Dharmavaram BJP: ఎవరీ సత్యకుమార్, బీజేపీలో ధర్మవరం టిక్కెట్ దక్కడంలో రహస్యం ఏమిటి…?-what is the secret of getting dharmavaram ticket in bjp to satyakumar ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Dharmavaram Bjp: ఎవరీ సత్యకుమార్, బీజేపీలో ధర్మవరం టిక్కెట్ దక్కడంలో రహస్యం ఏమిటి…?

Dharmavaram BJP: ఎవరీ సత్యకుమార్, బీజేపీలో ధర్మవరం టిక్కెట్ దక్కడంలో రహస్యం ఏమిటి…?

Sarath chandra.B HT Telugu
Published Apr 03, 2024 09:39 AM IST

Dharmavaram BJP: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న సత్యకుమార్ అందరిని ఆకర్షిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు జాతీయ రాజకీయాలకే పరిమితమైన సత్యకుమార్‌ అనూహ్యంగా ఏపీ పొలిటికల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యారు.

ధర్మవరం బీజేపీ అభ్యర్ధి సత్యకుమార్
ధర్మవరం బీజేపీ అభ్యర్ధి సత్యకుమార్

Dharmavaram BJP: సత్య అలియాస్ సత్యకుమార్‌ Satyakumar… ఢిల్లీ Delhi పొలిటికల్ సర్కిల్స్‌లో పరిచయం అక్కర్లేని పేరు. వెంకయ్యనాయుడు venkayya Naidu వ్యక్తిగత కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన సత్యకుమార్, వెంకయ్య నాయుడు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.

సత్యకుమార్‌ పూర్వీకులు మహారాష్ట్ర Maharashtra నుంచి వలస వచ్చి హిందుపూర్‌లో Hindupur స్థిరపడ్డారని చెబుతారు. విద్యార్ధి దశ నుంచి ఏబీవీపీలో చురుగ్గా ఉండటంతో బీజేపీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలగడంతో అన్ని రాష్ట్రాల నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

మరాఠీ ములాలు ఉన్న యాదవ కుటుంబానికి చెందిన వ్యక్తిగా సన్నిహితులు చెబుతారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గట్టి పట్టుంది. వెంకయ్య నాయుడు అంతరంగికుడిగా, మీడియా సమన్వయకర్తగా సుదీర్ఘ కాలం పనిచేశారు. వెంకయ్య నాయుడుతో దీర్ఘ కాలం పని చేయడంతో బీజేపీలో ప్రతి స్థాయి నాయకులతో సత్యకుమార్‌కు పరిచయాలు ఉన్నాయి.

బీజేపీ BJP జాతీయాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఆ సంబంధాలు బలపడ్డాయి. వాజ్‌పేయ్‌ NDA ఎన్డీఏ ప్రభుత్వంలో వెంకయ్య నాయుడు పనిచేసిన సమయంలోను, ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వ హయంలో కూడా సత్యకుమార్ వెంకయ్య వెన్నంటి నడిచారు. వెంకయ్య దగ్గర పనిచేసిన కాలంలోనే ఆయన నమ్మకాన్ని సంపాదించారు. సత్యకుమార్‌ను వెంకయ్య ఎంతగా అక్కున చేర్చుకున్నారంటే తన సమీప బంధువుతో వివాహం జరిపించి దగ్గర చేసుకున్నారు. సత్యకుమార్‌కు ఇద్దరు సంతానం ఉన్నారు.

బీజేపీ పార్టీలో, ఎన్డీఏ ప్రభుత్వంలో వెంకయ్య నాయుడుకు ఏ పని అప్పజెప్పినా అందులో సత్య కుమార్ వెంకయ్యకు నమ్మినబంటుగా వ్యవహరించారు. బిజెపి వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల పోటీ సందర్భంగా వెంకయ్య నాయుడుకు బాధ్యతలు అప్పగిస్తే ఆయన తరపున సత్యకుమార్ పనులు చక్కబెట్టేవారు. అయా రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవహారాల్లో కూడా వెంకయ్యనాయుడు తరపున చక్క బెట్టేవాడని బీజేపీ వర్గాలు చెబుతాయి. బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో భాగస్వామిని చేయడంతో ఆ పార్టీలో అంతర్గతంగా పట్టు చిక్కిందని ఢిల్లీ వర్గాలు చెబుతాయి.

