి.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, HT TELUGU నల్గొండ )
సంబంధిత కథనం