Ichchapuram Election Fight: ఇచ్చాపురంలో గెలుపెవరిది.. బెందాళం హ్యాట్రిక్ సాధిస్తారా?-who will win in ichapuram will bendalam score a hat trick victory in elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ichchapuram Election Fight: ఇచ్చాపురంలో గెలుపెవరిది.. బెందాళం హ్యాట్రిక్ సాధిస్తారా?

Ichchapuram Election Fight: ఇచ్చాపురంలో గెలుపెవరిది.. బెందాళం హ్యాట్రిక్ సాధిస్తారా?

Sarath chandra.B HT Telugu
Apr 24, 2024 01:48 PM IST

Ichchapuram Election Fight: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొట్టమొదటి నియోజక వర్గమైన ఇచ్చాపురంలో అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ తరపున మూడోసారి బెందాళం అశోక్‌, వైసీపీ తరపున పిరియా విజయ పోటీ చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో  ఇచ్చాపురం నియోజక వర్గంలో
 గెలుపెవరిది.....
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజక వర్గంలో గెలుపెవరిది.....

Ichchapuram Election Fight: ఏపీలో మొట్టమొదటి నియోజక వర్గమైన శ్రీకాకుళంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ Bendalam Ashok హ్యాట్రిక్ విజయం సాధిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన అశోక్‌ మూడో సారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చాపురం, టెక్కలి నియోజక వర్గాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. మాజీ టీడీపీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ వైసీపీ తరపున పోటీ చేసి 7145 ఓట్లతో ఓటమి పాలయ్యారు.

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులకు వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రధాన హామీల్లో పింఛన్‌ పంపిణీ ప్రధాన సమస్యగా ఉంది. కిడ్నీ బాధితులకు డయాలసిస్ స్టేజీలో ఉన్న వారికి రూ.10 వేలు పెన్షన్‌గా ఇస్తామని ప్రకటించారు. సీరం క్రియాటిన్‌ 5 పాయింట్లు దాటిన వారికి రూ.5 వేలు చొప్పున పింఛన్ మంజూరు చేస్తామన్నా అర్హులందరికీ పెన్షన్ రావడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది.

రూ.5 వేలు పింఛన్ విషయంలో కొందరికే పరిమితం చేశారని. బాధితుల గుర్తింపుప్రక్రియ జిల్లా కేంద్రానికి పరిమితం చేయడంతో వేలాది మంది అర్హులు ఉన్నా వందల సంఖ్యలోనే పింఛన్లు అందుతున్నాయని ఆరోపిస్తున్నారు. తాజా ఎన్నికల్లో వైసీపీ తరపున పిరియా విజయ Piria Vijaya పోటీ చేస్తున్నారు.

బెందాళం అశోక్‌ హామీలు:

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఎక్కువమంది జీవనోపాధి పొందేందుకు వీలుగా కొబ్బరిపార్కు ఏర్పాటు చేయిస్తామని గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర‌్థి బెందాళం అశోక్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచినా తెదేపా ప్రభుత్వం లేకపోవడంతో ఇచ్చిన హమీపై ఎలాంటి కదలిక లేదు.ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పార్కు ఏర్పాటుపై ఎలాంటి కదలిక లేదు.

వేలాది ఎకరాల పంట భూములకు సాగునీరందించే “బీలబట్టి” ఆధునికీకరణ పనులు చేపడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చినా నెరవేర్చలేకపోయారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచినా అధికారంలో ప్రభుత్వం లేకపోవడంతో ఆధునికీకరణ పనులు చేపట్టలేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదని చెబుతున్నారు.

మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ఛానెల్స్, ఇతర సాగునీటి వనరుల అభివృద్ధి చేస్తామని చెప్పినా సాగునీటి వనరుల అభివృద్ధి విషయంలో ఎలాంటి కదలిక లేదు.

ఎమ్మెల్యే అశోక్‌పై ఆరోపణలు… బెందాళం అశోక్‌కు స్థానికంగా మంచి పేరు ఉంది. వారసత్వంగా సంక్ర మించిన కొబ్బరితోటలు, వ్యవసాయ భూములు ఉన్నాయి. ఎలాంటి వ్యాపారాలూ చేయడం లేదని చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీ కావడంతో ఐదేళ్లుగా స్తబ్దుగానే ఉంటున్నారు.

