TS Elections : పోలింగ్ రోజున హాలీడే-ప్రైవేట్, ఐటీ సంస్థలకు సీఈవో ఆదేశాలు
TS Elections : తెలంగాణ ఎన్నికలు జరిగే నవంబర్ 30న ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని సీఈవో వికాస్ రాజ్ ఆదేశించారు. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు.
TS Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరుగనుంది. అయితే పోలింగ్ రోజున అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ఇవ్వాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. విద్యాసంస్థలకు సైతం సెలవులు ఇవ్వాలని తెలిపింది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ప్రకటించాలన్నారు. గతంలో ఎన్నికల వేళ కొన్ని సంస్థలు ఉద్యోగులకు సెలవు ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రైవేట్ సంస్థలు సెలవులు ఇవ్వలేదనే ఫిర్యాదులు అందాయన్నారు. ఈ మేరకు ఈసారి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులు సెలవు ఇచ్చాయో, లేదో పరిశీలించాలని కార్మిక శాఖను సీఈవో వికాస్ రాజ్ ఆదేశించారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యాసంస్థలకు 2 రోజుల సెలవులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30న పోలింగ్ జరుగనుంది. పోలింగ్ దృష్ట్యా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు రెండు రోజులు(నవంబర్ 29, 30) పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సాయంత్రం తర్వాత పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు చేయనున్నారు. ఎన్నికల పోలింగ్ ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిర్వహిస్తారు. కాబట్టి విద్యాసంస్థలు పోలింగ్ కు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అందువల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 29, 30 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 1న తిరిగి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. కాలేజీ స్టూడెంట్స్ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. కొత్త ఓటు హక్కు పొందిన విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
లేబర్ హాలీడే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీన వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పౌరులంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే నవంబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవుగా ప్రకటిస్తూ కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.