Arun Goel resigns : అరుణ్​ గోయల్​- వివాదాస్పద 'నియామకం' నుంచి రాజీనామా వరకు..!-arun goel resigns as ec why ex ias officers appointment was also controversial ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Arun Goel Resigns : అరుణ్​ గోయల్​- వివాదాస్పద 'నియామకం' నుంచి రాజీనామా వరకు..!

Arun Goel resigns : అరుణ్​ గోయల్​- వివాదాస్పద 'నియామకం' నుంచి రాజీనామా వరకు..!

Sharath Chitturi HT Telugu
Mar 10, 2024 02:31 PM IST

Election commissioner : ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు.. కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు ఎలక్షన్​ కమిషనర్స్​లో ఒక్కరు మాత్రమే మిగిలారు.

ఎన్నికల కమిషనర్​గా అరుణ్​ గోయల్ రాజీనామా..
ఎన్నికల కమిషనర్​గా అరుణ్​ గోయల్ రాజీనామా.. (PTI)

Election commissioner Arun Goel : ఎన్నికల కమిషనర్​ పదవికి అరుణ్​ గోయల్​ రాజీనామా చేసిన వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రేపో, మాపో 2024 లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ వెలువడుతుందన్న అంచనాల మధ్య.. అరుణ్​ గోయల్​ రాజీనామా చేయడం చర్చలు జోరందుకున్నాయి.

అరుణ్ గోయల్ పదవీకాలం 2027 నవంబర్ వరకు ఉంది. వాస్తవానికి.. 2025లో ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయినప్పటికీ.. ఆయన అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ఇక అరుణ్​ గోయల్​ రాజీనామాతో ముగ్గురు సభ్యుల ఎలక్షన్​ కమిషనర్ల బృందంలో ఒక్కరు (సీఈసీ రాజీవ్​ కుమార్​) మాత్రమే మిగిలారు! గత నెలలో.. అనూప్​ చంద్ర పాండే.. కమిషనర్​గా పదవీ విరమణ చేశారు.

అరుణ్​ గోయల్​ అసలు ఎందుకు రాజీనామా చేశారు? అన్న ప్రశ్నకు ప్రస్తుతం స్పష్టమైన సమాధానం లేదు. కానీ.. పలు విషయాల్లో ఆయనకు ఇతరులతో విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు.

గోయల్ నియామకం చుట్టు వివాదం..

ఎన్నికల కమిషనర్​గా గోయల్​ నియామకంపైనా అప్పట్లో వివాదం చెలరేగింది. 2022 నవంబర్ 18న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్) నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2022 డిసెంబర్ 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. పదవీ విరమణ సమయంలో గోయల్ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు.

Arun Goel resigns : కాగా.. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మరుసటి రోజే ఆయనను ఎన్నికల కమిషనర్​గా నియమించింది. కేంద్రం. దీనిపై అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్ ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​లో.. కేంద్ర నిర్ణయం ఏకపక్షంగా ఉందని, భారత ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రత, స్వతంత్రతను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈసీగా నియామకానికి ముందే స్వచ్ఛంద పదవీ విరమణ పొందేందుకు గోయల్​కు విశేషమైన దూరదృష్టి ఉన్నట్లు కనిపిస్తోందని ఏడీఆర్ వ్యంగ్యంగా విమర్శించింది.

జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 2023 ఆగస్టులో ఈ పిటిషన్​ని కొట్టివేసింది.

రాజకీయ దుమారం..

ఎన్నికల కమిషనర్​గా అరుణ్​ గోయల్​ రాజీనామాపై ఇప్పుడు దేశంలో రాజకీయ దుమారం చెలరేగింది! బీజేపీపై విపక్షాలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్​ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తోంది.

'భారత్లో ఇప్పుడు ఒకే ఒక్క ఎన్నికల కమిషనర్ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్​ వెలువడనుంది. ఎందుకు?" కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. స్వతంత్ర సంస్థలను క్రమపద్ధతిలో నిర్వీర్యం చేయడాన్ని భారత్ ఆపాల్సిన అవసరం ఉందన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్యానెల్​కు రెండు నియామకాలు జరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సర్వీసు షరతులు, పదవీకాలం) చట్టాన్ని ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీ, ఆయన ఎన్నుకున్న ఒక మంత్రి మెజారిటీ ఓటుతో ఎన్నికల కమిషనర్లను నియమించే కొత్త చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. జనవరి 2 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో సీఈసీ, ఇతర ఈసీల నియామకానికి రాష్ట్రపతికి సిఫార్సులు చేయడానికి ప్రధాని, ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి నిబంధనలు ఉన్నాయి.

2024 లోక్​సభ ఎన్నికలకు ముందు, తాజా పరిణామాలతో.. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరిని మోదీ నియమించనున్నారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది,' అని గోఖలే అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం