Telangana Crop Loans : ప్రచారంలో పదే పదే ప్రకటన - రుణమాఫీపై రైతుల్లో పెరుగుతున్న ఆశలు, కీలకంగా కటాఫ్ తేదీ..!
Crop Loan Waiver in Telangana: ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ … రైతు రుణమాఫీని ప్రచార అస్త్రంగా వాడుతోంది. స్వయంగా సీఎం రేవంత్ పదే పదే ప్రకటనలు చేస్తుండటంతో రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి.
Telangana Crop Loan Waiver Scheme: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మెజార్టీ సీట్లలో పాగా వేయటమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ప్రత్యేకంగా మేనిఫెస్టోను ప్రకటించినప్పటికీ… రుణమాఫీ అస్త్రాన్ని గట్టిగా వాడుతోంది.
సీఎం పదే పదే ప్రకటన…
రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా స్పందిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటన చేసినప్పటికీ డిసెంబర్ 9 గడువు దాటిపోయింది. అయితే ఈసారి ఆగస్టు 15వ తేదీలోపు రూ. 2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా దేవుళ్లపై కూడా ప్రమాలు చేసి మరీ వాగ్ధానం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ పదే పదే ప్రకటన చేస్తున్న నేపథ్యంలో రైతు రుణమాఫీపై రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ తప్పకుండా అవుతుందా అన్న చర్చ పల్లెల్లో జోరుగా జరుగుతోంది. అనేక సభలు, ర్యాలీల్లో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ ప్రకటన చేస్తుండటంతో ఈ ప్రక్రియను ఎలా చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇదే విషయంపై ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లకు కూడా దారి తీసిన సంగతి తెలిసిందే.
ఏకకాలంలో రైతుల రుణమాఫీ ఎలా సాధ్యమవుతుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్రంలో ఉన్న రైతు రుణాల మాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే విషయంపై రేవంత్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ. 32 వేల కోట్ల పంట రుణాలను క్లియర్ చేయాలని చూస్తోంది. ఇదే విషయంపై ఇప్పటికే బ్యాంకర్లతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. బ్యాంకుల ముందు పలు రకాల ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. క్రాప్ లోన్లను మొత్తం ప్రభుత్వమే టేకోవర్ చేసుకోని బ్యాంకులకు ఈఎంఐల రూపంలో చెల్లించే అవకాశం ఉందని సమాచారం.
కీలకంగా కటాఫ్ తేదీ…!
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత… రుణమాఫీపై స్పష్టమైన ప్రకటనతో కూడిన ఉత్తర్వులు రానున్నాయి. ఇక రైతు రుణమాఫీ విషయంలో కటాఫ్ తేదీ అనేది అత్యంత కీలకం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం… ఏ తేదీని కటాఫ్ గా నిర్ణయిస్తుందనేది కీలకంగా మారింది.
కటాఫ్ తేదీపై కూడా ప్రభుత్వం ప్రాథమికంగా పలు తేదీలను కూడా నిర్ణయించినట్లు తెలిసింది. అధికారంలోకి వచ్చిన రోజు అయితే డిసెంబర్ 7ను తీసుకునే అవకాశం ఉంది. ఇది కుదరకపోతే ఫలితాలు ప్రకటించిన డిసెంబర్ 3వ తేదీని కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. లేక ఇంకా వేరే ఏదైనా తేదీని ప్రమాణికంగా తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంటుంది…!
సంబంధిత కథనం