Bandi Sanjay On KCR : ధరణి తప్పుల తడక అని చెప్పడానికి కేసీఆర్ అఫిడవిటే సాక్ష్యం - బండి సంజయ్-choppadandi election news in telugu bandi sanjay slams cm kcr over his election affidavit 2023 ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Choppadandi Election News In Telugu Bandi Sanjay Slams Cm Kcr Over His Election Affidavit 2023

Bandi Sanjay On KCR : ధరణి తప్పుల తడక అని చెప్పడానికి కేసీఆర్ అఫిడవిటే సాక్ష్యం - బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Nov 12, 2023 06:01 AM IST

Telangana Assembly Elections 2023:ధరణి తప్పుల తడక అని చెప్పడానికి కేసీఆర్ అఫిడవిటే సాక్ష్యం బీఆర్ఎస్ ను ఓడగొట్టేది బీజేపీయే కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బు సంచులు పంపుతున్న కేసీఆర్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్ కుమార్

బండి సంజయ్
బండి సంజయ్

Telangana Assembly Elections 2023: బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని చెప్పే అలవాటు తనకు లేదని… ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలనేది అధిష్టానం చూసుకుంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. సామాన్య కార్యకర్తనైన తనకు ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవులిచ్చి గౌరవించిన పార్టీ బీజేపీయేనన్నారు. బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు. ప్రధానిసహా పార్టీ జాతీయ నాయకత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని ఉద్ఘాటించారు.

ట్రెండింగ్ వార్తలు

చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ....దుబ్బాకలో, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ చేసిన రచ్చ ఇంతా అంతా కాదన్నారు. అంత రాద్దాంతం చేసినా చివరకు బీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ పార్టీ తన దమ్ము చూపిందన్నారు. బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచే కుట్రకు కేసీఆర్ తెరతీసాడని…పొరపాటున బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే... కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడం తథ్యమన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అవుతారు. అప్పుడు హరీష్ రావు, కవిత, సంతోష్ రావులు బయటకు వస్తారని. కేటీఆర్ అహంకారం, బాడీ లాంగ్వేజ్ ను చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరూ పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నారు. అప్పుడు ప్రభుత్వం కూలిపోవడం పక్కా అని... అట్లాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం పదవి కోసం అందరూ కొట్లాడుకుంటారని... రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, కోమటిరెడ్డి సహా ప్రతి ఒక్కరూ మాకే సీఎం కావాలని గోల పెడతారన్నారు....తెలంగాణలో సుస్థిర పాలన కావాలంటే అది బీజేపీకే సాధ్యమన్నారు.

ధరణి గురించి మాట్లాడితే కేసీఆర్ తనను సన్నాసి అంటున్నాడని.. నాకేం తెలియదని ప్రతి సభలో చెబుతున్నాడన్నారు. కేసీఆర్ ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ లో మొత్తం 53 ఎకరాల 30 గుంటల భూమి చూపగా ధరణి రికార్డుల్లో మాత్రం 53 ఎకరాల 31 గుంటల భూమి ఉన్నట్లు చూపుతుందని. అంటే గుంట భూమి ఎక్కువ చూపుతోందని. దీనిని కరెక్ట్ చేయాల్సి ఉందని రాసిచ్చిన కేసీఆర్ ది తప్పు కాదా అని ప్రశ్నించారు. థరణిలో తప్పులు దొర్లుతున్నాయని పలుమార్లు చెప్పిన తమను ఎంతో అవమానించిన కేసీఆర్ ఇప్పుడు సన్నాసి కాదా అని దుయ్యబట్టారు. దిక్కుమాలిన పాలనలో తెలంగాణ రైతుల భూముల ఎవరెవరి రికార్డులు ఎంత తారుమారు చేసావో... ధరణి పేరుతో ఎందరి జీవితాలతో ఆడుకుంటున్నావో అర్థం కావడంలేదా కేసీఆర్ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్ కు అర్ధమైందని. అందుకే ఓడిపోయే బీఆర్ఎస్ వదిలేసి ఆ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బు సంచులు పంపుతున్నాడని ఆరోపించారు. వాళ్లు గెలిచాక బీఆర్ఎస్ లోకి వచ్చేలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా లోపాయికారీ ఒప్పందం చేసుకున్నడన్నారు. అధికారం కోసం సొంత పార్టీ నేతలను కూడా ఓడగట్టేందుకు వెనుకాడని నీచుడు కేసీఆర్ అన్నారు. కాసులకు అమ్ముడుపోయే కాంగ్రెస్ ను, తెలంగాణను నాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీలను తరిమికొట్టాలని ప్రజలను కోరుతున్నానని ప్రజలను కోరారు.

రిపోర్టర్ : గోపికృష్ణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా

WhatsApp channel