Telangana Election Results 2023 : అగ్రనేతలను మట్టికరిపించాడు.... 'వెంకటరమణారెడ్డి' విక్టరీకి కారణాలివే
Telangana Election Results 2023 :కామారెడ్డిలో సంచలన తీర్పు నమోదైంది. సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ బరిలో ఉన్న ఈ సీటు నుంచి బీజేపీ నేత వెంకటరమణారెడ్డి విక్టరీ కొట్టారు. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Telangana Election Results 2023 : రాష్ట్రం మొత్తం ఆసక్తిగా గమనించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు ఊహించని తీర్పు వెలువరించారు. స్వయంగా సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలో బరిలో నిలిచినప్పటికీ.. స్థానిక బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి ఓట్లు వేసి గెలిపించారు. ఉదయం కౌంటింగ్ సమయంలో తొలి 8 రౌండ్లు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి 2 వేల ఓట్ల వరకు లీడింగ్‌లో ఉండగా.. 9వ రౌండ్ నుంచి ఫలితాలు తారుమరయ్యాయి. ప్రతిరౌండ్‌లోనూ రమణారెడ్డి ఆధిక్యత సాధిస్తూ చివరకు ప్రజా ఆశీర్వాదంతో ముందు వరుసలో కొనసాగుతున్నారు. 19వ రౌండు పూర్తయ్యేసరికి రమణారెడ్డి 5810 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థికి మొత్తం 65,198 ఓట్లు రాగా..కేసీఆర్‌కు 59,388 ఓట్లు వచ్చాయి. ఇక రేవంత్‌రెడ్డికి 54,296 ఓట్లు పోలయ్యాయి.
రైతులకు అండగా…
2018 ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన రమణారెడ్డి.. అనుహ్యంగా ఈసారి ఉద్ధండులపై విజయం సాధించి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారారు. అయితే రమణారెడ్డి విజయం రాత్రికి రాత్రి జరగలేదు.గత ఐదేండ్లుగా ప్రజా సమస్యలపై, అధికార పార్టీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆగడాలపై ఆయన చేసిన పోరాట ఫలితమే నేటి విజయమని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. కామారెడ్డిలో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మొదట రమణారెడ్డి వాలిపోయేవాడు. ముఖ్యంగా కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై రైతులు చేపట్టిన అవిశ్రాంత పోరాటం వెనుక ఉండి చక్రం తిప్పింది రమాణరెడ్డినే. రైతుల పోరాటానికి కావాల్సిన ఆర్థికసాయంతో పాటు పోరాటంలో భుజం-భుజం కలిపి నడిచారు. అలాగే కామారెడ్డిలోని ప్రతిమండలంలో ఐకేపీ రుణాల కోసం, స్త్రీనిధి రుణాల కోసం పెద్దఎత్తున పోరాటం నడిపారు. వీటికి తోడు విపక్షంలో ఉన్నప్పటికీ.. నియోజకవర్గంలో కుల సంఘాలకు అవసరమైన నిర్మాణ సామగ్రి అందించాడు. కొన్ని సంఘాలకు ప్రహరీలు కట్టడం, మరికొన్ని సంఘాలకు శ్లాబ్‌లు నిర్మించి ఇవ్వడం ఈ ఎన్నికల్లో కలిసి వచ్చింది. విపక్షంలో ఉన్న సమయంలోనే తమను ఆదుకుంటే.. అధికారం తోడవుతే మరింత సేవ చేస్తారన్న బీజం ప్రజల్లో పడింది. అందువల్లే స్వయంగా సీఎం కేసీఆర్ పోటీ చేసినా ప్రజలు మాత్రం రమణారెడ్డి వైపు నిలిచారు. ఇక కామారెడ్డిలో గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల కబ్జాలపై నగరంలో పెద్దఎత్తున పోరాటం చేశాడు. అదికూడా కలిసి వచ్చింది.
లోకల్ ఫీలింగ్‌కు ప్రజలు ఫిదా
ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌తో పాటు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీ చేయడం ఓ విధంగా రమాణారెడ్డి విజయానికి దోహదమయ్యింది. ఎన్నికల ప్రచారంలో రమణారెడ్డి దీన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు. ఎన్నికల్లో కేసీఆర్‌తో పాటు రేవంత్‌రెడ్డి పెద్దగా ప్రచారం చేయలేదు. కేసీఆర్ కేవలం ఒక బహిరంగ సభలో మాత్రమే ప్రచారం చేశారు. ఇక రేవంత్‌రెడ్డి సుడిగాలి పర్యటనలు మాత్రమే చేశారు.కానీ రమణారెడ్డి నియోజకవర్గం అంతా కలియతిరిగాడు. ఒకవేళ సీఎం కేసీఆర్ గెలిచినా, రేవంత్ గెలిచినా స్థానికంగా ఉండబోరని, ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెబుతారని ప్రజలను ప్రశ్నించారు. కామారెడ్డిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను కలవడమే సాధ్యం కావడం లేదని, అలాంటిది కేసీఆర్‌ను ఎలా కలుస్తారని, తమ సమస్య ఎలా విన్నవిస్తారని ప్రశ్నించారు. పైగా ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా మధ్యవర్తులు పెత్తనం చేస్తారని హెచ్చరించారు. నాన్‌లోకల్ వాళ్లకు ఓట్లేయ్యొద్దని కోరారు.