TS Congress Candidates List : తెలంగాణలో మరో 4 స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు, జాబితా ఇలా!
TS Congress Candidates List : తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
TS Congress Candidates List : కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘ చర్చల అనంతరం లోక్ సభ అభ్యర్థుల 8వ జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో తెలంగాణ నుంచి నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఏఐసీసీ అభ్యర్థుల ప్రకటనలో పొరపాటు చేసింది. ఆదిలాబాద్ అభ్యర్థి పేరును తప్పుగా రాసింది. ఆదిలాబాద్ స్థానానికి ఆత్రం సుగుణ పేరుకు బదులుగా డా.సుగుణ కుమారి చెలిమల అని ప్రకటించింది. అనంతరం ఆ పేరును సరిచేసింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు
- ఆదిలాబాద్(ST)- ఆత్రం సుగుణ
- నిజామాబాద్-తాటిపర్తి జీవన్ రెడ్డి
- మెదక్-నీలం మధు
- భువనగిరి-చామల కిరణ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ ఎనిమిదో లిస్ట్ లో 14 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్ లోక్ సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
గత జాబితాల్లో ప్రకటించిన అభ్యర్థులు
- పెద్దపల్లి - గడ్డం వంశీకృష్ణ
- మల్కాజ్ గిరి - సునీతా మహేందర్ రెడ్డి
- సికింద్రాబాద్ - దానం నాగేందర్
- చేవెళ్ల - డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
- నాగర్ కర్నూల్ - డాక్టర్ మల్లు రవి
- నల్గొండ- రఘువీర్ రెడ్డి
- జహీరాబాద్ -సురేశ్ షెట్కర్
- మహబూబాబాద్(ఎస్టీ)-బలరామ్ నాయక్
- మహబూబ్ నగర్- వంశీ చందర్ రెడ్డి
తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా... ఇప్పటి వరకూ 13 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. త్వరలోనే మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుందని సమాచారం. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఖమ్మంపై కొనసాగుతున్న ఉత్కంఠ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలీయమైన శక్తిగా మారిన కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీ(Khammam Lok Sabha) స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే మీమాంస ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ అభ్యర్థిని తిరిగి ఖమ్మం బరిలో నిలుపుతుండగా భారతీయ జనతా పార్టీ సైతం అభ్యర్థిని ఖరారు చేసింది. బీజేపీ ఆచితూచి హిందుత్వ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన అభ్యర్థి తాండ్ర వినోద్ రావును ఎన్నికల బరిలో నిలిపింది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని(Khammam Congress MP candidate 2024) ఖరారు చేయడంలో ఇంకా మల్లగులాలు పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ఖమ్మం జిల్లా నేతలు ముగ్గురు ఎంపీ టిక్కెట్ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో అభ్యర్థిని ఖరారు చేయడం అధిష్టానానికి పెద్ద సవాలుగా మారిపోయింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తమ వారికి టిక్కెట్ ఇప్పించుకునే క్రమంలో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.