Haryana elections : 90 సీట్లు- 1031 మంది అభ్యర్థులు, 2కోట్ల మంది ఓటర్లు.. హరియాణాలో గెలుపెవరిది?
Haryana elections 2024 : హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 90 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా, 10ఏళ్ల తర్వాత అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పోటీపడుతోంది.
దాదాపు 2 కోట్ల మంది ఓటర్లున్న హరియాణాలో శనివారం ఉదయం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 5న మొత్తం 90 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందా? లేక పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారైనా అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత, రైతు సమస్యలు, ఇటీవల రెజ్లర్ల ఆందోళనల మధ్య తాజా హరియాణా ఎన్నికలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
2024 హరియాణా ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్-బహుజన్ సమాజ్ పార్టీ, జన్నాయక్ జనతా పార్టీ(జేజేపీ)-ఆజాద్ సమాజ్ పార్టీ(ఏఎస్పీ) కూడా ఈ ఎన్నికల బరిలో నిలిచాయి.
2019లో బీజేపీ-జేజేపీ ప్రభుత్వం..
హరియాణా అసెంబ్లీలో మెజారిటీ ఫిగర్ 45. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 90 స్థానాలకు గాను 40 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. చివరికి జేజేపీ, ఏడుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో ఎన్నికల అనంతర పొత్తు కుదుర్చుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
నాడు బీజేపీకి చెందిన మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి అయ్యారు. జేజేపీకి చెందిన దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా 2024 ఎన్నికలకు కొన్నినెలల ముందు బీజేపీ- జేజేపీ మధ్య విభేదాలు వచ్చాయి. ఖట్టర్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. జేజేపీ కూటమి నుంచి వైదొలిగింది.
హరియాణా సీఎం, లాడ్వా నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి నయాబ్ సింగ్ సైనీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పండుగలో అందరు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
2 కోట్ల మంది ఓటర్లు, 1,031 మంది అభ్యర్థులు..
20,632 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న పోలింగ్‌లో 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది.
1,07,75,957 మంది పురుషులు, 95,77,926 మంది మహిళలు, 467 మంది థర్డ్ జెండర్ ఓటర్లు సహా 2,03,54,350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని హరియాణా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పంకజ్ అగర్వాల్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29,462 మంది పోలీసులు, 21,196 మంది హోంగార్డులు, 10,403 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్పీఓ) విధులు నిర్వర్తించారు. ప్రజలు భయం లేకుండా ఓటు వేసేందుకు వీలుగా రాష్ట్రంలోని ప్రతి మూలలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ చేసే విభజన, ప్రతికూల రాజకీయాలను దేశభక్త ప్రజలు ఎన్నటికీ అంగీకరించరని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన తర్వాత బీజేపీలో ఉన్న ఉత్సాహాన్ని, పరజల నుంచి లభిస్తున్న మద్దతును గమనించానని మోదీ పేర్కొన్నారు.
గెలుపుపై అటు కాంగ్రెస్ కూడా ధీమాగానే ఉంది.
జమ్ముకశ్మీర్‌తో పాటు హరియాణా ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలువడతాయి.
సంబంధిత కథనం