TS Political Drought : తెలంగాణలో ప్రధాన పార్టీల ప్రచారాస్త్రంగా 'కరవు', చివరికి లబ్ధి ఎవరికో?
TS Political Drought : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కరవు కీలకంగా మారింది. రాష్ట్రంలో కరవు పరిస్థితులను ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రంగా మార్చుకోవాలని భావిస్తున్నాయి.
TS Political Drought : పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో కరవు పరిస్థితులను(Telangana Drought Situation) ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నాయి. ఇది ప్రకృతి తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరవు అని ఒకవైపు బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే... కాంగ్రెస్ పార్టీ మాత్రం గత ప్రభుత్వ పాలన విధానాలతో పాటు ప్రకృతి తెచ్చిన కరవు అంటూ ఆరోపణలు తిప్పికొడుతుంది. ఇదిలా ఉంటే ఈ కరవుకు కాంగ్రెస్, బీఆర్ఎస్.....ప్రభుత్వాలు రెండూ కారణమని, కరవును అడ్డుకోవడం మానేసి రెండు పార్టీలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఇలా తెలంగాణలో కరవు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.
కాంగ్రెస్ తెచ్చిన కరవే- బీఆర్ఎస్
సాగు, తాగునీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని, ప్రాజెక్టుల గేట్లు ఎత్తి రైతుల సమస్యల పరిష్కరించడానికి బదులుగా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గేట్లు ఎత్తి వలస నేతలపై దృష్టి పెట్టిందని....ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congess Govt)బాధ్యత లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అసమర్థత, చేతకాని తనంతోనే రాష్ట్రంలో కరవు వచ్చిందని ప్రకృతి వనరులను కాపాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి ముందుచూపు లేదని ఆరోపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవేనంటూ జనంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఇటీవలే పలు జిల్లాలో పర్యటించి రైతులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. రైతు సమస్యలు పరిష్కారం కోసం రైతు దీక్షల(Rythu Deeksha) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే రూ.25 వేల పరిహారం చెల్లించడంతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని, రైతు రుణమాఫీ రెండు లక్షలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరవు సమస్య పైన విస్తృతంగా ప్రచారం చేయాలని బీఅర్ఎస్ భావిస్తుంది.
రైతు సత్యాగ్రహ దీక్షల పేరుతో బీజేపీ
రైతుల అంశాన్ని, కరవును ప్రస్తావిస్తూ బీజేపీ(BJP) నేతలు రాష్ట్రవ్యాప్తంగా రైతు సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తున్నారు. కరవు ఏ కారణంగా వచ్చినా...... ఆర్థికంగా నష్టపోయిన రైతులని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు(Congress Guarantees) అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ.... ఇప్పుడు పాంచ్ న్యా్య్ (Paanch Nyay)పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రైతు భరోసా, రుణమాఫీ, వరికి బోనస్, పంటల బీమా, రైతు కమిషన్ వంటి హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 10 ఏళ్ల రైతులను నట్టేట ముంచిన కేసీఆర్(KCR) ఇప్పుడు ఎండిన పంట పొలాలను సందర్శించడం విడ్డూరంగా ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. గతంలో 30 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఏనాడు సాయం అందించని కేసీఆర్..... ఇప్పుడు సిగ్గు లేకుండా అధికారం కోల్పోవడంతో రైతులపై ముసలి కన్నీరు కారుస్తున్నారు అని ఎద్దేవా చేస్తున్నారు.
గత ప్రభుత్వ పాలన వల్లే ఈ కరవు- కాంగ్రెస్
ఇదిలా ఉంటే మరో వైపు రైతులు, ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి సమస్యలకు కారణం గత ప్రభుత్వ పాలనే కారణమని అధికార కాంగ్రెస్ నేతలు(Congress) విమర్శిస్తున్నారు. దీని లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగం చేయాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలను ప్రజలకు వివరించనున్నారు. ఇదే పరిస్థితి ఇక పైన కొనసాగితే ఎలా సమాధానం చెప్పుకోవాలనే దానిపై ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. కరవుకు గత ప్రభుత్వమని విమర్శలు చేస్తూనే......పంట నష్టపోయిన రైతులకు పరిహారం(Conpensation for Farmers) చెల్లించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందట. దీంతో పాటు ఎలాంటి అంతరాయం లేకుండా సాగునీరు, తాగునీరు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను సైతం నియమించింది ప్రభుత్వం. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన అంశంగా మారిన కరవు(Drought Situation) ఎవరికి కలిసి వస్తుందో వేచి చూడాలి.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం