TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!
TG Graduate MLC By Election 2024 Updates : నల్గొండ -ఖమ్మం -వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బీఆర్ఎస్ కు సవాల్ గా మారింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని అధినాయకత్వం భావిస్తుంటే… అభ్యర్థి ఖరారు విషయం వరంగల్, నల్గొండ జిల్లా నేతల మధ్య విబేధాలకు ఆజ్యం పోసినట్లు అయిందన్న చర్చ వినిపిస్తోంది.
Telangana Graduate MLC Elections 2024: నల్గొండ - ఖమ్మం - వరంగల్ ’ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో కొత్త పంచాయితీకి తెరలేపాయి.
పార్టీ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన ఏనుగు రాకేష్ రెడ్డిని ఖరారు చేయడం నల్గొండ జిల్లా నాయకులకు సుతారాము ఇష్టం లేనట్లు తెలుస్తోంది. అధినాయకత్వం ఒక విధంగా ఏకపక్షంగా అభ్యర్థిని ఖరారు చేసిందన్న భావనలో ఆ పార్టీ నల్గొండ జిల్లా నేతలు ఉన్నారు. దీని ప్రభావం ప్రస్తుతం ఎన్నికల ప్రచారంపై పడుతోంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందటి వరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో అధికార ప్రతినిధిగా ఉన్న రాకేష్ రెడ్డి, ఆ పార్టీ నుంచి హన్మకొండ టికెట్ లభించకపోవడంతో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. ఆరు నెలలు తిరక్కుండానే బయటి పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి, పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న వారిని పక్కన పెట్టడాన్ని పార్టీలోని ఓ వర్గం ఆక్షేపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నాయకత్వం వరంగల్, నల్గొండ జిల్లాలుగా, రెండు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది.
రాకేష్ రెడ్డికి అనూహ్యంగా టికెట్…!
బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన రాకేష్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ అనూహ్యంగానే దక్కింది. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రె డ్డికి దగ్గరి వ్యక్తిగా పేరున్న రాకేష్ రెడ్డికి టికెట్ దక్కడం వెనుక పల్లా ఉన్నారని అంటున్నారు. శాసన మండలి పునరుద్దరణ తర్వాత ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగితే.. అన్ని సార్లూ బీఆర్ఎస్ విజయం సాధించింది. తొలి రెండు పర్యాయాలు కపిలవాయి దిలీప్ కుమార్, ఆ తర్వాత రెండు సార్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. జనగామ శాసన సభ్యునిగా ఎన్నికైనందున డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు నుంచీ పార్టీలో కొనసాగిన నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే.. సీనియర్లను కాదని కేవలం ఆరు నెలల కిందటే పార్టీలోకి వచ్చిన రాకేష్ రెడ్డికి టికెట్ దక్కడంతో నల్గొండ జిల్లాకు చెందిన నాయకలతో పాటు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిపత్యాన్ని నిరిసిస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన నాయకలు సైతం సహాయ నిరాకరణ పాటిస్తున్నారు.
ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంది. అంటే నిండా ఓ వారం రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. దీంతో పట్టభద్రుల్లోకి వెళ్లి జోరుగా ప్రచారం చేయాల్సిన స్థానం ఆ ఊపు కనిపించడం లేదు. ఆదివారం నల్గొండ జిల్లాలో అభ్యర్థి ప్రచారం షురూ చేసినా.. ముఖ్య నాయకులు ఎవరూ హాజరు కాలేదు. అంతే కాకుండా, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు సైతం అంటీముట్టనట్టున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లోక్ సభ ఎన్నికల ప్రభావం.. ఎమ్మెల్సీ ఎన్నికపై పడుతోందా?
ఇటీవలే ముగిసిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికపై పడుతున్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్ సభ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ తర్వాత పార్టీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడిపోయాయి. ఎక్కడా గెలిచే అవకాశాలు కనిపించకపోగా, ఆ ఎన్నికల్లో అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకోలేదు. ప్రచార ఖర్చుల విషయంలోనూ వీరిలో కొంత అసంత్రుప్తి కనిపిస్తోంది.
కింది స్థాయి కేడర్ పూర్తిగా చేతులు ఎత్తేసిన అభ్యర్థుల తీరుతో నిరాశకు గురయ్యారు. ఈ దశలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలోనూ మాజీ ఎమ్మెల్యేలు అంటీముంటనట్టుగానే వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.ఇక, ఎమ్మెల్సీ టికెట్ విషయంలో అధిష్టానం తమ మాటను లెక్క చేయలేదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని కూడా కొంత దూరంగానే ఉంటున్నారు.
ప్రధానంగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక్కరే ఈ ఎన్నికను భుజాన వేసుకున్నారని, మిగిలిన నాయకులు, ఆయన తీరుపై నిరసనతో పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మొత్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక బీఆర్ఎస్ లో కొత్త కుంపటి రాజేయగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ అభ్యర్థికి ఊపు లేకుండా పోయింది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, HT TELUGU నల్గొండ )
సంబంధిత కథనం