Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ లో నేతల చివరి ప్రయత్నాలు-ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రంగంలోకి బృందాలు!-adilabad lok sabha elections political leaders last efforts to attract voters ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ లో నేతల చివరి ప్రయత్నాలు-ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రంగంలోకి బృందాలు!

Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ లో నేతల చివరి ప్రయత్నాలు-ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రంగంలోకి బృందాలు!

HT Telugu Desk HT Telugu
Published May 12, 2024 07:03 PM IST

Adilabad : పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండడంతో...నేతలు చివరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ముఖ్యనేతలు తమ ఓటు బ్యాంకు నిలబెట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ లో నేతల చివరి ప్రయత్నాలు
ఉమ్మడి ఆదిలాబాద్ లో నేతల చివరి ప్రయత్నాలు

Adilabad : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇన్నాళ్లు మారుమోగిన మైకులు మూగపోయాయి. శనివారం సాయంత్రం నుంచి ప్రచారాలపై నిషేధం అమలులోకి వచ్చింది. ఇప్పటికే పార్టీల అగ్ర నేతలు బహిరంగ సభలో రోడ్ షోలు పూర్తికావడంతో ఇంటింటికి వెళ్లి ఓటర్లను పలకరించి ప్రయత్నంగా ప్రచారం కొనసాగుతోంది. తమ పార్టీల బృందాలను పంపి ఓటర్ నాడి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయా సంఘాల అధ్యక్షులను, గ్రామ పెద్దలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉండడంతో తమ ఓటు బ్యాంకును వదిలేయకుండా ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఈ ఓట్లపైనే ప్రత్యేక దృష్టి

సార్వత్రిక ఎన్నికలు సోమవారం జరుగుతున్న నేపథ్యంలో రెండోసారి పార్లమెంట్ సీటును కైవసం చేసుకునేందుకు బీజేపీ నాయకులు విస్తృత ప్రచారం చేశారు. 2019 లోక్ సభ ఎన్నికలలో అదిలాబాద్ పార్లమెంటు సీట్లు కైవసం చేసుకున్నందున తమ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేశారు. గతంలో గిరిజన తెగలలో అన్ని తెగల వారు పోటీ చేశారు. ప్రస్తుతం ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కేవలం గోండు జాతి వారికి టికెట్లు కట్టబెట్టారు, ఈ విషయమై లంబాడ తెగ ప్రజలు కొంత నిరుత్సాహంతో ఉన్నట్టు తెలుస్తోంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్రం సుగుణ, గోడం నగేష్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆత్రం సక్కు ముగ్గురు గోండు జాతికి చెందిన వారే. ఇప్పటికే ఖానాపూర్ నియోజకవర్గంలో ఇదే జాతికి సంబంధించిన బొజ్జు పటేల్ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. తన నియోజకవర్గ పరిధిలోని ఓటు బ్యాంకు చెడిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థిని గెలుపొందించేలా విస్తృత ప్రచారాన్ని కొనసాగించారు, ఇలా ఉంటే ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న గోడం నగేష్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ముగ్గురు అభ్యర్థులు గోండు జాతికి సంబంధించిన ఓట్లు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన మైదాన ప్రాంత ఓట్లు, గిరిజన తెగ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ లంబాడి తెగ ప్రజల ఓట్లు ఎవరికి వస్తాయో వారి విజయం పొందుతారు. దీంతో ఆ ముగ్గురు అభ్యర్థులు మైదాన ప్రాంత ఓట్ల పైనే దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితిలోనూ సిట్టింగ్ స్థానం ఆదిలాబాద్ ను చేజార్చుకోవద్దని కమలం పార్టీ ప్రయత్నిస్తుంది.

బీఆర్ఎస్ దీమా

ఆదిలాబాద్ లో ఆత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా రాష్ట్రస్థాయి నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె గెలుపును సవాలుగా స్వీకరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సాధించినట్లు స్థానిక నాయకులు ద్వారా తెలుస్తుంది. ఆమె గెలుపు లక్ష్యంగా ఎమ్మెల్యే వేడమా బొజ్జు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, శ్రీ హరిరావు, విట్టల్ రెడ్డి గడపగడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆత్రం సక్కు బరిలోకి నిల్చున్నారు. తన నియోజకవర్గంలో ఓటు బ్యాంకును పదిలంగా చూసుకుంటున్నారు. ఆత్రం సక్కు రాజకీయ అనుభవం గల నేతగా పేరొందారు. గడువు సమీపిస్తుండoతో ఆయా పార్టీల నేతలు బృందాలుగా చివరి ప్రయత్నాలు చేస్తు్న్నారు. ఒక్కో బృందం తమ బూతు పరిధిలో ఓటర్లను ఆకట్టుకునేలా మాట్లాడే నేర్పు ఉన్నవారికి బృందాల బాధ్యతను అప్పగించారు. ఎవరికి వారే తమకు ఇతర పార్టీలతో పోటీ లేదని, ఓటర్ల మద్దతు తమకే ఉందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి.

Whats_app_banner

సంబంధిత కథనం