Loksabha Elections 2024 : ముగిసిన ప్రచార హోరు - పోల్ మేనేజ్మెంట్‌పై ప్రధాన పార్టీల గురి
Loksabha Elections in Telangana 2024: ప్రచారానికి తెరపడింది. గంటల వ్యవధిలోనే పోలింగ్ ప్రక్రియ షురూ కానుంది. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పలు పార్టీలు పావులు కదుపుతున్నాయి.
Loksabha Elections in Telangana 2024: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రలోబాలకు తెరలేచింది. చివరి ప్రయత్నంగా ఓటర్ దేవుళ్ళ ప్రసన్నం కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు.
ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటు ప్రలోభపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. పోలింగ్ కు గడువు దగ్గర పడుతుండడంతో ఆఖరి ప్రయత్నంగా నయానో భయానో నాలుగు ఓట్లు పొందడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 29 లక్షల 79 వేల మంది ఓటర్లు ఉండగా 5852 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 1466 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ తోపాటు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు అధికారులు. పోలింగ్ ముగిసే వరకు 13న సాయంత్రం వరకు మద్యం షాప్ లను ముసివేయడంతోపాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
కరీంనగర్ బరిలో 28 మంది అభ్యర్థులు
మునుపెన్నడు లేనివిధంగా ఈసారి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజేపి, బిఆర్ఎస్ తోపాటు 20 మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులు ప్రజాతీర్పు కోరుతున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 17 లక్షల 97 వేల 150 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషుల కంటే మహిళా ఓటర్లు 42 వేల మంది ఎక్కువగా ఉన్నారు. వారంతా ఓటు హక్కు వినియోగించుకునేలా 2194 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 288 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి అక్కడ పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి తెలిపారు.
సిపి అభిషేక్ మోహంతితో కలిసి మీడియాతో మాట్లాడిన కలెక్టర్… 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. 42 వేల మంది దివ్యాంగ ఓటర్లు, వయోవృద్ధులు 13200 మంది ఓటర్లు ఉన్నారని వారంత ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
పోలింగ్ సిబ్బంది 10200 మంది,,,
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ నిర్వహణ కోసం 10200 మంది వినియోగిస్తున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్ విధులు నిర్వహించే 10200 మంది ఉండగా అందులో 8815 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 86.5% నమోదయిందని వివరించారు. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ) కింద నమోదు చేసుకున్న 6800 మంది ఉద్యోగులు పోలింగ్ రోజున ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు. పోలింగ్ స్టేషన్ లో రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడ ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా 21 ఎఫ్ ఎస్ టి, 14 ఎస్ఎస్టి టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు.
సి విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 200 ఫిర్యాదులు వచ్చాయని, 144 ఫిర్యాదులను పరిష్కరించామని పేర్కొన్నారు. మొత్తం 215 రూట్లలో 216 మంది సెక్టార్ ఆఫీసర్లను నియమించామని, ఈవీఎంలను తీసుకెళ్లే వెహికల్స్ కు జిపిఎస్ అనుసంధానం ఉంటుందని తెలిపారు.
తనిఖీల్లో 8.86 కోట్ల నగదు పట్టివేత
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన తనిఖీల్లో 8.86 కోట్ల నగదు పట్టుకుని సీజ్ చేశామని ఆర్వో తెలిపారు. రెండు కోట్ల 11 లక్షల రూపాయల విలువ చేసే మద్యం, నాలుగు కోట్ల 87 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని సీజ్ చేశామని ప్రకటించారు.
ఓటర్లు 12 రకాల ధ్రువీకరణ పత్రాలతో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహిస్తామని, ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో 5500 బ్యాలెట్ యూనిట్స్, 2743 కంట్రోల్ యూనిట్స్, 3077 వివి ప్యాట్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టామని కలెక్టర్ వివరించారు.
16 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు….
పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేంకు పకడ్బందీగా చర్యలు చేపట్టామని కరీంనగర్ సిపి అభిషేక్ మోహంతి తెలిపారు. ప్రచారం ముగిసినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు నిఘా ముమ్మరం చేశామని తనిఖీలు నిరంతరాయంగా కొనసాగిస్తామని చెప్పారు. ఇప్పటికే కోడ్ ఉల్లంఘనపై 16 కేసులు నమోదు చేశామని వివరించారు. 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు అక్రమంగా డబ్బులు మద్యం సప్లైని నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని చెప్పారు.
ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2500 మంది పోలీసులతోపాటు నాలుగు కంపెనీల సెంట్రల్ ఫోర్స్ తో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టామని తెలిపారు.
54 స్పెషల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లకు పారా మిలటరీ సిబ్బందిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 1106 పోలింగ్ స్టేషన్లల్లో 106 రూట్లలో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్పెషల్ ఫోర్సు, స్ట్రైకింగ్ ఫోర్సును సీఐ, డీఎస్పి స్థాయి అధికారి పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.