MP K Keshava Rao : ఘర్ వాపసీ...! కాంగ్రెస్ గూటికి కేకే..? ప్రకటనే మిగిలిందా..?
MP K Keshava Rao Congress: బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే కేశవరావు పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
MP K Keshava Rao : బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కే కేశవరావు(BRS MP K Keshava Rao)…. ఆ పార్టీని వీడేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవలే ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ… కేశవ రావుతో పాటు ఆయన కుమార్తె, మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పార్టీ మార్పుపై విజయలక్ష్మీతో పాటు కేకే ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు. మరోవైపు పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో… ఇవాళ కేశవరావు… కేసీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్లారు. కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇందులో పార్టీ మార్పుపై సమాచారం ఇచ్చారని తెలిసింది. కేకే నిర్ణయంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
మార్చి 30న కాంగ్రెస్ లో చేరిక…?
మార్చి 30వ తేదీన కేకే.. కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు పది మంది కార్పొరేటర్లు కూడా హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై అధికారికంగా కేకే కుటుంబం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. కేసీఆర్ తో భేటీ ముగిసిన తర్వాత హైదరాబాద్ కు చేరుకున్న కేకే…. పార్టీ మార్పుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మీడియాను దాటవేస్తూ ఇంటి లోపలికి వెళ్లిపోయారని తెలిసింది.
తెలంగాణ ఉద్యమంలో పార్టీ మార్పు…
కే కేశవరావు… కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. అనేక పదవులు కూడా అనుభవించారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ తో కలిసి పని చేస్తూ వచ్చారు. పార్టీలో కూడా ఆయనకు అధికా ప్రాధాన్యత లభించింది. రెండుసార్లు ఎంపీగా(రాజ్యసభ) అవకాశం దక్కింది. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా కూడా ఉన్నారు. మరోవైపు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కేకే…. బీఆర్ఎస్ పార్టీలో కూడా సీనియర్ నేతగా మెలిగారు.
ఓవైపు కేకే ఎంపీగా ఉండగానే… ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మీ హైదరాబాద్ నగరంలో కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. అయితే ఆమెకు మేయర్ స్థానాన్ని కట్టబెట్టింది బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధినాయకత్వం. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కావటంతో… పరిణామాలన్నీ మారిపోయాయి. కేవలం 39 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష పార్టీగా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ…. ఘర్ వాపసీ అంటోంది. అంతేకాదు ఆపరేషన్ ఆకర్ష్ తో నేతలను పార్టీలోకి రప్పిస్తోంది. ఇప్పటికే చాలా మంది నేతలను పార్టీలో చేర్చుకోగా… ఇటీవలే కేకేతో కూడా సంప్రదింపులు కూడా జరిపింది. ఈ నేపథ్యంలోనే…. కేకేతో పాటు ఆయన కుమార్తె…. హస్తం కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.