టీడీపీ అధికారంలో ఉండగా ఇచ్చాపురంలో ఇసుక దందా నడిచేది. ప్రస్తుతం అది పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోవడం, స్థానిక ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉండడంతో దేని జోలికీ వెళ్లడం లేదు.

2014-19 మధ్య కాలంలో మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నడిచేవి. వాటి నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసేవారు. కొన్ని సార్లు ఎమ్మెల్యే అనుచరులను పాటలో నిలిపి దుకాణాలు దక్కించుకునేవారు. ప్రస్తుతం మద్యం విక్రయాలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండడంతో దానికి కూడా చెక్ పడింది.

ఎమ్మెల్యే బంధువులు, కుటుంబసభ్యులు ఎవరూ రాజకీయాల్లో లేరు. ప్రస్తుతం అనుచరులంటూ ఎవరూ లేరు. గతంలో అనుచరులుగా ఉన్న చాట్ల తులసీదాన్రెడ్డి (ప్రస్తుత ఏఎంసీ చైర్మన్ భర్త), దేవదాసురెడ్డి (కంచిలి ఎంపీపీ), నర్తు నరేంద్ర యాదవ్ (పీఏసీఎస్ చైర్మన్), అంబటి లింగరాజు (మాజీ జడ్పీటీసీ), బెందాళం కిరణ్ కుమారి (మాజీ ఎంపీపీ) వంటి వారంతా ఎన్నికలకు ముందే వైసీపీలోకి వెళ్లిపోయారు.

ఇచ్చాపురంలో ప్రధాన సమస్యలు….

ఇచ్ఛాపురం పురపాలక సంఘంలో పూర్తిస్థాయి తాగునీటి పథకం అమలు కావడం లేదు. మూడు వార్డులకు బ్యాంకరు నీరే గతి. ఆరు వీధుల వారికి బావులే దిక్కయ్యాయి. 34 ఏళ్ల ఇచ్చా పురం పురపాలక సంఘంలో ఇప్పటికీ తీరని సమస్యగా మిగిలింది.

మంచినీటి పథకం కోసం రూ.58 కోట్లు ఉన్నా బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో మూడేళ్లుగా 40 శాతం పనులు కూడా జరుగలేదు. రత్తకన్న, పురుషోత్తపురం, ఏఎస్పేట, నాలుగు, 12 వార్డుల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఈ సమ స్యను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు ఊదరగొట్టినా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం మానే శారు.

ఇచ్ఛాపురం మండల పరిధిలో కేదారిపురం, ముచ్చింద్ర, మండపల్లి, బాలకృష్ణాపురం, టి.బరంపురం, డొంకూరు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వైఎస్ఆర్ మంచినీటి పథకం పనులు పూర్తికాక పోవడంతో వచ్చే వేసవిలోనూ ప్రజలకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. డొంకూరు, చిన్నలక్ష్మీపురం, శివకృష్ణాపురం, టి. ఐరంపురం ప్రజలు చెలమల నీటినే తాగేందుకు ఉపయోగిస్తుంటారు.

అధ్వాన్నంగా రోడ్లు….

ఇచ్చాపురం పురపాలక సంఘంలో పలు రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా పట్టణం నుంచి రత్తకన్నకు వెళ్లే మార్గం, రత్తకన్నలో ఆరు వీధుల రోడ్లు దారుణం. ఏఎస్పేట, పురుషోత్తపురం, కస్బా, కండ్ర వీధులు, కండ్ర కాలనీ, బెల్లుపడ కాలనీ, అచ్చమ్మపేట ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోని రహదారులు చాలా ఉన్నాయి.

ఆర్థిక సంఘం నిధులు వచ్చినా సకాలంలో వాటిని వినియోగించుకోలేకపోవ డంతో వెనక్కి మరలిపోయాయి. బిల్లుల చెల్లింపులో జాప్యంతో గుత్తేదారులు ఎవరూ ముందుకు రాకపో వడంతో నిధులు మురుగుపోయాయి.

