Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఆర్టీసీ ఆస్తులు మిగలవు
Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పొరపాటున కేసీఆర్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఆస్తులన్ని కేసీఆర్ కుటుంబ సభ్యుల పాలవుతాయన్నారు.
Telangana Assembly Elections 2023: ఆర్టీసీ భూములను 99 సంవత్సరాల లీజుపేరుతో కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకోవడానికి పత్రాలను సిద్దం చేసారని....పొరపాటున కేసీఆర్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఆస్తులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యుల పాలవుతాయని ఎంపీ, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రజలు ఆలోచించి ఓటు పవర్ చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలోని ముగ్దుంపూర్ లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి పూలు చల్లి, తిలకం దిద్ది సంజయ్ కు స్వాగతం పలికారు. వారితో కలిసి ముగ్దూంపూర్ లో రోడ్ షో చేసిన బండి సంజయ్ అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు..
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే…. బీఆర్ఎస్ నేతలు మాత్రం తామే చేస్తున్నట్లుగా కొబ్బరికాయలు కొడుతూ ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు. రైతుల వద్ద నుండి వడ్ల కొనుగోలు చేస్తే ఆ డబ్బులు కేంద్రమే ఇస్తుందని… రోడ్లు, వీధి దీపాలుసహా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ మరో కుట్రకు తెరదీసాడని మండిపడ్డారు. ఆర్టీసీ భూముల లీజులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్ల మీద రెడీగా ఉన్నాయని... పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఆస్తులన్నీ 99 సంవత్సరాల లీజు పేరుతో కేసీఆర్ కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకోబోతున్నారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులు, ప్రజలు…. వాస్తవాలు ఆలోచించి ఓట్లతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ లో తనను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని,గంగుల కమలాకర్ వందల కోట్లు పంచడానికి సిద్దమయ్యాడని అన్నారు బండి సంజయ్. తాను గెలుస్తున్నానని వచ్చిన రిపోర్ట్ లతో కేసీఆర్ భయంతో వణికి పోతున్నాడని, అందుకే తనను ఓడించేందుకు అన్ని రకాల కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల అరాచకాలను, కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనను ప్రజలంతా గమనించారని...ప్రజల పక్షాన నిలిచే బీజేపీ పువ్వు గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు. న్యాయం ధర్మం కోసం పోరాడే నాలాంటి వాడిని గెలిపించుకుంటే ,సమాజంలో కేసీఆర్ లాంటి అవినీతి, అక్రమార్కులను నిలదీస్తామని ఆయనతో పోరాడటానికి సిద్దమవుతామన్నారు.