Bhuvanagiri Loksabha: భువనగిరిలో గెలుపెవరిది… మూడు పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్టు ప్రచారం
Bhuvanagiri Loksabha: భువనగిరిలో గెలుపు కోసం మూడు పార్టీల మధ్య నువ్వా, నేనా అన్నట్టు పోటీ కొనసాగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, మ్యాజిక్ చేయాలని బీజేపీ, బీఆర్‌ఎస్ తహతహలాడుతున్నాయి.
Bhuvanagiri Loksabha: భువనగిరి లోక్ సభ నియోజకవర్గం 2008లో నియోజక వర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. ఈ నియోజక వర్గానికి తొలిసారి 2009లో ఎన్నికలు జరిగాయి. దీని పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ అసెంబ్లీ సెంగ్మెంట్లు ఉన్నాయి.
మూడు జిల్లాల పరిధిలో భువనగిరి పార్లమెంటు స్థానం విస్తరించి ఉంది. ఇప్పటికీ 2009, 2014, 2019 లలో మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో రెండు పర్యాయాలు కాంగ్రెస్, ఒకసారి బీఆర్ఎస్ గెలిచాయి. ప్రస్తుతం ఈ స్థానం కాంగ్రెస్ సిట్టింగ్ సీటుగా ఉంది.
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీగా విజయం సాధించి ఉన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి Chamala kiran kumar చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ Bura Narasayya Goud డాక్టర్ బూర నరసయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ యాదవ్ Mallesh Yadav బరిలో ఉన్నారు.
సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తంటాలు
నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన 2009 తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ ఈ సీటును కోల్పోయినా, 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూపంలో తిరిగి దక్కించుకుంది.
ఈ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తంటాలు పడుతోంది. టికెట్ కోసం నాయకుల మధ్య తొలుత పోటీ బాగా నెలకొన్నా.. చివరకు టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితునిగా పేరున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కింది.
నియోజవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లకు గాను ఒక్క జనగామ మినహా అన్ని చోట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం తమకు లాభిస్తుందన్న విశ్వాసంలో కాంగ్రెస్ ఉంది. సుమారు 18 లక్షల ఓట్లున్న ఈ నియోజకవర్గంలో కనీసం 7 లక్షల ఓట్లు సాధించిన పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది.
2023 డిసెంబరులో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆరుచోట్ల విజయం సాధించగా వారికి వచ్చిన మెజారిటీ ఓట్లు ఏకంగా 2.70లక్షలపై చిలుకు ఉన్నాయి. దీంతో తమ అభ్యర్థి లోక్ సభ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధిస్తారాన్న ధీమాతో ఉంది.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు భువనగిరి విజయం సవాలుగా మారింది. ఈ నియోజకవర్గానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు.
మ్యాజిక్ చేయాలని బీజేపీ ప్రయత్నాలు
భువనగిరిలో మ్యాజిక్ చేయాలన్న ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా విజయం సాధించిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా 2021లో బీఆర్ఎస్ ను వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇపుడు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
ప్రధాని మోడీ చరిష్మా, అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కు గతంలో ఎంపీగా ఉన్న పరిచయాలు, ఆయన సామాజిక వర్గం గౌడ్స్ ఓట్లు తమకు లాభిస్తాయన్న అంచనాలో బీజేపీ నాయకులు ఉన్నారు. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భువనగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీలో ఉన్నా అన్ని చోట్లా ఓటమి పాలయ్యారు.
మొత్తంగా ఏడు సెగ్మెంట్లకు గాను, ఆ పార్టీకి 74,782 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మునుగోడు, ఇబ్రహీంపట్నం మినహా అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయింది. అయినా, శాసన సభ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు తేడా ఉంటుందని, కేంద్రంలో బీజేపీ మరో సారి అధికారంలోకి వస్తుందని ప్రచారం చేస్తున్న ఆ పార్టీ నాయకులు తమ అభ్యర్థి గెలుపు ఖాయమన్న విశ్వాసంతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
తిరిగి పాగా వేసేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భువనగిరిలో తిరిగి పాగా వేసేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరించి ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లున్న యాదవ సామాజిక వర్గంలోని కురుమ ఉప కులానికి చెందిన క్యామ మల్లేష్ కు టికెట్ ఇచ్చింది.
2014 లో భువనగిరిలో విజయం సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాతి 2019 ఎన్నికల్లో కేవలం 5వేల ఓట్ల స్వల్ప తేడాతో సీటును కోల్పోయింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, సామాజికవర్గం మద్దతు ఉన్న క్యామ మల్లేష్ ద్వారా తిరిగి భువనగిరి దక్కించుకునేందుకు శ్రమిస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఈ ఎన్నిక్లల్లో విజయం ద్వారా ఒక విధంగా పరువును కాపాడుకోవడంతో పాటు, పట్టు నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. ఇలా.. మూడు ప్రధాన రాజకీయ పక్షాలు ఎవరికి వారు విజయం కోసం ఎత్తులు పై ఎత్తుల వేస్తుండడంతో భువనగిరిలో పోటీ నువ్వా, నేనా అన్నట్టు సాగుతోంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )
సంబంధిత కథనం