Arvind Kejriwal : నిన్నటి వరకు ప్రధాని అభ్యర్థి- ఇవాళ ఎమ్మెల్యే కూడా కాదు.. కేజ్రీవాల్ ఖేల్ ఖతం!
Arvind Kejriwal defeat : అరవింద్ కేజ్రీవాల్‌కి బిగ్ షాక్! దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత ఓటమి అంచున నిలబడ్డారు. న్యూ దిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ గెలుపువైపు దూసుకెళుతున్నారు.

దేశ రాజకీయాల్లో కీలక మలుపు! దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఓటమి అంచున నిలబడ్డారు! తన న్యూ దిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్వే వర్మ చేతుల్లో దాదాపు 4వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓటమిని చూడొచ్చు.
నిన్న మొన్నటి వరకు విపక్షాల ‘పీఎం అభ్యర్థి’ రేసులో ముందు వరుసలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌కి.. ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే సీటు కూడా లేకపోవడం గమనార్హం.
మొదటి నుంచి వెనుకంజలోనే..!
70 సీట్లున్న దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. న్యూ దిల్లీ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలోనే ఉన్నారు. ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ వర్మ.. కేజ్రీవాల్‌పై ఆధిపత్యాన్ని చెలాయించారు.
కౌంటింగ్ మొదలైన గంటన్నర తర్వాత కేజ్రీవాల్ తొలిసారి ఆధిక్యంలోకి వచ్చారు. అది కూడా చాలా స్వల్ప ఆధిక్యంలో కనిపించారు. కొంతసేపటికే మళ్లీ వెనుకంజలోకి వెళ్లిపోయారు.
చివరికి, న్యూదిల్లీ నియోజకవర్గం 14 రౌండ్ల కౌటింగ్లో 13వ రౌండు ముగిసే సమయానికి అరవింద్ కేజ్రీవాల్ 4099 ఓట్ల తేడాతో వెనకంజలో ఉన్నారు.
ఈ క్రమంలోనే న్యూదిల్లీ నియోజకవర్గంలో తాను కేజ్రీవాల్‌ని ఓడించినట్టు పర్వేష్ వర్మ ప్రకటించారు.
అటు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా 2025 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పీడకలగానే మిగిలిపోతాయి! ఎన్నికల సంఘం డేటా ప్రకారం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు ఆప్ 3 చోట్ల విజయం సాధించి, మరో 19 చోట్ల లీడింగ్‌లో ఉంది. మొత్తం మీద ఆప్‌కి 22 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అటు బీజేపీ 48 చోట్ల గెలవొచ్చు.
మరీ ముఖ్యంగా కేజ్రీవాల్‌తో పాటు డిప్యూటీ సీఎం మనీశ్ శిశోడియా కూడా తన జంగ్‌పురా నియోజకవర్గంలో ఓడిపోయారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా వీరిద్దరు జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.
కేజ్రీవాల్‌కి తీవ్ర భంగపాటు..!
ఒక సామాన్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి 3సార్లు దిల్లీ సీఎం పదవి చేపట్టారు అరవింద్ కేజ్రీవాల్. కానీ గత ఏడాది కాలంగా ఆయన చుట్టూ ఎన్నో రాజకీయ వివాదాలు కనిపించాయి. మరీ ముఖ్యంగా దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఆప్‌ని, కేజ్రీవాల్‌ని వెంటాడింది. ఇదే కేసులో ఆయన జైలుకు వెళ్లి వచ్చారు. వచ్చిన వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేశారు. “ప్రజలే తనని గెలిపిస్తారు. ప్రజలు గెలిపించిన తర్వాతే, తిరిగి సీఎం బాధ్యతలు చేపడతాను,” అంటూ గతేడాది తన ముఖ్యమంత్రి పదవిని ఆప్ కీలక నేత అతిషికి అప్పగించారు.
దిల్లీ లిక్కర్ స్కామ్‌తో పాటు కేజ్రీవాల్ అధికార నివాసం చుట్టూ కూడా వివాదం నెలకొంది. ఆడిట్ నివేదికలో రూ.96 లక్షల విలువైన మెయిన్, షీర్ కర్టెన్లు, రూ.39 లక్షల విలువైన కిచెన్ ఎక్విప్మెంట్, రూ.4.80 లక్షల విలువైన మినీబార్, రూ.16.27 లక్షల విలువైన సిల్క్ కార్పెట్లు కనిపించాయి. దీనిని బీజేపీ తన ప్రచార అస్త్రంగా మార్చుకుంది. ప్రజల సొమ్ముతో కేజ్రీవాల్ అవన్నీ కొనుక్కున్నారని కమలదళం ఆరోపించింది.
2025 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల రూపంలో కేజ్రీవాల్‌కి మరో ఘోర భంగపాటు తప్పలేదు. పార్టీ నాయకుడే గెలవకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా, ప్రధానమంత్రికి గట్టిపోటీనిచ్చే విపక్ష నేతల్లో కేజ్రీవాల్ ఒకరిని ఇంతకాలం అందరు భావించేవారు. కానీ తాజా ఓటమితో ఆప్ అధినేత రాజకీయ జీవితం తారుమారైంది. ప్రధాని కుర్చీ కాదు కదా, కానీసం దిల్లీ అసెంబ్లీలోకి కూడా అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.
సంబంధిత కథనం