Ts Congress Rahul Gandhi: తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ లేనట్టేనా..? రాహుల్ పోటీపై భిన్నాభిప్రాయాలు…
Ts Congress Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తారా లేదా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. రాహుల్ పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నా ఏ మేరకు సాధ్యమనే చర్చ పార్టీలో జరుగుతోంది.
Ts Congress Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇంతకూ ఎక్కడి పోటీ చేస్తారు..? 2019 లోక్ సభ LokSabha ఎన్నికల్లో ఆయన ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీ నుంచి అదే మాదిరిగా కేరళ రాష్ట్రం వయనాడ్ నియోజకవర్గాల నుంచి ఎంపీగా పోటీ చేశారు. అమేథీలో ఓటమి పాలైన ఆయన వయనాడ్ లో మాత్రం విజయం సాధించారు.
మరి.. 2024 లోక్ సభ ఎన్నికల్లో Rahul ఎక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు..? కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్టుగానే రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి లేదా ఖమ్మం లోక్ సభ స్థానాల నుంచి పోటీచేసే అవకాశం నిజంగానే ఉందా..? అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
రాహుల్ గాంధీ పోటీపై భిన్నాభిప్రాయాలు
దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో వరసగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ సారి కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని పట్టుదలగా శ్రమిస్తున్న కాంగ్రెస్ కు ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విజయాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఒకరు పోటీ చేయడం వల్ల మిగిలిన స్థానాలపై ప్రభావం ఉంటుందన్న భావనతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ పీసీసీ T PCC) ఆధ్వర్యంలో ముందుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని పోటీ చేయాలని కోరారు.
సోనియా ఇటీవలే రాజ్యసభకు ఎంపిక కావడంతో ఇపుడు రాహుల్ గాంధీని రాష్ట్రం నుంచి బరిలోకి దింపాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి కానీ, లేదంటే తెలంగాణ నుంచి ఆయన పోటీలో ఉంటారని ప్రచారం చేశారు.
రాహుల్ పోటీ చేస్తే....?
తెలంగాణ విషయానికి వచ్చే సరికి ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని భువనగిరి Bhuvanagiriలోక్ సభా నియోజకవర్గం నుంచి లేదంటే.. ఖమ్మం లోక్ సభా నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీని పోటీ చేయించాలని, ఈ మేరకు ఆయనకు విన్నవించారు.
2023 శాసన సభ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలో కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. భువనగిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. ఖమ్మం పరిధిలోని ఏడు సెగ్మెంట్లకు గాను ఏడుకు ఏడు కాంగ్రెస్ జేబులోనే ఉన్నాయి.
ఈకారణంగానే రాహుల్ గాంధీ నుంచి ఈ రెండు చోట్ల నుంచి ఎక్కడో ఒక చోటు నుంచి పోటీచేయిస్తే పార్టీకి లాభం జరుగుతుందని ప్రయత్నించారు. రాహుల్ పోటీ చేస్తే.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ముఖ ద్వారంగా ఉండే భువనగిరి ద్వారా ఆ జిల్లాల్లో అదే మాదిరిగా, సరిహద్దుగా ఉన్న హైదరాబాద్ నగరంలోని రెండు స్థానాలపై మంచి ప్రభావం ఉంటుందని భావించారు.
ఒక వేళ ఖమ్మం అయ్యే పక్షంలో ఏపీకి సరిహద్దుగా ఉన్న ఈ జిల్లా ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు, ఏపీలోనూ సత్ఫలితాలు సాధించ వచ్చన్న వ్యూహం కూడా ఉంది. ఈ కారణంగానే ఈ రెండు చోట్ల నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రచారం చేసింది.
ఇంతకూ ఎక్కడి నుంచి..?
ఏఐసీసీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీ ఇంతకూ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? అన్న అంశాలపై రక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలతో కలిసి ఉన్న ‘ ఇండియా ’ కూటమిలో వాపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం లు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.
సీపీఐ ఈ సారి కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కానీ, కాంగ్రెస్ నాయకత్వం మాత్రం రాహుల్ గాంధీని ఈ సారి కూడా వయనాడ్ నుంచే పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి. మరో వైపు సుదీర్ఘ కాలంగా గాంధీల కుటుంబానికి అండగా, ప్రధాన కేంద్రంగా ఉంటూ వస్తున్న అమేథీ నియోజకవర్గం నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేయాలన్న డిమాండ్ కాంగ్రెస్ లో ఉంది.
2019 ఎన్నికల మాదిరిగానే, అమేథీ, వయనాడ్ రెండు లోక్ సభ నియోజకవర్గాల నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకటీ రెండు రోజుల్లో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల కానుండటంతో ఆయన తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేసే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )