Parvathipuram Election Fight: పార్వతీపురం దక్కేది ఎవరికి? అలజంగి జోగారావు Vs బోనెల విజయచంద్ర…-who will get parvathipuram alajangi jogarao vs bonela vijayachandra ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Parvathipuram Election Fight: పార్వతీపురం దక్కేది ఎవరికి? అలజంగి జోగారావు Vs బోనెల విజయచంద్ర…

Parvathipuram Election Fight: పార్వతీపురం దక్కేది ఎవరికి? అలజంగి జోగారావు Vs బోనెల విజయచంద్ర…

Sarath chandra.B HT Telugu
Apr 30, 2024 05:00 AM IST

Parvathipuram Election Fight: పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గంలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. 2019 ఎన్నికల్లో పార్వతీపురంలో టీడీపీ ఓటమి పాలైంది. తాజా ఎన్నికల్లో విజయం కోసం రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.

అలజంగి జోగారావు వర్సెస్ విజయచంద్ర
అలజంగి జోగారావు వర్సెస్ విజయచంద్ర

Parvathipuram Election Fight: పార్వతీపురం మన్యం Parvathipuram Manyam జిల్లాలోని పార్వతీపురం parvathipuram SC అసెంబ్లీ నియోజక వర్గంలో 2019 ఎన్నికల అలజంగి జోగారావు Alajangi Jogarao వైఎస్సార్సీపీ Ysrcp తరపున గెలిచారు. 2014లో TDP టీడీపీ తరపున గెలిచిన బొబ్బిలి చిరంజీవులు 2019లో ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో టీడీపీ తరపున Bonela VijayaChandra బోనెల విజయచంద్ర టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు.

yearly horoscope entry point

2019లో సీఎం జగన్ హామీలు:

  • సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వపరం చేసి రైతులను, కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్రషింగ్‌కు సరిపడా చెరకు దిగుబడులు లేక కర్మాగారం నష్టాల్లో మునిగిపోయింది. కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.6 కోట్లు ఉండిపోయాయి. యాజమాన్యం చేతులెత్తేసి కర్మాగారాన్ని మూడు సీజన్లుగా మూసేసింది. రానున్న రోజుల్లోతెరచుకొనే అవకాశాలు కనిపించడం లేదు. కర్మాగారం పరిధిలోని భూములు వేలం వేసి రైతులకు రూ.16.84 కోట్ల బకాయిలు చెల్లించారు. ప్రస్తుతం ఈ భూముల వేలం చెల్లదని ట్రైబ్యునల్ లా కంపెనీ తీర్పు ఇవ్వడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కర్మాగారం మూసివేతతో సుమారు 300 మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు.
  • జంఝావతి జలాశయం నుంచి పార్వతీపురం నియోజకవర్గంలోని పూర్తి ఆయకట్టుకు సాగునీరందిస్తామని చెప్పారు. ఐదేళ్లలో జంఝావతి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. టీడీపీ హయాంలో రూ.13 కోట్లు కేటాయించినా టెండర్ల ప్రక్రియలో జాప్యం జరగడంతో పనులు మొదలు కాలేదు. నిర్మాణ వ్యయం పెరగడంతో తమను పనుల నుంచి తప్పించాలని కాంట్రాక్టర్లు కోరడంతో వారిని పక్కన పెట్టేశారు. దీంతో పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జంఝావతి జలాశయానికి సంబంధించి ముంపు ప్రాంతం ఒడిశాలో ఉండటంతో అక్కడి ప్రభుత్వం అడ్డుపడుతోంది. 2022లో ముఖ్యమంత్రి జగన్ ఒడిశా సీఎంతో సమావ శమై పలు అంశాలపై చర్చించినా జంఝావతి అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు.
  • బలిజిపేట మండలంలోని పెదంకలాం ఆనకట్ట ఆధునికీకరణను జపాన్ ఆర్థిక సాయంతో ఆధునికీకరణ చేపట్టాలని 2012 నుంచి ప్రతిపాదనలున్నాయి. 2020లో రూ.17 కోట్లు మంజూరయ్యాయి. 2022, 2023లో రెండు దఫాలుగా పనులు చేసినా కేవలం కిలోమీటరు పరిధిలోనే జరిగాయి. మరో 15 కిలోమీటర్ల మేర జరగాల్సి ఉంది.
  • సువర్ణముఖి నదిపై సీతానగరం, గెడ్డలుప్పి వద్ద వంతెనల నిర్మాణానికి కాంగ్రెస్ హయాంలోనే నిధులు మంజూరయ్యాయి. మొదట పంచాయతీరాజ్ ఇంజినీరింగు విభాగం ఈ పనులు ప్రారంభించింది. నదిలో పనులు జరుగుతుండగా, జాయింట్స్‌ జారిపోవడంతో పనులు ఆపేశారు. టీడీపీ హయాంలో రహదారులు, భవనాలు శాఖకు అప్పగించారు. ప్రస్తుతం వంతెన నిర్మాణం పూర్తయినా, అనుసంధాన రహదారులు నిర్మించక నిరుపయోగంగా మారింది.
  • సీతానగరం వంతెనకు టీడీపీ రూ.12 కోట్లు కేటాయించింది. శంకుస్థాపన కూడా చేశారు. పాతవంతెన మరమ్మతులకు నిధులు కేటాయించారు. ప్రస్తుతం పనులు నత్తనడకన సాగుతున్నాయి. గుత్తేదారుకు సుమారు రూ.4 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. దీంతో అతను పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.
  • అడారుగెడ్డ పథకాన్ని పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ పూర్తికాలేదు. కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభించిన పనులు రాష్ట్ర విభజన సమయంలో నిధులు వెనక్కి పోయాయి. ప్రస్తుతం పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కాలువల తవ్వకానికి భూసేకరణ చేయాల్సి ఉంది.
  • బలిజిపేట మండలంలో సువర్ణముఖి నదిపై నారాయణపురం వద్ద వంతెన పూర్తి చేస్తామన్నా,వంతెన పూర్తి కావడానికి మరో రూ.4 కోట్లు అవసరం ఉంది. ఈ నిధులు మంజూరైతేనే పనులు పూర్తయి రాకపోకలకు అవకాశం ఉంటుంది.
  • పార్వతీపురం పట్టణానికి తాగునీటి కొరత లేకుండా తీర్చేస్తామన్న హామీ నెరవేరలేదు. ఇప్పటికీ పట్టణంలో తాగునీటి సమస్య ఉంది. వర్షాకాలంలో ఇన్ఫిల్టరేషన్ బావుల్లోకి వరదనీరు చేరుతుంది. దీన్ని అధిగమించడానికి తెదేపా హయాంలో అడ్డాపుశిల వద్ద ట్యాంకులు నిర్మించి నీటిని సరఫరా చేయడానికి ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఎవరూ పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలో రంగమారిన నీటినే సరఫరా చేస్తుంటారు.
  • తోటపల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి, వారికి మెరుగైన జీవనం కల్పిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు.నిర్వాసితుల సమస్యలు చాలావరకు పరిష్కారానికి నోచుకోలేదు. కనీసం గృహ నిర్మాణానికి కూడా ఎంతిస్తారో ఇప్పటివరకు ప్రకటించలేదు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే మొత్తం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. పునరావాస కాలనీల్లోనూ సదుపాయాలు కల్పించలేదు.

ఎమ్మెల్యే జోగారావు హామీలు:

అలజంగి జోగారావు ఎన్నికల ముందు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. 2019 ఎన్నికల్లో ప్రచారం చాలా తక్కువగా చేశారు. ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. వైసీపీ హవాలో గెలిచారు.

ఎమ్మెల్యే భార్య ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. వీరిక ఒక కుమార్తె ఉంది. విద్యాభ్యాసం చేస్తోంది. వీరిలో ఎవరికీ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. కానీ కొన్ని పనులు మాత్రం ఎమ్మెల్యే సతీమణికి చెబితే జరుగుతాయనే ప్రచారముంది. బంధువులు, మిత్రులు ఈమెను ఇంట్లో కలిసి పనులు చక్కబెట్టుకొంటారు.

జోగారావు కుటుంబానికి మొదటి నుంచీ రాజకీయ నేపథ్యం ఉంది. ఇతని తల్లి బలిజిపేట ఎంపీపీగా, సర్పంచిగా పనిచేశారు. బొత్స ఝాన్సీలక్ష్మి జడ్పీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఆమె వ్యవహారాలన్నీ జోగారావు చూసేవారు. అప్పుడే బొత్సకు నమ్మకస్తుడిగా మారడంతో బినామీ అయ్యారు. అందుకే పార్వతీపురం టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారనే ప్రచారం ఉంది. జోగారావు స్థిర నివాసం విజయనగరం కావడంతో అక్కడి నుంచే అంతా నడిపిస్తుంటారు.

ఎమ్మెల్యే అన్న అలజంగి రవికుమార్ బలిజిపేట జడ్పీటీసీ సభ్యుడు. అక్కడ ఆయన క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఏ పని జరిగినా అతనితో పాటు ఎమ్మెల్యే మరో సోదరుడి కనుసన్నల్లోనే జరుగుతోంది.

  • బలిజిపేట మండలం నారిపేటలో 47 ఎకరాలు విషయంలో దళితులకు, దొరలకు మధ్య వివాదం నడుస్తోంది. ఎమ్మెల్యే దళితులకు కొంత మొత్తం ఇచ్చి వారి నుంచి భూ పట్టాలు తీసుకున్నారు. ప్రస్తుతం అది ఆయన స్వాధీనంలోనే ఉందనే ప్రచారం ఉంది.
  • పార్వతీపురం మండలం బాలగుడబ పంచాయతీలో సుమారు 20 ఎకరాల చెరువును అనుచరుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
  • ఇంజినీరింగ్‌లో సహచరుడు, జనహిత పాఠశాల అధినేత భానుప్రసాద్ ఎమ్మెల్యేకి అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు ఉంది. అతనే వెనకుండి నడిపిస్తారనే ప్రచారం నియోజక వర్గంలో ఉంది.

నియోజకవర్గంలో సమస్యలు:

పార్వతీపురం పట్టణం మండలం:

  • పార్వతీపురం పురపాలక సంఘంలో పాత కాలం నాటి విద్యుత్తు తీగలు, స్తంభాలు ఉండటంతో వర్షాల సమయంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు దుకాణాలకు తీగలు తగిలి ప్రమాదాలు అగ్ని జరుగుతున్నాయి. జగన్నాథపురం, కొత్తవలస, నవిరి తదితర ప్రాంతాల్లో వీధి దీపాలు సరిగా వెలగడం లేదు.
  • పార్వతీపురం పట్టణంలోని పలు కాలనీల్లో పక్కా రోడ్లు లేవు. ఆర్టీసీ కాంప్లెక్సు వెనుక గణేష్ నగర్, ఎస్ఎన్పీ, సాయినగర్ కాలనీ, కొత్తవలసలోని సాయిరాం, మణికంఠ కాలనీతో పాటు నందమూరి కాలనీలో కొన్ని వీధుల్లో ఇప్పటికీ మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి.
  • పురపాలక సంఘానికి డంపింగ్ యార్డు సమస్య ఏళ్లుగా వేధిస్తోంది. జిల్లా కేంద్రంలో రోజూ 25 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీన్ని రాయగడ మార్గంలో రోడ్డు పక్కన వేస్తున్నారు. వర్షాల సమయంలో వ్యర్థాలు రోడ్డుపైకి చేరి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెత్తను కాలుస్తుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు పొగతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
  • వర్షాల సమయంలో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్సు ఆవరణ అధ్వానంగా తయారవుతుంది. వర్షం నీరు నిల్వ ఉండిపోతుంది. రాత్రి పూట ఆవరణలో పూర్తి స్థాయిలో దీపాలు వెలగడం లేదు. జిల్లా కేంద్రం కావడంతో రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నా పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవు.
  • పట్టణంలో మూడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కొత్తబెలగాం వెళ్లే మార్గంలో రైలు గేటు ప్రయాణీకుల సహనాన్ని పరీక్షిస్తుంది. రోజుకి రైలు, గూడ్స్ బళ్లు నడిచే సమయంలో రోజుకి 15నుంచి 20సార్లు గేటు పడుతుంది. గేటు వేసిన ప్రతి సారి 5 నుంచి 10 నిమిషాలు తెరవరు. అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు.

బలిజిపేట మండలం:

  • నారాయణపురంలో రూ.10 కోట్లతో సువర్ణముఖి నదిపై వంతెన నిర్మాణం ఏడాది క్రితం పూర్తి చేశారు. కానీ అనుసంధాన రోడ్లు నిర్మించకపోవడంతో ఈ వంతెన ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీనివల్ల పార్వతీపురం, బలిజిపేట, గరుగుబిల్లి, వంగర, తెర్లాం, వీరఘట్టం మండలాలకు వెళ్లాల్సిన ప్రజలకు దూరాభారం అవుతోంది.
  • బర్లి, మిర్తివలసలో సచివాలయాలు, ఆర్పీకేలు, సుభద్ర, బర్లి, పణుకువలస, పెదపెంకి గ్రామాలోల అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు లేక ఇరుకైన, అద్దె గదుల్లో నిర్వహణ సాగుతోంది. దీంతో చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు ద శాబ్దాల కాలంగా కలగానే మిగులుతోంది. ఈ మండలం నుంచి ఏటా 300 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ నుంచి రిలీవ్ అవుతున్నారు. వీరంతా ఇతర మండలాలకు, ప్రైవేటు కళాశాలలకు ఎఖేళ్లాల్సి వస్తోంది. దీంతో ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు.
  • జంఝావతి జలాశయం ఎగువ, దిగువ కాలువల పనులు అసంపూర్తిగా మిగలడంతో సుమారు 6 వేల ఎకరాల ఆయకట్టు రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు ఖరీఫ్ మధ్య కాలం నాటికి సాగునీరు అందుతుంది.
  • తాజా ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరుపై ప్రచారంతోనే టీడీపీ అభ్యర్ధి ఆశలు పెట్టుకున్నారు. ఐదేళ్లలో పార్వతీపురంలో సాధించిన పురోగతి ఏమి లేదనే ప్రచారం చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం