Bandi Vs Ponnam: ఎంపీ వర్సెస్ మినిస్టర్… బండి పాదయాత్రలో హైటెన్షన్… పోటాపోటీగా నిరసనలతో ఉద్రిక్తత
Bandi Vs Ponnam: మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
Bandi Vs Ponnam: శ్రీరాముడి జన్మ స్థలంపై మంత్రి పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత పాదయాత్రలో మంత్రి పొన్నం తల్లిని ప్రస్తావిస్తూ కామెంట్స్ చేయడంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో మాటల మంటలంటుకున్నాయి.

దీంతో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లోని గ్రామాల్లో మంగళవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మంత్రి పొన్నం తల్లిని బండి సంజయ్ అవమానించారని ఆరోపిస్తూ కరీంనగర్ Karimnagar జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి వద్ద కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఉద్రికత్త నెలకొంది. కొంతమంది కాంగ్రెస్ Congressనేతలు యాత్రపై రాళ్లు విసరడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
మంగళవారం ఉదయం నుంచి పాదయాత్ర కొనసాగినంత వరకు అదే వాతావరణం కొనసాగింది. దీంతో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి, పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు.
పోలీసుల దిగ్బంధంలో భీమదేవరపల్లి
మంగళవారం ఉదయం నుంచి హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో కొనసాగిన బండి సంజయ్ పాదయాత్ర రాత్రికి హనుమకొండ జిల్లాలోకి ఎంటర్ కావాల్సి ఉంది. అక్కన్నపేట మండలం నుంచి హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి పాదయాత్ర ఎంటర్ అయి.. రాత్రి వరకు కొత్తకొండ గ్రామానికి చేరుకోవాల్సి ఉంది.
ఉదయం నుంచి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు భీమదేవర పల్లి మండంలోని మల్లారం, కొత్తకొండ గ్రామాలను చుట్టుముట్టారు. అష్టదిగ్బంధం చేసి ఎక్కడికక్కడ బలగాలు మోహరించారు. దీంతో ఆ రెండు గ్రామాల్లో ఎటు చూసినా ఖాకీలే కనిపించారు.
పెద్ద ఎత్తున పోలీస్ Police బలగాలు మోహరించడంతో గ్రామస్థుల్లోనూ భయాందోళన వ్యక్తమైంది. వందల సంఖ్యలో పోలీసులు మోహరించగా.. బండి సంజయ్ పాదయాత్ర జిల్లాలోకి ఎంటరైన వెంటనే ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది.
దీంతో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, పార్టీ స్థానిక నేతలు మంగళవారం సాయంత్రం వరకే కొత్తకొండ గ్రామానికి చేరుకున్నారు. ఓ వైపు కాషాయ దండు, మరోవైపు లాఠీలు పట్టిన ఖాకీలతో గందరగోళ పరిస్థితులు కనిపించాయి.
పోలీసులు బండి సంజయ్ రాత్రి బస చేయాల్సిన కొత్తకొండ హరిత హోటల్ ను చుట్టుముట్టగా.. ఏ క్షణంలో అరెస్ట్ చేస్తారోననే టెన్షన్ అందరిలోనూ కనిపించింది. కాంగ్రెస్ నేతల నిరసనల నేపథ్యంలోనే బందోబస్తు కోసం పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించారనే చర్చ కూడా జరిగింది.
ఉద్రిక్తతల నడుమ కొత్తకొండకు బండి సంజయ్
ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాదయాత్ర సాగా.. మంగళవారం రాత్రి బండి సంజయ్ హనుమకొండ జిల్లాలోకి ఎంటర్ అయ్యారు. భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామానికి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో చేరుకోగా.. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, పార్టీ స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
పోలీసులు కూడా అలర్ట్ అయి పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఆ తరువాత మల్లారం నుంచి కొత్తకొండ గ్రామానికి చేరుకున్న బండి సంజయ్.. హరిత హోటల్ లో బస చేశారు. కాగా బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర బుధవారం భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో కొనసాగనుంది.
ఉదయం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న బండి సంజయ్ ఆ తరువాత గట్ల నర్సింగాపూర్ నుంచి పాదయాత్ర కొనసాగించనున్నారు. అక్కడి నుంచి వంగర, ముల్కనూరు మీదుగా ఎల్కతుర్తి మండలంలోని గోపాలపూర్, దామెర, చింతలపల్లి, ఎల్కతుర్తి, సూరారం, దండేపల్లి మీదుగా కమలాపూర్ మండలంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. కమలాపూర్ మండలంలోని దేశరాజ్ పల్లి, కనిపర్తి మీదుగా కమలాపూర్ చేరుకోనుంది.
ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారని, ఈ మేరకు ఎంపీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగానే ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, కేవలం ఒకట్రెండు పథకాలు మాత్రమే అమలు చేస్తూ మిగతా వాటిని గాలికొదిలేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 80 రోజులు దాటి పోయిందని, ఇంకో పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండగా.. ఆ లోగానే ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించడానికే తాను ప్రజాహిత పాదయాత్ర చేపట్టినట్లు బండి సంజయ్ వివరించారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)