BRS BSP Alliance : ఎన్నికల వేళ సరికొత్త పొత్తు...! ఎవరికెన్ని సీట్లు...?
BRS BSP Alliance in Telangana: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కొత్త పొత్తు పొడిచింది. బీఆర్ఎస్ - బీఎస్పీ పార్టీలు కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
BRS BSP Alliance in Telangana: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత… రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో… బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానంలో ఉంది. ఇక బీజేపీ ఎనిమిది ఎమ్మెల్యేలను గెలుచుకుని బలాన్ని పెంచుకుంది. అయితే లోక్ సభ ఎన్నికలు వస్తున్న వేళ…. ప్రధాన పార్టీలు మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని భావిస్తున్నాయి. ఇదే సమయంలో….తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన కేసీఆర్(KCR)… ఈసారి పొత్తుతో బరిలోకి దిగుతున్నారు. బహుజన సమాజ్ పార్టీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.
ఎవరికి ఎన్ని సీట్లు….?
పొత్తుకు సంబంధించి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… కేసీఆర్ తో చర్చలు జరిపారు. ఇద్దరు నేతలు కూడా పొత్తు ఉంటుందని ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు… ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారనే విషయంపై ప్రకటన చేయలేదు. రేపోమాపో దీనిపై ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ ఒంటరిగానే బరిలో ఉంటుందని అంతా భావించినప్పటికీ… ఇప్పుడు తెరపైకి పొత్తు(BRS BSP Alliance) రావటంతో సీన్ మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఐదు స్థానాలకు అభ్యర్థులకు కూడా ప్రకటించింది బీఆర్ఎస్. ఇందులో పెద్దపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్థానాల విషయంలో మరోసారి పునరాలోచన చేసి ఏమైనా మార్పులు చేస్తారా అన్న చర్చ మొదలైంది. లేకపోతే మిగిలిన స్థానాల్లోనే బీఎస్పీకి సీట్లు కేటాయిస్తారా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు(Loksabha Elections 2024) ఉండగా… ఇందులో పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడుగా ఉన్నాయి. ఆదిలాబాద్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుడుగా ఉండగా… మిగిలిన సీట్లు జనరల్ కోటాలో ఉన్నాయి. పొత్తు ప్రకటన వెలువడిన నేపథ్యంలో… బీఎస్పీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
ఆర్ఎస్పీ పోటీ ఎక్కడ్నుంచి…?
పొత్తులో భాగంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(rs praveen kumar)… లోక్ సభ ఎన్నికల బరిలో ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే ఆయన్ను నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పొత్తులో భాగంగా కూడా ఆయన్ను బరిలో ఉంచితే ప్రధాన పార్టీలకు గట్టి పోటీదారుడిగా మారుతారని కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేరు ఇప్పటికే ఖరారైంది. మరో ఎస్సీ రిజర్వ్డు నియోజకవర్గమైన వరంగల్ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ఒకవేళ నాగర్ కర్నూల్ నుంచి కుదరకపోతే…. వరంగల్ నుంచి ఆర్ఎస్పీ పోటీ చేసే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంటే… ఎస్సీ రిజర్వ్ డు నియోజకవర్గం కాకుండా జనరల్ స్థానం నుంచి కూాడా ఆర్ఎస్పీని బరిలో ఉంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ విషయంలో రెండు పార్టీల మధ్య చర్చలు జరిగి సఫలీకృతమైతే…. ఆర్ఎస్పీ జనరల్ సీటు నుంచి కూడా పోటీ చేయవచ్చు. అయితే బీఎస్పీకి ఒక్క సీటు ఇస్తారా లేక రెండు సీట్లు కేటాయిస్తారా అనేది అతి త్వరలోనే తేలిపోనుంది.
మొత్తంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే కాకుండా బీఎస్పీ కూడా ఒంటరిగానే పోటీ చేసేంది. అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికల వేళ రెండు పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించుకోవటంతో…. రాజకీయముఖ చిత్రం మారే అవకాశం ఉంది.
సంబంధిత కథనం