Delhi assembly elections : దిల్లీ ప్రజలపై కాంగ్రెస్ ‘ఉచిత’ హామీల వర్షం- ఓట్లు పడేనా?
Delhi assembly elections : దిల్లీ ప్రజలపై కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 5 హామీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆప్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ అభ్యర్థుల లిస్ట్, మేనిఫెస్టోలపై కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి. ఈసారి ఎలగైనా దిల్లీలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో.. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకు ఐదు హామీలను ఫైనలైజ్ చేసింది. అవేంటంటే..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు- ప్రజలపై హామీల వర్షం..
ఉచిత విద్యుత్, వంట కోసం సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్లు- ఉచిత రేషన్ కిట్లు వంటి హామీలను కాంగ్రెస్ గురువారం ప్రకటించింది. దిల్లీలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని స్పష్టం చేసింది. మహిళలకు నెలవారీ భృతి, నివాసితులకు ఆరోగ్య బీమా, నిరుద్యోగ యువతకు గతంలో ప్రకటించిన స్టైఫండ్లకు ఇవి అదనం అని పార్టీ వర్గాలు తెలిపాయి.
దిల్లీలో అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ హామీలను నెరవేరుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే కాంగ్రెస్ అన్ని హామీలను నెరవేర్చిందంటూ.. “దిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌ను మూడుసార్లు సీఎంగా, నరేంద్ర మోదీని మూడుసార్లు ప్రధానిగా చూశారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ఉద్యోగాలు కల్పించడం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అటు దిల్లీ, ఇటు కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యాయి. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న కాలాన్ని ప్రజలు ఇప్పుడు మిస్ అవుతున్నారు. దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ ఉన్న దిల్లీ మెట్రోను తీసుకొచ్చారు. దిల్లీలో అభివృద్ధి పనులన్నీ కాంగ్రెస్ చేసినవే,” అని అన్నారు.
300 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహ వినియోగదారులకు రూ.500కే ఎల్పీజీ సిలిండర్లు, రేషన్ కిట్లు, “ప్యారీ దీదీ యోజన” కింద మహిళలకు రూ.2,500 భృతి, ప్రతి నివాసికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, విద్యావంతులు, నిరుద్యోగ యువతందరికీ నెలకు రూ.8,500 స్టైఫండ్ ఇస్తామని కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, దేవేందర్ యాదవ్ దిల్లీ న్యాయ్ యాత్ర సందర్భంగా ఈ హామీలను ఖరారు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
కేజ్రీవాల్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో కుంభకోణం జరిగిందని, పంపిణీ సంస్థల ఖాతాలను ఆడిట్ చేయడానికి కేజ్రీవాల్ నిరాకరించారని దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 300 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ (డీబీటీ) ద్వారా పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఉచిత రేషన్ కిట్‌లో ఐదు కిలోల బియ్యం, 2 కిలోల చక్కెర, 6 కిలోల పప్పులు, 250 గ్రాముల టీ ఆకులు, ఒక లీటరు వంట నూనె ఉంటాయని ఆయన చెప్పారు.
70 మంది సభ్యులు ఉండే దిల్లీ అసెంబ్లీకి 2025 ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రయత్నిస్తోంది. మరోవైపు కేజ్రీవాల్‌ని గద్దె దించేందుకు బీజేపీ తీవ్రస్థాయిలో కృషిచేస్తోంది. వీటి మధ్య కాంగ్రెస్ కూడా తన బలాన్ని పెంచుకోవాలని ఆశిస్తోంది.
సంబంధిత కథనం