ఇచ్చాపురం మండల పరిధిలో కేదారిపురం, ముచ్చింద్ర, మండపల్లి రోడ్లు నరకానికి మార్గాలుగా మారాయి. ఈదుపురం నుంచి బూర్జపాడు వరకు ఉన్న రోడ్డు గత ప్రభుత్వ హయాంలో వేసిందే. ప్రస్తుత ప్రభుత్వం మరమ్మతులు చేయకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎన్నికల సమ యంలో అభివృద్ధి చేస్తామని వైకాపా నాయకులు చెప్పినా పట్టనట్లు వ్యవహరించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

అంతంత మాత్రంగానే వైద్య సేవలు…

ఇచ్ఛాపురంలో వైద్య సేవలు అంతంతమాత్రమే. పట్టణంలో ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి, రెండు అర్బన్ పీహెచ్సీలు ఉన్నా ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. ఆసుపత్రిలో మత్తు మందు ఇచ్చే నిపుణులు లేకపోవడం, బేబీ కిట్లు ఇవ్వక పోవడం, ఆసుపత్రుల్లో ఖర్చులు పెరిగి పోవడం, పలు పరీక్షలు, మందులు బయట కొనుగోలు చేయాల్సి రావడంతో అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. పట్టణంలో రెండు చోట్ల వైఎస్ఆర్ క్లినిక్ల పేరిట 2019లో పనులు ప్రారంభించినా ఇప్ప టికీ పూర్తికాలేదు. ఇక్కడ కూడా బిల్లుల సమస్యే కారణం.

బాహుదానదిపై 1929లో నిర్మించిన వంతెనకు గత నాలుగున్నరేళ్లలో కనీస మరమ్మతులు కూడా చేపట్టక పోవడంతో కుప్పకూలింది. మూడున్నర నెలల తరువాత తాత్కాలిక పనులతో ఆటోలు మాత్రమే వెళ్లేలా అభివృద్ధి చేశారు. కొత్త వంతెన కోసం రూ.20కోట్లు కేటాయించినట్లు ప్రకటనలే తప్ప ప్రతిపాదనల దశ దాటలేదు.

అన్ని పురపాలకసంఘాలలోనూ రైతు బజార్లు ఉండగా, ఇచ్ఛాపురంలో దానిని ఏర్పాటుచేయలేదు. ఎన్ని కలలో ఇచ్చిన వాగ్దానానికి, స్థల సేకరణ కూడా జరగలేదు. ఇక దినవారీ బజారు కూడా వ్యాపారులకు, వినియోగదారులకు దినదినగండంగా మారింది. ఇది కూడా ఎన్నికల హామీ అయినా నెరవేరలేదు.

కంచిలి మండలం:

కంచిలి మండలంలో ప్రధాన సమస్యల్లో సాగునీటి సమస్య అతి ముఖ్యమైనది. వాటిలో అర్థాంతరంగా నిలిచిపోయిన గంగాసాగరం రిజర్వాయర్ పనులు పూర్తిచేయడం, అదే విధంగా మండలం పరిధిలో ప్రధాన సాగునీటి వనరులైన సుంకిలి సాగరం, లొద్దాలొద్ది, గోవిందసాగరం, ముకుంద సాగరం, హనుమంతు సాగరం, కొల్లూరు పెద్దచెరువు, రాకాసిగెడ్డ, తాళ్ల సాగరం అభివృద్ధి చేయడం, కుత్తుమ పరిధిలో ఉన్న ఎత్తిపోతల పథకం పునరుద్దరించడం చేయాల్సి ఉంది. సాగునీటి వనరులు అభివృద్ది లేని కారణంగా పంటలముంపు, లేదా సాగునీరందక ఎండిపోవడం జరిగి రైతులు తీవ్రం నష్టపోతు న్నారు.

ఈ మండలంలో ఆర్టీసీ బస్సులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా వరకు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీలు లేవు. దీంతో మారుమూల గ్రామాల ప్రజల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

అంపురం - ఘాటి ముకుందపురం తారు రోడ్డు విస్తరణకు సుమారు రూ.11కోట్లు మంజూరయ్యాయి. అనంతరం వైకాపా ప్రభుత్వం రావడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. దీంతో రోడ్డు విస్తరణ నిలిపోవడంతో పాటు, రోడ్డు పొడవునా గోతులు ఏర్పడి తరచూ ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. అభివృద్ది లేని కారణంగా పంటలముంపు, లేదా సాగునీరందక ఎండిపోవడం జరిగి రైతులు తీవ్రం నష్టపోతు న్నారు.

కవిటి మండలం:

కవిటి మండలంలో సుమారు 35వేల ఎకరాల్లో కొబ్బరిసాగు చేస్తున్నారు. నాణ్యతప రంగా బాగుంటుంది. గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడటం సర్వసాధారణంగా మారింది. కొబ్బరి పంటపై ప్రత్యక్షంగా సుమారు 50వేలు, పరోక్షంగా 40వేలు కుటుంబాలు ఉపాధిపొందుతున్నారు. పండు గలు, పబ్బాల సమయాల్లో కూడా ధర నిలకడలేక దళారులు రాజ్యమేలుతున్నారు.

కవిటి మండలంలో తొమ్మిది తీరప్రాంత మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. సుమారు 10వేలు మత్స్యకార కుటుంబాలు చేపలవేట వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. మత్స్యకారులకు మౌలిక సదుపాయల కొరతతో మత్స్య సంపద దళారీలు కనుసన్నల్లో లావాదేవీలు సాగిస్తున్నారు. ప్రధానంగా నిల్వ చేసేందుకు శీతలగి డ్డంగులు, ఆరబెట్టేందుకు చష్టాలు పూర్తిస్థాయిలో లేవు. ఫలితంగా దళారీలకు ఏదోఒక ధరకు అమ్ముకొనే స్థితి ఉంది.

కవిటి మండలంలో కిడ్నీ బాధితులు అధికం. కవిటి సామాజిక ఆసుపత్రిలో మాత్రమే డయాలసిస్ సౌకర్యం ఉంది. మిగిలిన నాలుగు ఆసుపత్రుల్లో ఆ వసతి లేక రోగులు దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బం దులు పడుతున్నారు.

సోంపేట మండలం:

సోంపేటలో ప్రధాన రహదారి విస్తరణ ప్రతిపాదన ముందుకు కదలలేదు. నిధులు మంజూరయ్యాయని ఆర్భాటపు ప్రకటనలతో సరిపెట్టారు. నాలుగు దశాబ్దాలుగా ఇదే సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతు న్నారు.

ఉత్తరాంధ్ర కొబ్బరి తోటల విస్తరణకు ఉపయోగపడుతున్న బారువ కొబ్బరి నారుమడి అభివృద్ధికి చర్యలు లేవు.. పూర్తిస్థాయి అధికారిని నియమించలేదు. నారుమడిలో నిర్మించిన పలు భవనాలు నిర్వ హణ లేకపోవడంతో నాశనమవుతున్నాయి. సాగునీటి కోసం ఏర్పాటు చేసిన గుంతలు మూతపడే పరిస్థి తి ఏర్పడింది. ఏటా 1.5 లక్షలకు పైగా నారు అందించే నారుమడిని అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఒడిశా ఎత్తిపోతల పథకాలతో కష్టాలు…

మహేంద్రతనయ నదిపై ఎగువ భాగంలో ఒడిశా ప్రభుత్వం నిర్మించిన ఎత్తిపోతల పథకాలతో ఆంధ్రప్ర దేశ్ వాటా నీరు రావడం లేదు. ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రాజెక్టులు అలంకారప్రాయంగా మార డంతో పంటపొలాలు బీడుగా మారుతున్నాయి.

మహేంద్రతనయ నదిలోకి ఉప్పు జలాలు చొచ్చుకొస్తుండటంతో తాగునీటి పథకాలు, సాగునీటి వనరు లకు ముప్పు ఏర్పడుతోంది. ఉద్దానం ప్రాంతంలో మంచినీటి బావులు మూతపడుతున్నాయి. డైక్ నిర్మాణం హామీలకే పరిమితం కావడంతో తాగునీటికి ఇబ్బందులు నెలకొన్నాయి.

ఎకువూరు-ఎర్రముక్కాం మధ్య వంతెన, రహదారి నిర్మాణం ఐదేళ్లుగా పునాదుల దశలోనే ఉండటంతో తీరప్రాంత గ్రామాల ప్రజల అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఈ పనులకు సంబంధించి బిల్లులు చెల్లింపునకు నోచుకోకపోవడంతో పనులు ముందుకు కదలడం లేదు.

Whats_app_banner