EC Notice to CM Revanth : సీఎం రేవంత్‌ రెడ్డికి ఈసీ నోటీసులు-election commission issues notice to cm revanth reddy ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ec Notice To Cm Revanth : సీఎం రేవంత్‌ రెడ్డికి ఈసీ నోటీసులు

EC Notice to CM Revanth : సీఎం రేవంత్‌ రెడ్డికి ఈసీ నోటీసులు

Maheshwaram Mahendra Chary HT Telugu
Published May 10, 2024 07:53 PM IST

EC Notice to CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ పై చేసిన పలు వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

Election Commission Notice to CM Revanth: తెలగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై వ్యక్తిగతంగా ,అసభ్యపదజాలం వాడినందుకు నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

అసభ్య పదజాలంతో కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి దూషిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం…. రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కాపీని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కు పంపింది. ఫిర్యాదులోని అంశాలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఎన్నికల వేళ నేతల ప్రసంగలు, కామెంట్లపై ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలకు ఈసీ(Election Commission of India) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(K Chandrasekhar Rao) కు కూడా నోటీసులు పంపింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు వచ్చాయి.

ఏప్రిల్ 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో…. కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేశారు కేసీఆర్. సిరిసిల్ల కార్మికులను ఉద్దేశించి ఓ కాంగ్రెస్ నేత నిరోధులు , పాపడాలు అమ్ముకోవాలని అన్నారంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పాలనను దుయ్యబడుతూ… ఫైర్ అయ్యారు. చవటలు, దద్దమ్మలతో పాటు పలు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు కాంగ్రెస్ నేతలు ఈసీకి(Election Commission of India) ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం… కేసీఆర్ కు నోటీసులను పంపింది. ఏప్రిల్ 18వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కేసీఆర్ వివరణతో సంతృప్తి చెందని ఎన్నికల సంఘం… చర్యలు చేపట్టింది. 48 గంటలపాటు ప్రచారంపై నిషేధించింది. దీంతో రెండు రోజుల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరం కావాల్సి వచ్చింది. 

ఈసీ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలపై లేని చర్యలు ఒక్క కేసీఆర్ పైనే ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రతి సభలో అసభ్యపదజాలంతో దూషిస్తున్న రేవంత్ పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. 

Whats_app_banner