CM Revanth Reddy : ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ - యాదాద్రి పేరు మార్పుపై కీలక ప్రకటన
CM Revanth Reddy Bhongir Road Show: మంత్రి పదవిని త్యాగం చేసి నల్గొండ గడ్డపై ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తనతో పాటు ముఖ్యమంత్రి పదవికి అర్హత కలిగిన వ్యక్తి కోమటిరెడ్డి అని కామెంట్స్ చేశారు.
CM Revanth Reddy Road Show in Bhongir : నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఆదివారం భువనగిరిలో తలపెట్టిన రోడ్ షో లో పాల్గొన్న ఆయన…. హైదరాబాద్ సంస్థానంగా మొదలైన పోరాటం విముక్తి పొందిందని, దొరల గడీల నుంచి బంధ విముక్తి చేసింది ఈ ప్రాంతమని గుర్తు చేశారు. అలాంటి చరిత్ర గల ఈ భువనగిరి ప్రాంతంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు గెలిస్తే ఏం చేస్తారో ఆలోచంచాలని ప్రజలను కోరారు.
పార్లమెంట్ ను స్తంభింపజేసి తెలంగాణ తెచ్చిండ్రు ఇక్కడి నాయకులు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. “సొంత ఆస్తులు కరగబెట్టి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkatreddy) సేవ చేశారు. అడవి పంది లాగా మెక్కి టీఆరెఎస్ వాళ్లు బలిశారు. మంత్రి పదవిని త్యాగం చేసి, నల్గొండ గడ్డపై ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి కోమటిరెడ్డి(Komatireddy Venkatreddy). భూమికి మూరేడు లేని వానికి చెప్తున్నా.. కోమటిరెడ్డి బ్రదర్స్.. మందులో సోడా కలిపి రాలేదు. నాతో పాటు ముఖ్యమంత్రి అర్హత కలిగిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నా ముఖ్యమంత్రి పదవి అర్హత కాదు బాధ్యత. స్థానిక నాయకులు ఎవరైనా అందరు ఎప్పుడైనా నన్ను కలవచ్చు” అని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గడీల గోడలు బద్దలు కొట్టి జ్యోతిరావ్ పూలె పేరు పెట్టామని చెప్పారు. "వామపక్ష నేతల మద్దతు కు, గౌరవానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేంద్రంలోని బీజేపీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేసింది. ఇండియా కూటమి గెలుపు తో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని అవుతారు. బిఆర్ఎస్ ఏమైనా సీట్లు గెలిస్తే బీజేపీ కి మద్దతు ఇస్తుంది. కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారు. నిరుద్యోగుల ఆశలకు గండి గొడితే ప్రజా పాలన లో మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. ఆడబిడ్డలకు మాటిచ్చాము.. ఆర్టీసీ లో ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్య శ్రీ ని పది లక్షలకు పెంచాం.. అందుకు కాంగ్రెస్ ను ఓడగొట్టాలనా..? గ్యాస్ సబ్సిడీ ఇచ్చి ఐదు వందలకు సిలెండరు ఇచ్చి నందుకు కాంగ్రెస్ ను ఓడగొట్టాలా..? ఉచిత కరెంటు బిల్లు ఇచ్చినందుకు ఓడగొడుతారా…? బీజేపీ నాయకులను అడుగుతున్నా..కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. రాష్ట్ర అవతరణ కు అడ్డుపడిన బీజేపీ కి ఓట్లు అడిగే హక్కు లేదు. భువనగిరిలో బిఆర్ఎస్…. బీజేపీకి మద్దతు ఇస్తుంది. బీర్ల ఐలయ్యకు విప్ ఇచ్చినం, అనిల్ కు రాజ్య సభ ఇచ్చినాం. బలహీన వర్గాలకు సామజిక న్యాయం చేశాం. అటువైపు జానా, ఉత్తమ్.. ఇటు వైపు కోమటిరెడ్డి బ్రదర్స్ మనకు మనమే పోటీ. కిరణ్ గెలిస్తే త్రిబుల్ ఇంజిన్ లు భువనగిరి కి పనిచేస్తాయి.
త్వరలోనే యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా(Yadagiri Gutta) మారుస్తామని కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గుట్టపై మరిన్ని వసతులను కల్పిస్తామని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ కు డబుల్ ఇంజిన్ లు అని కామెంట్స్ చేశారు. గందమళ్ళ, బ్రాహ్మణ వెళ్లెంల, slbc పూర్తి చేస్తామన్న ఆయన…. ఆగస్టు 15 లోపు యాదగిరి లక్ష్మీనర్సింహా స్వామి సాక్షిగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చారు. వచ్చే పంటకు రూ. 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొంటామన్నారు.