TS Govt Paid Holidays : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం- మే 13, జూన్ 4 వేతనంతో కూడిన సెలవుగా ప్రకటన-hyderabad ts govt announced may 13 june 4th paid holidays to govt employees due to elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ts Govt Paid Holidays : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం- మే 13, జూన్ 4 వేతనంతో కూడిన సెలవుగా ప్రకటన

TS Govt Paid Holidays : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం- మే 13, జూన్ 4 వేతనంతో కూడిన సెలవుగా ప్రకటన

Bandaru Satyaprasad HT Telugu
May 07, 2024 02:44 PM IST

TS Govt Paid Holidays : తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో మే 13, జూన్ 4వ తేదీలను వేతనంతో కూడిన సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

 మే 13, జూన్ 4 వేతనంతో కూడిన సెలవుగా ప్రకటన
మే 13, జూన్ 4 వేతనంతో కూడిన సెలవుగా ప్రకటన

TS Govt Paid Holidays : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల పోలింగ్ జరిగే మే 13, కౌంటింగ్ జరిగే జూన్ 4న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారుల ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో నాలుగో దశలో లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి మే 13న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్ర అధికంగా ఉండడంతో 12 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. అంటే ఒక గంట పోలింగ్ సమయాన్ని పొడిగించారు.

yearly horoscope entry point

35 వేల పోలింగ్ కేంద్రాలు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో... ఆ స్థానానికి ఈసీ ఉపఎన్నిక ప్రకటించింది. మే 13న ఈ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ అసెంబ్లీ స్థానం మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలో ఉండడంతో... ఇక్కడి ఓటర్లు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి లోక్‌సభ, మరొకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఓట్లు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ పూర్తి ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35809 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేసి సీఈవో వికాస్ రాజ్ ప్రకటించారు. అలాగా 23,500 మంది ఉద్యోగులను ఎన్నికల సిబ్బందిగా నియమించినట్లు తెలిపారు. 155 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల భద్రతకు వినియోగిస్తున్నామన్నారు.

తెలంగాణలో 525 మంది పోటీ

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీ పడుతున్నట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. సికింద్రాబాద్ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్లు వెల్లడించారు. మొత్తం 285 మంది స్వతంత్ర అభ్యర్థులు లోక్ సభ బరిలో ఉన్నారని తెలిపారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగాఉన్న దృష్ట్యా 7 స్థానాల్లో 3 ఈవీఎంలు, 9 స్థానాల్లో 2 ఈవీఎంలు ఉపయోగించనున్నట్లు తెలిపారు.

రాజకీయ పార్టీలకు ఈసీ వార్నింగ్

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. పార్టీల మధ్య విమర్శలు తారా స్థాయికి చేరుతుండడంతో ఈసీ రంగంలోకి దిగింది. ఫిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకుంటుంది. దీంతో పాటు రాజకీయ పార్టీల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు చేస్తున్న పోస్టింగ్‌లపై ఈసీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తులు, మహిళలను కించపర్చేలా, మైనర్లతో ప్రచారం, జంతువులకు హాని కలిగించేలా వీడియోలు, ఫొటోలను సామాజిక మధ్యమాల్లో షేర్ చేయడంపై నిషేధం విధించింది. ఇలాంటి పోస్టులు ఈసీ దృష్టికి వచ్చిన మూడు గంటల్లో తొలగించాలని ఆదేశించింది. ఈసీ నిబంధనలు పాటించకపోతే రాజకీయ పార్టీల నాయకులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.

Whats_app_banner

సంబంధిత కథనం