Postal Ballots Issue: ఏపీ సీఈఓ ఆదేశాలపై వైసీపీ అభ్యంతరం, సీఈసీకి వైసీపీ ఎంపీ ఫిర్యాదు
Postal Ballots Issue: పోస్టల్ బ్యాలెట్ నిబంధనల్ని సడలిస్తూ ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి జారీ చేసిన ఆదేశాలపై వైసీపీ అభ్యంతరం చెబుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు సీఈఓ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు.
Postal Ballots Issue: పోస్టల్ బ్యాలెట్లను పరిగణలోకి తీసుకునే విషయంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన ఆదేశాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈఓ ఉత్తర్వులు ఉన్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిఇటీవల ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఎస్.నిరంజన్ రెడ్డి సీఈసీకు విజ్ఞప్తి చేశారు.
అటెస్టింగ్ అధికారుల నమూనా సంతకాలను సేకరించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం వల్ల చెల్లుబాటు అయ్యే పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరణకు గురవుతాయని, ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం వాటిల్లుతుందని నిరంజన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై సంతకాలు చేసిన అటెస్టింగ్ అధికారుల నమూనా సంతకాల సేకరణకు సంబంధించి మే 25న జారీ చేసిన ఆదేశాలు గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ రాజీవ్ కుమార్ కు పంపిన మెయిల్ లో ఎంపీ పేర్కొన్నారు. ఈసీఐ ఏర్పాటు చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తక్షణమే సమీక్షించి పునఃసమీక్షించాలని కోరారు.
ఏమి జరిగిందంటే…
పోస్టల్ బ్యాలెట్ నిబంధనల సడలింపునిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఉత్తర్వులపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మే 25న మీనా జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు. అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ గత ఏడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేశారు.
స్పెసిమెన్ సంతకాల సేకరణతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కంపులో ఓట్లు తిరస్కరణకు గురతాయని చెబుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సీఈసీకి వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఏపీ సీఈఓ జారీ చేసిన ఉత్తర్వుల్ని సమీక్షించి, ఆ ఆదేశాలపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ అధికారి సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా తన పేరు, హోదా వివరాలను చేతి రాతతో రాసినా అమోదించాలని గత ఏడాది ఎన్నికల సంఘం జూలై 19న జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలు చేస్తున్నారని, టీడీపీ ఫిర్యాదుల నేపథ్యంలో మీనా స్పెసిమెన్ సంతకాల సేకరణ ఆదేశాలు జారీ చేశారని ఆరోపిస్తున్నారు.
మే25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ నమోదు సమయంలో రిటర్నింగ్ అధికారులు నియమించిన అటెస్టింగ్ అధికారుల నమూనా సంతకాలను సేకరించి అన్ని జిల్లాల కలెక్టర్లు, డిస్ట్రిక్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్లకు, ఆర్వోలకు పంపాలని ఆదేశించారు.
ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల ప్రకారం అటెస్ట్ చేసిన అధికారి సంతకం చేసి వివరాలను నమోదు చేయకపోయినా, ఆర్వోల వద్ద ఉండే స్పెసిమెన్ సంతకాలతో పోల్చి ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సంతకాల నమూనాలతో పోల్చే ప్రక్రియతో ఏజెంట్ల మధ్య విభేదాలు తలెత్తాయని,శాంతిభద్రతల సమస్యలు ఏర్పడతాయని వైసీపీ వాదిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఏపీలో ఇచ్చిన మినహాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం నుంచి సానుకూల స్పందన రాకుంటే కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.
సంబంధిత కథనం