2014లో కేంద్రంలో మోదీ Modi Govt ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కూడా ఓఎస్డీగా పనిచేశారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఓఎస్ డి గా నాలుగైదు నెలలు పని చేశారు.

ఉపరాష్ట్రపతి పేషీలో కేవలం ఐఏఎస్ అధికారులు మాత్రమే అర్హులైన పదవిని సత్యకుమార్‌కు కట్టబెట్టడంపై బ్యూరోక్రాట్లలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చినట్టు చెబుతారు. సత్యకుమార్‌ పోస్టింగ్ పంచాయితీ చివరకు పిఎంఓకు వరకు చేరిందని గుర్తు చేస్తారు. సత్యకుమార్‌ పోస్టింగ్‌ విషయంలో వెంకయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడాన్ని బట్టే సత్య కుమార్ వెంకయ్యకు ఎంత దగ్గర అర్థం చేసుకోవచ్చు. రాజకీయ వ్యవహారాలతో సంబంధం లేని ఆ పోస్టులో ఇమడలేక సత్యకుమార్ తర్వాత కాలంలో బయటకు వచ్చేశారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే అనూహ్యంగా అమిత్ షా అధ్యక్షతలోని బిజెపి జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. బీజేపీలో పార్టీ పదవిని వెంకయ్య సిఫారసు చేయకుండానే దక్కించు కోవడంతో సత్యకుమార్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్ లాంటి వారితో ఉన్న పరిచయాలతో బీజేపీలో పదవిని సాధించినట్టు చెబుతారు.

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కూడా సత్య కుమార్ కు కొన్ని ప్రాంతాలలో బ్యాగ్రౌండ్ ఆపరేషన్స్ బాధ్యతల్ని పార్టీ ఆయనకు అప్పగించింది. వాటిని కూడా జాగ్రత్తగా చక్కబెట్టడంతో పార్టీలో గుర్తింపు లభించింది. ఫలితంగా మోదీ, అమిత్‌షాలు నేరుగా గుర్తించగలిగే స్థాయికి తక్కువ కాలంలోనే ఎదిగారు.

సుదీర్ఘ కాలం వెంకయ్యనాయుడుతో కొనసాగడంతో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రముఖులతో సత్యకుమార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. పత్రికల్లో వ్యాసాలు, ప్రభుత్వంపై విమర్శలతో తరచూ దాడి చేసేవారు. ఎన్నికల్లో పోటీ చేసే లక్ష్యంతోనే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. హిందూపూర్ పరిసర ప్రాంతాల్లో సత్యకుమార్‌ పూర్వీకుల సొంత ఊరిగా చెబుతారు.

గతంలో సత్యగా మాత్రమే అందరికి తెలిసిన ఎన్నికల సమయానికి సత్యకుమార‌ యాదవ్‌గా పేరును ప్రకటించారు. అనంతపురంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపుతో పాటు వెంకయ్యతో ఉన్న బంధుత్వం కూడా ఆయనకు కలిసొస్తాయని భావిస్తున్నారు.

తెలుగుదేశంతో బీజేపీకి సుదీర్ఘ కాలం కొనసాగిన స్నేహాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలనే అకాంక్ష సత్యకుమార్‌లో బలంగా ఉంది. అందుకే ఏపీ బీజేపీ అభ్యర్ధిగా సునాయాసంగా టిక్కెట్ దక్కించుకోగలిగారు.  ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌ వంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవి కూడా ఆయన అభ్యర్థిత్వానికి దోహదం చేశాయని బీజేపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. 

నిజానికి ఏపీ బీజేపీలో కేంద్రం నాయకత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న కొద్దిమందిలో ఆయన ఒకరు. నిన్న మొన్నటి వరకు తన కుల నేపథ్యాన్ని బయట పెట్టుకోవడానికి ఇష్టపడని సత్యకుమార్ ఎన్నికల సమయంలో పేరు చివరన యాదవ్ అని తగిలించుకున్నారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం