Chidambaram On BRS : కేసీఆర్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలం - కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి - చిదంబరం
Telangana Assembly Elections 2023: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తాం.. ఉద్యోగాలు, సంక్షేమం అందించే బాధ్యత మాది అని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే.. ఆరు గ్యారంటీలు అమలులోకి వస్తాయని చెప్పారు.
Telangana Assembly Elections 2023: కేసీఆర్ ఒక్కడే ఉద్యమం చేశాడు అంటే పొరపాటు అని అన్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలు త్యాగం చేశారని అన్నారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన..... ఏపీ కోసం పొట్టి శ్రీరాములు దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. ఆయన త్యాగం కంటే కేసీఆర్ దీక్ష గొప్పది కాదని... తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమమని చెప్పారు.
తెలంగాణతో నాకు 2008 నుంచి అనుబంధం ఉందన్నారు చిదంబరం. "తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన నాకు బాగా గుర్తు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగింది. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణే. జాతీయ సగటు కన్న ఎక్కువ. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. పాల ధరలూ విపరీతంగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలూ రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయి.. వ్యాట్ ఎక్కువ వసూలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణే. గ్యాస్ ధరలూ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ నిరుద్యోగ రేటు 7.8 (పురుషులు), 9.5 (మహిళలు)గా ఉంది. గ్రామీణ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కన్నా అధికం.. రాష్ట్రంలో 15.1 శాతంగా ఉంది. 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయలేదు. టీఎస్‌పీఎస్సీలో 22 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారు.. వారికి నిరుద్యోగ భృతి చెల్లించడంలో సర్కార్ ఫెయిల్ అయింది" అని చిదంబరం విమర్శించారు.
ఇక ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు చిదంబరం. "రాష్ట్ర అప్పులు 3.66 లక్షల కోట్లకు పెరిగింది.. ఏటేటా అప్పులు భారీగా పెరిగాయి.. ఫలితంగా ఒక్కొక్కరిపై 96 వేల రూపాయల అప్పు భారం పడింది. దీంతో సంక్షేమ పథకాల అమలు కష్టంగా మారింది. విద్య, వైద్యానికి కేటాయింపులు దారుణంగా పడిపోయాయి. పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు.. ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశాభివృద్ధికి కారణమయ్యాయి. కాంగ్రెస్‌కి అవకాశం ఇస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం" అని స్పష్టం చేశారు.
మంత్రి హరీశ్ కౌంటర్….
కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందన్నారు మంత్రి హరీశ్. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసిందని గుర్తు చేశారు.
“పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. పొట్టి శ్రీరాములు ఆంధ్రా రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారం లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ? అప్పటి నెహ్రు గారి ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది? చరిత్ర తెలియనిది కేసీఆర్ గారికి కాదు ..చిదంబరమే చరిత్ర తెలియకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారు. అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదం. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారు. తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహిస్తే మంచిది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెబుతున్నాయో చిదంబరం తెలుసుకుంటే మంచిది. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారు. చిదంబరం కు దమ్ముంటే తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ సాధించింది కేసీఆర్ గారు, సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మెడల్ గా నిలిపింది కేసీఆర్ గారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి వైపే ఉన్నరు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని దీవించబోతున్నరు” అంటూ మంత్రి హరీశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.