Delhi election results : నిర్మల చేసిన ఆ ఒక్క పనితో కేజ్రీవాల్​- ఆప్​ ఖేల్​ ఖతం?-delhi election results did nirmala sitharamans income tax cuts fuel bjps capital comeback ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Delhi Election Results : నిర్మల చేసిన ఆ ఒక్క పనితో కేజ్రీవాల్​- ఆప్​ ఖేల్​ ఖతం?

Delhi election results : నిర్మల చేసిన ఆ ఒక్క పనితో కేజ్రీవాల్​- ఆప్​ ఖేల్​ ఖతం?

Sharath Chitturi HT Telugu
Published Feb 08, 2025 12:10 PM IST

Delhi election results : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఆప్​ ఓటమి దాదాపు ఖాయమైపోయింది. అయితే, ఈసారి దిల్లీలో బీజేపీ విజయం వెనుక ఒక కారణం నిర్మలా సీతారామన్​ చేసిన ఒక ప్రకటన అని నిపుణులు చెబుతున్నారు. అదేంటి?

నిర్మల చేసిన ఆ ఒక్క పనితో కేజ్రీవాల్​- ఆప్​ ఖేల్​ ఖతం!
నిర్మల చేసిన ఆ ఒక్క పనితో కేజ్రీవాల్​- ఆప్​ ఖేల్​ ఖతం! (Sansad TV)

దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం! దిల్లీలో అరవింద్​ కేజ్రీవాల్​కి చెందిన ఆమ్​ ఆద్మీ పార్టీ ఓటమి అంచున నిలబడింది. ఆప్​ కంచుకోటపై జెండా ఎగరేసేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ గురించి మాట్లాడుకుంటున్నారు. రూ. 12లక్షల ఆదాయంపై సున్నా ట్యాక్స్​ అంటూ.. బడ్జెట్​ 2025లో ఆమె చేసిన ప్రకటన, ఇప్పుడు దిల్లీ ఎన్నికల్లో బీజేపీకి వరంగా మారిందని అభిప్రాయపడుతున్నారు.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- బీజేపీ గెలుపు ఖాయమే!

దిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం మెజారిటీ మార్​క్​ 36గా ఉంది. శనివారం దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాగా మధ్యహ్నం 12 గంటల సమయంలో బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్​ 25 చోట్ల లీడింగ్​లో ఉంది. కాంగ్రెస్​ ఖాతా తెరవలేదు.

ఇదే కొనసాగితే, దిల్లీలో దాదాపు 26ఏళ్ల తర్వాత బీజేపీ జెండా ఎగరడం ఖాయంగా మారింది. 1998లో 52 రోజుల పాటు దిల్లీ సీఎం పదవిలో కొనసాగారు బీజేపీ నేత, దివంగత సుష్మాస్వరాజ్. ఆ తర్వాత వరుసగా 1998, 2003, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, 2013, 2015, 2020లో ఆప్ చేతిలో బీజేపీ ఓడిపోయింది.

అక్కడ ట్యాక్స్​ కట్​- ఇక్కడ ఓట్లే- ఓట్లు..?

ఈ దఫా దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ‘మధ్యతరగతి’, ‘ఆదాయపు పన్ను’ వంటి పదాల చుట్టూనే తిరిగాయని చెప్పుకోవాలి. ట్యాక్స్​ విషయంలో బీజేపీపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్ సైతం.​. తన ప్రచారాల్లో ఆదాయపు పన్నును ఆయుధంలా వినియోగించుకున్నారు.

కానీ బడ్జెట్​ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి! నిర్మల సీతారామన్​ చేసిన ప్రకటనతో మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఉపశమనం కలగడం మాత్రమే కాకుండా, 2025 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్​పైనా ప్రభావం చూపించింది అనడంలో సందేహం లేదు.

మధ్యతరగతి ఎవరికి ఓటు వేస్తుంది?

2013లో తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ తన అవినీతి వ్యతిరేక నినాదంతో మధ్యతరగతి ప్రజలకు చేరువైంది. కొన్నేళ్ల తర్వాత పార్టీ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న పేద, దిగువ మధ్యతరగతి వర్గాల్లో బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.

అయితే, లోక్​నీతి-సీఎస్డీఎస్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం 2015-2020 అసెంబ్లీ ఎన్నికల మధ్య పేద, అల్పాదాయ, మధ్య ఆదాయ ఓటర్లలో భారతీయ జనతా పార్టీ.. తనకు, ఆప్​కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించుకుంటూ వచ్చింది.

