Gaddam Srinivas Yadav : హైదరాబాద్ ఎంపీ టికెట్ విద్యాసంస్థల అధినేతకు, బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా?
Gaddam Srinivas Yadav : బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా విద్యావేత్త గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన రాజకీయ నేపథ్యం తెలుసుకుందాం.
Gaddam Srinivas Yadav : హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR)ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన గడ్డం శ్రీనివాస్ యాదవ్(Gaddam Srinivas Yadav) ఈసారి హైదరాబాద్ ఎంపీ టికెట్(Hyderabad MP Ticket) దక్కించుకున్నారు. ప్రస్తుతం గోషామహల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడిగా గడ్డం శ్రీనివాస్ ఉన్నారు. 1989లో విద్యార్థి దశలోనే రాజకీయాలకు ఆకర్షితుడై NSUI లో చేరి నగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆల్ ఇండియా కార్యదర్శిగా గడ్డం శ్రీనివాస్ పనిచేశారు. 2006 లో నగర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియమితులై 2011 వరకు కొనసాగారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 2015లో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో గడ్డం శ్రీనివాస్ యాదవ్ చేరారు. అంతే కాకుండా తన తండ్రి గడ్డం గంగాధర్ యాదవ్ పేరిట ఫౌండేషన్ ఏర్పాటు సమయంలోనూ వేలాది కుటుంబాలకు నిత్యవసర సరుకుల కిట్ల పంపిణీ చేశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్తీబాట ద్వారా చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థులను గుర్తించి.....గత ఏడాది వారికి ఉచితంగా తన కళాశాలలో అడ్మిషన్లు కల్పించారు. అక్టోబర్ 28, 1968న జన్మించిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ బి.కాం చదివారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు భార్య స్వర్ణలత యాదవ్, కుమార్తె డాక్టర్ స్నేహ యాదవ్, కుమారుడు న్యాయవాది గగన్ యాదవ్ ఉన్నారు. ప్రస్తుతం గడ్డం శ్రీనివాస్ హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజీలు అలాగే శ్రీ హిందూ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఛైర్మెన్ గా కొనసాగుతున్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం- గడ్డం శ్రీనివాస్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంటింటా తిరిగి గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించి తప్పకుండా విజయం సాధిస్తానని గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు(Congress BJP Govts) చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తానన్నారు. తనకు ఎంపీ టికెట్ కేటాయించిన సందర్బంగా మాజీ సీఎం కేసీఆర్ కు, మాజీ మంత్రి కేటీఆర్(KTR), హరీశ్ రావు లకు గడ్డం శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congres Govt) ఏర్పడి 100 రోజులు దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయిందని ఆయన విమర్శించారు.
తప్పకుండా విజయం సాధిస్తా
ప్రజలకు కాంగ్రెస్ గురించి అర్థమైందని ఈసారి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్(BRS) పార్టీకే పట్టం కట్టనున్నారని గడ్డం శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా(Telangana) తీర్చిదిద్దేందుకు మాజీ సీఎం కేసీఆర్(KCR) అహర్నిశలు శ్రమించారు. అనేక సంక్షేమ పథకాలను ప్రజల కోసం తెచ్చారని గుర్తు చేశారు. ప్రజలకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ విలువ తెలుస్తుందనీ, కేసీఆర్ లేని లోటు ప్రతీ పల్లెలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక కాంగ్రెస్, బీజేపీలు ఓర్వలేక పోతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ప్రజల మద్దతుతో ఘన విజయం సాధిస్తానని గడ్డం శ్రీనివాస్ యాదవ్(Gaddam Srinivas Yadav) ధీమా వ్యక్తం చేశారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం