Kalkaji election result 2025: ఢిల్లీ సీఎం అతిషి వెనకంజ
Delhi Election result 2025: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కల్కాజి నుంచి వెనకంజలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన రమేష్ బిధురిపై తొలి ట్రెండ్స్‌లో వెనుకంజలో ఉన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అతిషి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన రమేష్ బిధురిపై తొలి ట్రెండ్స్‌లో వెనుకంజలో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
2024 సెప్టెంబరులో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తరువాత అతిషి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చారు. 43 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ అతి పిన్న వయస్కురాలైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి పోటీ చేస్తున్న ఆమె తన నాయకత్వాన్ని బలోపేతం చేయాలని, ఆమ్ ఆద్మీ పార్టీ పాలనా నమూనాను చెక్కుచెదరకుండా ఉంచాలని భావిస్తున్నారు.
కల్కాజీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత అల్కా లాంబా, బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధురితో అతిషి పోటీ పడుతున్నారు. అతిషి రాజకీయ ప్రయాణం ఆప్ విధానం, క్షేత్రస్థాయి క్రియాశీలతపై నిర్మితమైంది. ఆమె 2013లో ఆప్ లో చేరి పార్టీ విధానాలను రూపొందించడంలో సహాయపడ్డారు. 2015లో మధ్యప్రదేశ్ లో జరిగిన జల సత్యాగ్రహంలో, నీటి హక్కుల కోసం జరిగిన పోరాటంలో సామాజిక కార్యకర్త అలోక్ అగర్వాల్ తో కలిసి ఆమె పనిచేశారు.
అతిషికి తొలి పెద్ద పరీక్ష
2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2020లో కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి 11 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంపై క్యాబినెట్ మంత్రిగా అతిషి దృష్టి సారించారు. స్థానికంగా పౌరులకు సాధికారత కల్పించడానికి మొహల్లా సభ ప్రాజెక్టుకు నాయకత్వం వహించారు. 2023లో కీలక మంత్రులు రాజీనామా చేసినప్పుడు, ఆమెను సౌరభ్ భరద్వాజ్‌తో పాటు ఢిల్లీ కేబినెట్లోకి తీసుకువచ్చి, కీలక శాఖలను కట్టబెట్టారు. ఈ అనుభవం చివరకు 2024లో ఆమె ముఖ్యమంత్రిగా నియమితులవడానికి దారితీసింది.
2025 ఎన్నికల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను అతిషి ప్రస్తావించారు. కానీ రోడ్లు, మురుగునీటి పారుదల, నీటి కొరతపై ప్రజల ఆందోళనలతో సహా ఆమె కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నారు.
సంబంధిత కథనం