TS Election Campaign : తెలంగాణలో ఎన్నికల ప్రచారం బంద్-ఎవరెన్ని సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారంటే?-hyderabad ts election campaign ends bjp congress brs leaders how many road shows meeting ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ts Election Campaign : తెలంగాణలో ఎన్నికల ప్రచారం బంద్-ఎవరెన్ని సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారంటే?

TS Election Campaign : తెలంగాణలో ఎన్నికల ప్రచారం బంద్-ఎవరెన్ని సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారంటే?

HT Telugu Desk HT Telugu
May 11, 2024 06:54 PM IST

TS Election Campaign : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. నేతలు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఎవరెన్ని సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారంటే?
ఎవరెన్ని సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారంటే?

TS Election Campaign : తెలంగాణలో నేటి సాయంత్రంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి వివిధ పార్టీల నేతల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలంగాణలో ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని హారెత్తించాయి. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా అభ్యర్థులు తమకు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల నేతలు రాష్ట్రంలో కీలకంగా ఎన్నికల ప్రచారం చేశారు. గతంతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నేతల హడావుడి బాగా కనిపించింది.

yearly horoscope entry point

27 రోజులు.....57 సభలు, రోడ్ షోలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

ముందుగా కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే ఈసారి కేంద్రంలో తాము ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఆ పార్టీ తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది. ముఖ్యంగా తెలంగాణలో జనజాతర పేరిట బహిరంగ సభలు నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ముగ్గురు కలిసి మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్రచారాలు నిర్వహించారు. వారి ప్రసంగాల్లో ఎక్కువగా తమకు ఎందుకు ఓటు వెయ్యాలి? పదేళ్లు బీజేపీ ఏం చేసింది? బీజేపీ మూడోసారి గెలిస్తే ఏం జరుగుతుంది? అనే అంశాలను కాంగ్రెస్ అగ్రనేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. వీరితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ప్రచారాలు చేసి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి సైతం అప్పటి జోష్ తోనే పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఏప్రిల్ 6, 2024 న తుక్కుగూడలో జన జాతర సభతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

మొత్తం 27 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి 57 సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలు,రోడ్ షోలలో అటు బీజేపీతో పాటు ఇటు మోదీపై కూడా ఆయన తనదైన స్టైల్ లో విమర్శలు చేస్తూ......కేడర్ లో జోష్ నింపారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి, సంక్షేమం గురించి సీఎం రేవంత్ ప్రజలకు వివరించారు. పదేళ్ల బీజేపీ పాలనపై అనేక ఆరోపణలు చేశారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు విమర్శలు, ప్రతీ విమర్శలతో ప్రచారం హీటెక్కింది.

13 రోజుల పాటు బస్సు యాత్రతో కేసీఆర్.

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సైతం రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించారు. కేసీఆర్ దాదాపు 13 లోక్ సభ నియోజకవర్గాలు పర్యటించి తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ పార్టీలో కేసీఆర్ బస్సు యాత్ర చేసి నూతన ఉత్సాహాన్ని నింపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించి సిద్ధిపేట జిల్లా పర్యటనతో ముగించారు. మొత్తం 16 రోజుల పాటు 13 పార్లమెంట్ సెగ్మెంట్లలో పర్యటించారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తో పాటు అటు కేంద్రంలో ఉన్న బీజేపీపై కూడా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరువు అంశాన్ని కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించి ప్రజలకు వివరించారు. మరోవైపు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు సైతం పార్లమెంట్ ఎన్నికల్లో కీలకంగా ప్రచారాలు చేశారు. కేటీఆర్ మొత్తం 82 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించగా......హరీష్ రావు 16 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించారు. వారు కూడా కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో పలు సందర్భాల్లో హరీష్ రావు, రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది.

మోదీ, అమిత్ షా కీలకంగా ప్రచారం

బీజేపీ విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ మరింత దృష్టి సారించింది. కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు తెలంగాణలోనే మకాం వేసి మరీ ప్రచారాలు నిర్వహించారు. రోడ్ షోలు, ర్యాలీలు బహిరంగ సభలు, కార్నర్ మీటింగులు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా,తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కువగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. కాగా ఈనెల 13న రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న వీటికి సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో వేచి చూడాలి.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner

సంబంధిత కథనం