Bandi Sanjay: కేసీఆర్‌కు దమ్ముంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలను సిఎం చేయాలన్న బండి సంజయ్-sanjay challenges kcr to make sc st and bc leaders as chief minister ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bandi Sanjay: కేసీఆర్‌కు దమ్ముంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలను సిఎం చేయాలన్న బండి సంజయ్

Bandi Sanjay: కేసీఆర్‌కు దమ్ముంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలను సిఎం చేయాలన్న బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Nov 09, 2023 06:23 AM IST

Bandi Sanjay: కేసీఆర్‌కు కు దమ్ముంటే ఎస్సీ,ఎస్టీ బీసీల్లోని నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని బండి సంజయ్ సవాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీల్లోని పేద వ్యక్తి సీఎం అవుతాడన్నారు.

కరీం నగర్‌లో ప్రచారం చేస్తున్న బండి సంజయ్
కరీం నగర్‌లో ప్రచారం చేస్తున్న బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారని ఆరోపించారు.

కరీంనగర్ లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే కుట్ర జరుగు తోందన్నారు.కరీంనగర్ ప్రజలెవరూ మోసపోవద్దని, బీఆర్ఎస్ పాలనలో భూకబ్జాలు, డ్రగ్స్, కమీషన్ల దందాతో కరీంనగర్ అల్లాడుతున్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే బీసీల్లోని పేదవర్గాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. రెండోరోజు పాదయాత్రలో భాగంగా పట్టణంలోని పాతబజార్ శివాలయం నుండి కాపువాడ, మంగలివాడ, మారుతినగర్ లో బండి సంజయ్ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

ప్రతిరోజు ప్రజలను కలుసుకుంటున్నానని...ప్రజలమద్దతు బీజేపీకే ఉందని,బీఆర్ఎస్ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో ...కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి అయిన గంగులపై రెట్టింపు వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే అమ్ముడుపోతారని..కేసీఆరే స్వయంగా పైసలిచ్చి కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలని చూస్తున్నారని... ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోవడం ఖాయమని తేలిపోయిందన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే బలహీనవర్గాల్లోని పేద వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బీసీ వ్యతిరేక డీఎన్ఏ ఉందని... కేసీఆర్ తన కుటుంబంలో అందరికి పదవులిచ్చారని,అలాంటి కేసీఆర్ ప్రభుత్వంలో ముగ్గురు బీసీలు మాత్రమే మంత్రులుగా కేబినేట్ లో ఉన్నారన్నారు.

కేసీఆర్ కు ఏ మాత్రం దళిత, బడుగు, బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా ప్రకటించాలని. కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నాతన సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేసారు.

ఈడీ, సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీకి సంబంధం లేదని, తప్పు చేసినట్లు ఆధారాలుంటే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాయన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అవినీతిపరులను ఉపేక్షించబోదని ఒక్కొక్కరికి ఒక్కో రోజు ఉందని హెచ్చరించారు. గంగుల ను ఓడించడానికి స్వంత పార్టీ నేతలే యత్నిస్తున్నారని, బీఆర్ఎస్ నేతల అరాచకాలను ప్రజలు గుర్తుంచుకున్నారని,భూకబ్జాలు, డ్రగ్స్, గంజాయి, కమీషన్ల దందాతో కరీంనగర్ ను సర్వనాశనం చేశారని. కరీంనగర్ ను కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని గంగులపై మండిపడ్డారు.

(రిపోర్టర్ గోపికృష్ణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా )

Whats_app_banner