Medak Election Money: ఎన్నికల వేళ డబ్బు తరలింపుపై పోలీసులకు ఉప్పందించిన ఉద్యోగి.. విషయం బయటపడటంతో ఆత్మహత్య
Medak Election Money: ఎన్నికల వేళ యజమానికి చెందిన నగదు తరలింపు గురించి పోలీసులకు ఉప్పందించిన ఉద్యోగి విషయం బయటకు పొక్కడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్వాధీనం చేసుకున్న నగదులో కొంత మొత్తాన్ని కొట్టేసిన ఉద్యోగులను కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Medak Election Money: ఎన్నికల సమయంలో మెదక్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారికి చెందిన నగదును ఉద్యోగులు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారి దగ్గర స్వాధీనం చేసుకున్న డబ్బులో కొంత భాగాన్ని కానిస్టేబుల్లు కాజేశారు. ఈ ఘటనలో పోలీసులకు ఉప్పందించిన యువకుడు ఆత్మహత్య చేసుకోగా డబ్బులు కాజేసిన కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఎన్నికల సమయంలో, పరిమితి మించి తీసుకెళ్తున్న డబ్బులు పోలీసులు పట్టుకున్న కేసులో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు పోలీసుల సస్పెన్షన్ కు కారణమయ్యింది. అనేక మలుపులు తిరిగిన ఈ సంఘటన, మేడ్చెల్ మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంగూడ చౌరాస్తా వద్ద జరిగింది.
కీసర పోలీసులు ఈ నెల 11వ తేదీన రూ 18.5 లక్షలను ఇద్దరు వ్యక్తులు బైక్ మీద తీసుకుళ్తుండగా పట్టుకున్నారు. డ్యూటీ లో ఉన్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, కానిస్టేబుల్ శ్రీకాంత్ కరీంగూడ చౌరాస్తా వద్ద తనిఖీలు చేపట్టారు. వారి తనిఖీల్లో సాయి కుమార్, కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్ పైన రూ 18. 5 లక్షలు తీసుకెళ్తుండగా పట్టుకున్నామని వారిద్దరూ ఇన్స్పెక్టర్ వెంకటయ్యకు చెప్పారు.
6. 5 లక్షలు నొక్కేశారు…
వెంకటయ్య చేసిన విచారణలో, కార్తీక్, సాయి కుమార్ తాము రూ 25 లక్షలు తీసుకెళ్తుండగా పట్టుకున్నారని, అందులో కానిస్టేబుల్స్ ఇద్దరు రూ.6. 5 లక్షలు నొక్కేసారని మిగతా రూ.18. 5 లక్షలు మాత్రమే అధికారులకు చూపించారని వెల్లడించారు.
ఈ విషయాన్ని రాచకొండ కమీషనర్ అఫ్ పోలీస్ తరుణ్ జోషికి ఇన్స్పెక్టర్ వెంకటయ్య తీసుకెళ్లారు. విచారణలో భాగంగా, కానిస్టేబుల్స్ నుండి రూ 6.5 లక్షలు రికవర్ చేయటంతో పాటు కమీషనర్ తరుణ్ జోషి కానిస్టేబుల్స్ కృష్ణ, శ్రీకాంత్ ని విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీచేశారు.
ఉప్పందించిన ఉద్యోగి ఆత్మహత్య…
పోలీసుల విచారణలో ఈ కేసులో మరో ట్విస్ట్ బయట పడింది. కార్తీక్, సాయి కుమార్ డబ్బులు తీసుకెళ్తున్నట్టు వారి సహోద్యోగి రంజిత్ కుమార్ కానిస్టేబుల్స్ కృష్ణ, శ్రీకాంత్ కు ఉప్పందించినట్టు గుర్తించారు.
ఈ ముగ్గురుఆ ప్రాంతానికి చెందిన ఒక పారిశ్రామికవేత్త దగ్గర పనిచేస్తున్నారు. పారిశ్రామికవేత్త డబ్బులని కార్తీక్, సాయి కుమార్ సహాయంతో పంపిస్తున్నాడని రంజిత్.. కానిస్టేబుల్స్ కు తెలిపాడు. వారిని పట్టుకుంటే, రూ 25 లక్షలు కూడా వదిలిపెట్టి వెళ్తారని తెలిపాడు.
కార్తీక్, సాయి కుమార్ ఏ రూట్ లో వెళ్తారో ముందే అవగాహన ఉన్న కానిస్టేబుల్స్, వారిని అడ్డగించి, డబ్బులు పట్టుకున్నారు. అందులో రూ 6.5 లక్షలు తమ వద్దే ఉంచుకుని, మిగతా డబ్బులు మాత్రమే పోలీసులు అధికారులకు చూపించారు. రంజిత్ పాత్ర తెలిసిన పారిశ్రామికవేత్త అతడిని బెదిరించడంతో భయపడిన రంజిత్ చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
డబ్బులు ఎవరివి?
ఈ వ్యవహారంపై చర్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టారు. మొత్తానికి, ఈ డబ్బుల వ్యవహారం ఒకరు ప్రాణాలు తీయగా, మరొక ఇద్దరి సస్పెన్షన్ కి దారి తీసింది.అయితే, ఈ డబ్బులు ఎవరి ఆదేశాల మేరకు ఎవరికీ పంపుతున్నారో పోలీసులు ఇప్పటివరకు వెల్లడించలేదు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)