hat trick Defeat: ఆ స్థానాల్లో హ్యాట్రిక్ ఓటమి నుంచి టీడీపీ గట్టెక్కుతుందా…? దాదాపు యాభై స్థానాల్లో వరుస ఓటములు…
hat trick Defeat: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన రాజకీయ పార్టీలు వేటికవే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు తమదంటే తమదేనని వాదిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీని గత మూడు ఎన్నికల్లో ఓటమి పాలైన నియోజక వర్గాలు కలవర పెడుతున్నాయి.
hat trick Defeat: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిదో తెలియడానికి మరో 50రోజులు ఎదురు చూడాల్సిందే. గురువారం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైఎస్సార్సీపీ Ysrcp రెండోసారి అధికారంలోకి రావాలని తపిస్తోంది. వై నాట్ 175 పేరుతో ఎన్నికలకు సిద్ధమవుతోంది.
మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన TDP టీడీపీ 2019లో కేవలం 23 స్థానాలకు పరిమితం అయ్యింది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో ఏ పార్టీ అయినా సొంతంగా, జట్టుగా 88 స్థానాలను దక్కించుకుంటే వారికి విజయం దక్కుతుంది. 2014లో 102 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. BJP బీజేపీ అభ్యర్థులు మరో నాలుగు చోట్ల గెలుపొందారు.
2019 ఓటమితో 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది. NDA ఎన్డీఏ కూటమి తరపున అధికార వైసీపీతో తలపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసుకున్న నియోజక వర్గాలు కలవర పెడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో గత పదిహేనేళ్లలో టీడీపీ వరుసగా హ్యాట్రిక్ పరాజయాలు చవి చూసిన నియోజక వర్గాలు 48వరకు ఉన్నాయి. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఈ నియోజక వర్గాల్లో టీడీపీయేతర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సారైనా ఆ నియోజక వర్గాల్లో టీడీపీ జెండా ఎగురవేయాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోంది.
జిల్లాల వారీగా ఆ నియోజక వర్గాలు ఇవే…
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 2004 తర్వాత టీడీపీ అభ్యర్ధులు గెలవలేదు. 2009లో కాంగ్రెస్, 2014, 2019లో వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. జిల్లాలోని రిజర్వుడు నియోజక వర్గాలైన రాజాం(ఎస్సీ), పాలకొండ(ఎస్టీ) నియోజక వర్గాల్లో కూడా 2004 తర్వాత టీడీపీ జెండా ఎగురలేదు. అక్కడ వరుసగా మూడు సార్లు ఓటమి పాలైంది. కాంగ్రెస్ తర్వాత వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు.
విజయనగరం జిల్లాలో కురుపాం(ఎస్టీ), సాలూరు (ఎస్టీ) నియోజక వర్గాల్లో గత మూడు ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. బొబ్బిలిలో అయితే 1994 తర్వాత ఆ పార్టీ విజయం సాధించలేదు. వరుసగా ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
విశాఖపట్నంలోని పాడేరులో1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచారు. 2004లో బిఎస్పీ, 2009లో కాంగ్రెస్, 2014, 2019లో వైసీపీ అభ్యర్థులు పాడేరులో గెలిచారు.
తూర్పు గోదావరి జిల్లాలో తునిలో 2009,2014, 2019లో టీడీపీయేతర అభ్యర్థులు గెలిచారు. ప్రత్తిపాడులో చివరిసారి 1999లో టీడీపీ అభ్యర్థి గెలిచారు. పిఠాపురంలో 2004లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2009లో పిఆర్పీ, 2014లో ఇండిపెండెంట్, 2019లో వైసీపీలు గెలిచాయి.
కోనసీమలోని గన్నవరంలో 2004 నుంచి టీడీపీ గెలవలేదు. కొత్తపేట, జగ్గంపేటలో కూడా 199 తర్వాత టీడీపీ అభ్యర్థి అసెంబ్లీ ముఖం చూడలేదు. రంప చోడవరంలో గత మూడు ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. పశ్చిమ గోదావరిలో తాడేపల్లి గూడెంలో 2014లో కూటమి తరపున బీజేపీ అభ్యర్థి గెలిచారు.
కృష్ణా జిల్లాలోని నూజివీడులో గత నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. పామర్రు (ఎస్సీ), విజయవాడ వెస్ట్ నియోజక వర్గాల్లో కూడా టీడీపీకి ఓటమి తప్పలేదు. 1983 తర్వాత విజయవాడ పశ్చిమలో ఒక్కసారి కూడా టీడీపీ అభ్యర్థి గెలుపొందలేదు.
గుంటూరులో మంగళగిరిలో 1989నుంచి టీడీపీ విజయం నమోదు చేయలేదు. గత ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసినా ఓటమి తప్పలేదు. బాపట్లలో 2004 నుంచి ఓటమి పాలవుతోంది. గుంటూరు ఈస్ట్, నరసరావుపేట, మాచర్లలో కూడా నాలుగు సార్లు ఓటమి పాలైంది.
ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం(ఎస్సీ), సంతమాగులూరు (ఎస్సీ), కందుకూరు, గిద్దలూరు నియోజక వర్గాల్లో వరుస ఓటములు తప్పలేదు. నెల్లూరులో ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లిలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
వైఎస్సార్ కడపలో బద్వేల్, కడప, కోడూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, మైదుకూరులో 2009 తర్వాత టీడీపీ అభ్యర్థులు విజయం సాధించలేదు.
కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు (ఎస్సీ), కర్నూలు, పాణ్యం, నంద్యాల, కోడుమూరు, ఆలూరులో వరుస పరాజయాలను ఎదుర్కొన్నారు. చిత్తూరులో పీలేరు, మదనపల్లె, పుంగనూరు, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పూతల పట్టులో టీడీపీ అభ్యర్థులు వరుసగా ఓటమి పాలయ్యారు. ఉమ్మడి జిల్లాల్లో కేవలం అనంతపురంలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు వరుసగా ఓటమి పాలయ్యారు.
మరోవైపు టీడీపీ వర్గాలు మాత్రం వరుస పరాజయాలు ఉన్నా 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన విషయం గుర్తు చేస్తున్నారు. పార్టీ బలాబలాలు ఒక్కో జిల్లాలో ఒక్కోలా ఉంటాయని చెబుతున్నారు. 2014లో 102 స్థానాల్లో టీడీపీ గెలిచిందని వరుస ఓటములు నమోదైన నియోజక వర్గాల్లో ఓటములకు రకరకాల కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
సంబంధిత కథనం