Delhi election date: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..; ఒకే దశలో పోలింగ్
ఢిల్లీ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం (జనవరి 7) మధ్యాహ్నం ప్రకటించింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2020 లో జరగిన గత ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. 2025 అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం (జనవరి 7) మధ్యాహ్నం ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీ గడువు ఈ నెల 23తో ముగియనుంది. 2015, 2020 ఎన్నికల్లో ఆప్ 67, 62 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ సింగిల్ డిజిట్ మాత్రమే సాధించింది. పదిహేనేళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఇవే
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వివరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాకు వివరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5వ తేదీన ఒకే దశలో జరగనున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెలువడుతాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో 12 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు. ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లున్నారు. ఢిల్లీలో అన్ని పోలింగ్ బూత్ ల్లో తాగు నీరు, టాయిలెట్స్ వంటి అన్ని సదుపాయాలు కల్పిస్తామని రాజీవ్ కుమార్ తెలిపారు. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు అవసరమైన ఫెసిలిటీస్ కల్పిస్తామన్నారు.
ఈసీపై ఆరోపణలు అవాస్తవం, బాధాకరం
ఓటర్ల జాబితా రూపకల్పనలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ఎన్నికల సంఘం తిప్పి కొట్టింది. ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పొరపాట్లకు తావు లేదని స్పష్టం చేసింది. తప్పుడు ఆరోపణలు తమను బాధించాయని సీఈసీ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై వస్తున్న ఆరోపణలు కూడా నిరాధారమన్నారు. వాటి ట్యాంపరింగ్ అసాధ్యం అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గత ఎన్నికల సమయంలో వీవీ ప్యాట్ లను గణించామని, ఒక్క ఓటు కూడా తేడా రాలేదని రాజీవ్ కుమార్ గుర్తు చేశారు.
వరుసగా రెండు సార్లు ఆప్
2020లో జనవరి 6న ఎన్నికలు, ఫిబ్రవరి 8న పోలింగ్ (polling), ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ వరుసగా మూడవసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది, అయితే బిజెపి ఢిల్లీని స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. అనూహ్య విజయంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ గట్టి సవాల్ కు సిద్ధమవుతోంది.
కాంగ్రెస్ తో పొత్తు లేదు..
2024 లోక్ సభ ఎన్నికల్లో (Lok sabha elections 2024) బీజేపీ కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేసినప్పటికీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయనున్నాయి. 70 మంది సభ్యుల అసెంబ్లీ కాలపరిమితి ఫిబ్రవరి 23తో ముగియనుండటంతో కొత్త సభను ఏర్పాటు చేయడానికి అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఆప్ అభ్యర్థుల లిస్ట్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆదివారం 38 మంది అభ్యర్థులతో నాల్గవ, తుది జాబితాను విడుదల చేసింది, మొత్తం 70 మంది పోటీదారులను ప్రకటించిన మొదటి ప్రధాన పార్టీగా నిలిచింది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నాలుగోసారి న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి, ముఖ్యమంత్రి అతిషి కల్కాజీ నుంచి పోటీ చేయనున్నారు.