2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం ఓట్ల శాతంలో ఆప్- బీజేపీ కంటే 15శాతం ముందంజలో ఉండగా, మధ్యతరగతి ఓటర్లలో రెండు పార్టీల మధ్య వ్యత్యాసం కేవలం 6 శాతంగా నమోదైంది. ఈ వర్గంలో ఆప్ ముందంజలో కనిపించింది.

అయితే కేజ్రీవాల్​ మాత్రం ఆప్​ని పేద, మధ్యతరగతి ప్రజల పార్టీగా తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇందుకోసం తన సబ్సిడీ, ఉచిత పథకాలపై ఆధారపడ్డారు.

కానీ బీజేపీ మాస్టర్​ స్ట్రోక్​ అంతా.. బడ్జెట్​ 2025లో ఆదాయపు పన్ను మినహాయింపులో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

“ఆప్ క్లీన్ గవర్నమెంట్ అజెండాను పంక్చర్ చేసేందుకు బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. దిల్లీలో మధ్యతరగతి ఓటర్లు చాలా కాలంగా ఊగిసలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఆప్​కు ఓటేశారు. ఆదాయపు పన్ను ప్రకటనతో 6 శాతం వ్యత్యాసం ఈసారి బీజేపీకి అనుకూలంగా మారింది,” అని బ్యాంకర్ నుంచి రాజకీయ విశ్లేషకుడు అమితాబ్ తివారీ లైవ్​మింట్​కు తెలిపారు.

బిజేపీకి ప్రధాన ఓటు బ్యాంకు - ఎగువ మధ్యతరగతి, బిజినెస్​ వ్యాపారుల సమాజం. వీరు సంవత్సరాలుగా దేశ రాజధానిలో బీజేపీకి ఓటు వేస్తూనే ఉన్నారు. కానీ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లకు పడిపోయింది. దీని వెనుకు పేద, మధ్యతరగతి ప్రజలు ఉండటం కారణం. వీరిని ఆకర్షించేందుకు ఈసారి కమలదళం గట్టి ప్లాన్​ వేసింది. అది ఇప్పుడు ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది..

ఎక్కువ మంది భారతీయుల్లో ఆశలు సన్నగిల్లాయి: సర్వే

బడ్జెట్ 2025కు ముందు మధ్యతరగతి ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు సర్వేలు చెబుతుతున్నాయి. 2024 లోక్​సభ ఎన్నికల్లో మధ్యతరగతి ఓటర్లలో బీజేపీకి 3 శాతం తగ్గుదల నమోదు కాగా, కాంగ్రెస్​కి మధ్యతరగతి ఓట్లు 2 శాతం పెరిగాయని తివారీ తెలిపారు.

స్తబ్దుగా ఉన్న వేతనాలు, అధిక జీవన వ్యయాల కారణంగా ఎక్కువ మంది భారతీయులు తమ జీవన నాణ్యతపై తక్కువ ఆశలు పెట్టుకుంటున్నారని బడ్జెట్ 2025కు ముందు నిర్వహించిన ఓ సర్వేలోనూ వెల్లడైంది.

వచ్చే ఏడాదిలో సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తాయని ప్రీ బడ్జెట్ సర్వేలో పాల్గొన్న వారిలో 37 శాతం మంది అంచనా వేశారని, 2013 తర్వాత ఇదే అత్యధికమని ఎన్నికల సంస్థ సీ-ఓటర్ బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో పేర్కొంది.

అయితే, వీటన్నింటికీ ఒక్క ప్రకటనతో చెక్​ పెట్టింది బీజేపీ! నిర్మలా సీతారామన్​ చేసిన రూ. 12లక్షల ఆదాయపు పన్ను మినహాయింపు ప్రకటన ఇప్పుడు బీజేపీకి వరంగా మారింది.

జనవరిలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించినప్పుడు 2025 బడ్జెట్​లో జాతీయ రాజధాని కేంద్రీకృత ప్రకటన చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కానీ యావత్​ భారత దేశ ప్రజలకే ఉపశమాన్ని కల్పిస్తూ ఆదాయపు పన్నుపై కీలక ప్రకటన చేయడంతో దిల్లీ ఓటర్లు కూడా బీజేపీవైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం