TS Assembly Elections : ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు వద్దు, సోషల్ మీడియాలో ప్రచారాలపై నిషేధం- సీఈవో వికాస్ రాజ్
TS Assembly Elections : తెలంగాణలో సైలెంట్ పీరియడ్ మొదలైందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. సోషల్ మీడియాతో పాటు ప్రసార మాధ్యమాల్లో రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని ప్రకటించారు.
TS Assembly Elections : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో సైలెంట్ పీరియడ్ మొదలైందని, ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ను ప్రదర్శించకూడదని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సీఈవో వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలివెళ్లాలని, రాజకీయ ప్రకటనలను ఇవ్వకూడదని సూచించారు. బుధవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఎన్నికల అధికారులు వెళ్తారని తెలిపారు. మాక్ పోల్ కోసం గురువారం ఉదయం 5.30 కల్లా పోలింగ్ ఏజెంట్లు రావాలన్నారు. ఈవీఎంలను పోలింగ్ ఏజెంట్లు ముట్టుకోకూడదన్నారు. రాష్ట్రంలో తొలిసారి హోం ఓటింగ్ అమలుచేశామన్నారు. 27,178 మంది హోం ఓటింగ్ వినియోగించుకున్నారని వెల్లడించారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 27,098 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామన్న సీఈవో...పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించరని తెలిపారు.
సోషల్ మీడియాలో ప్రచారాలు నిషిద్ధం
ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో సోషల్ మీడియాలోనూ ప్రచారం నిషిద్ధమని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. ఈసీ అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశముందన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటి విషయాలు ప్రదర్శించవద్దని పేర్కొన్నారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్‌వర్క్‌ల్లో ప్రచారాలు నిషేధమని తెలిపారు. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదన్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్‌పోల్స్ నిషేధం అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రానికి ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలన్నారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతిలేదన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రూ.737 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు.
నవంబర్ 30న హాలీడే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరుగనుంది. అయితే పోలింగ్ రోజున అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ఇవ్వాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. విద్యాసంస్థలకు సైతం సెలవులు ఇవ్వాలని తెలిపింది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ప్రకటించాలన్నారు. గతంలో ఎన్నికల వేళ కొన్ని సంస్థలు ఉద్యోగులకు సెలవు ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రైవేట్ సంస్థలు సెలవులు ఇవ్వలేదనే ఫిర్యాదులు అందాయన్నారు. ఈ మేరకు ఈసారి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులు సెలవు ఇచ్చాయో, లేదో పరిశీలించాలని కార్మిక శాఖను సీఈవో వికాస్ రాజ్ ఆదేశించారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.