Election Effect : సొంతూళ్లకు పయనమైన నగర వాసులు- రైళ్లు, బస్సులకు ఫుల్ డిమాండ్
Election Effect : ఎన్నికల పోలింగ్ కు మరో వారం మాత్రమే గడువు ఉండడంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్ల పయనమయ్యారు. దీంతో రైళ్లు, బస్సుల్లో రద్దీ పెరిగింది.
Election Effect : ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో నగర ప్రజలు తమ సొంతూళ్లకు పయనం అవుతున్నారు. పిల్లలకు వేసవి సెలవులు, ఇటు ఎన్నికలు ఉండడంతో వారం రోజుల ముందే ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళుతున్నారు. ఈనెల 13న తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్......ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఏపీకి చెందిన నగరవాసులకు హైదరాబాద్ తో పాటు తమ సొంత గ్రామాల్లో కూడా ఓటు హక్కు ఉండడంతో.... గ్రామాల్లో తమ ఉనికిని కాపాడుకోవడం కోసం అక్కడ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళుతున్నారు.
సికింద్రాబాద్ నుంచి 3 లక్షల మంది ప్రయాణం
హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ఆర్టీసీ బస్సులకు, రైళ్లకు భారీ డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, కాకినాడ, గుంటూరు ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ ట్రైన్స్ ఇప్పటికే రద్దీ పెరుగుతుంది. ఎండాకాలం కావడంతో ఏసీ కోచ్ లలో రిజర్వేషన్లు కూడా త్వరగా ముగుస్తున్నాయి. ఇటు దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ......గడిచిన రెండు రోజుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిందని రైల్వే అధికారులు వెల్లడించారు.
సాధారణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు 1.85 లక్షలు రాకపోకలు సాగిస్తే.....గత కొద్ది రోజులుగా ఆ సంఖ్య దాదాపు 3 లక్షలకు చేరిందని అధికారులు అంటున్నారు. అయితే ఈసారి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు, వాచ్ మెన్లు, సెక్యూరిటీ గార్డులుగా పని చేసే లక్షలాది మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడం గమనార్హం. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో స్థిరపడ్డ ఏపీ ప్రజలను తమ సొంతూళ్లకు తరలించేందుకు రాజకీయ పార్టీలు ప్రైవేట్ బస్సులను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాయట.
బస్సులకు కూడా విపరీతమైన డిమాండ్
హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు సైతం భారీగా డిమాండ్ పెరిగింది. సుమారు 1500 ఆర్టీసీ బస్సులు ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు బస్సులను నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆలోచిస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సైతం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచేందుకు యోచిస్తోంది. ఆర్టీసీ బస్సుల సంగతి ఇలా ఉంచితే.....అటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సైతం విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రైవేట్ బస్సులో బుకింగ్స్ కూడా పెరిగిపోయాయి. సాధారణం కంటే నగరంలో 1000 ప్రైవేట్ బస్సులు అదనంగా ఏపీకి రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రబాద్, కేపీహెచ్బీ నుంచి అధిక బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా