TS Assembly Elections: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం
TS Assembly Elections: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 2290మంది అభ్యర్థులు తమ అదృష్టాన్నిపరీక్షించు కుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షమంది పోలీసులతో పాటు రెండున్నర లక్షలమంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
TS Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఐదున్నరకే మాక్ పోలింగ్ పూర్తి చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదులోపు క్యూ లైన్లలో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించనున్నారు.
రాష్ట్రంలోని 13 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌కు అవకాశం కల్పించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
తెలంగాణలో 3.26 కోట్ల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2.5 లక్షలమంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. భద్రతా విధుల్లో లక్షమంది పోలీసులు పాల్గొంటున్నారు. తెలంగాణ పోలీసులతో పాటు ఏపీ, చత్తీసగడ్, కేంద్ర, పారా మిలిటరీ బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి.
తెలంగాణ సిఎం కేసీఆర్ చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు వేయనున్నారు. గురువారం తెలంగాణలో అధికారిక సెలవు కావడంతో ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈఓ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. 2014 జూన్2కు ముందే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ భౌగోళిక ప్రాంతంలోని నియోజక వర్గాల్లో ఆధిక్యత సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మరోవైపు తెలంగాణలో జరుగుతున్న మూడో అసెంబ్లీ ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. 13 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండగా, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్‌ను ఏర్పాటు చేశారు. ఏ పార్టీకి ఓటు వేశారో ఓటరు స్లిప్‌లో ప్రింట్ అవుతుంది. ఏడు సెకండ్ల పాటు ప్రింట్ కనిపిస్తుంది. ఎన్నికల కోసం 2.50 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. లక్ష మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు.
క్యూలో వెయిటింగ్ కూడా తెలుసుకోవచ్చు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో 15 నియోజకవర్గ ఓటర్ల కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల క్యూ లైన్ ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించారు. https:// ghmcbls.in/poll-queue-status వెబ్‌సైట్ ద్వారా ఎంతమంది వేచి ఉన్నారో ఓటర్లు తెలుసుకోవచ్చు.
హైదరాబాద్ పరిధిలోని ఓటర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. పట్టణాల్లో తక్కువ ఓటింగ్ శాతం జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ సమయం ఎదురు చూడకుండా ఉండేలా ఈ ఏర్పాటు చేశారు. క్యూ లైన్‌లో తక్కువ ఓటర్లు ఉన్నప్పుడు ఓటింగ్‌కు వెళ్లే అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఓటర్లు : 3,26,18,205
పురుషులు : 1,63,13,268
మహిళలు : 1,63,02,261
ట్రాన్స్‌జెండర్లు : 2,676
సర్వీస్ ఓటర్లు : 15,406
రాష్ట్రంలో నియోజకవర్గాలు : 119
ఎస్సీ నియోజకవర్గాలు : 19
ఎస్టీ నియోజకవర్గాలు : 12
బరిలో ఉన్న అభ్యర్థులు : 2290
బరిలో ఉన్న పురుషులు : 2068
బరిలో ఉన్న మహిళలు : 221
బరిలో ఉన్న ట్రాన్స్‌జెండర్లు : 01
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలు : 35,655
సమస్యాత్మక కేంద్రాలు : 12,000
వెబ్‌క్యాస్టింగ్ కేంద్రాలు : 27,094
ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
దివ్యాంగులు నిర్వహించేవి : 120
మహిళలు నిర్వహించేవి : 597
యువత నిర్వహించేవి : 119
మోడల్ పోలింగ్ కేంద్రాలు : 644
గుర్తింపు కార్డులుగా వీటిని అనుమతిస్తారు…
ఓటు వేసేందుకు ఓటర్ కార్డు లేకున్నా గుర్తింపు పొందిన వాటిలో ఒకటి వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.
ఆధార్ కార్డు
పాన్ కార్డు
బ్యాంకు పాస్ బుక్
ఉపాధిహామీ జాబ్ కార్డు
డ్రైవింగ్ లైసెన్స్ , పాస్‌పోర్టు
ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు
హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
యూనిక్ డిసెబిలిటీ కార్డు
ఫొటో పెన్షన్ డాక్యుమెంట్
నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్ జారీ చేసిన కార్డులను ఓటరు గుర్తింపు కార్డులుగా అనుమతిస్తారు.