Somu Veerraju: సోము వీర్రాజు ఆశలు గల్లంతు... కనీసం పోటీ చేసే అవకాశం కూడా దక్కపోవడానికి కారణం ఏమిటి?-what is the reason why the former president of ap bjp did not get the chance to contest ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  What Is The Reason Why The Former President Of Ap Bjp Did Not Get The Chance To Contest

Somu Veerraju: సోము వీర్రాజు ఆశలు గల్లంతు... కనీసం పోటీ చేసే అవకాశం కూడా దక్కపోవడానికి కారణం ఏమిటి?

Sarath chandra.B HT Telugu
Mar 29, 2024 07:24 AM IST

Somu Veerraju: ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు నిరాశ తప్పలేదు. ఎన్డీఏ కూటమి తరపున కనీసం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ట్రెండింగ్ వార్తలు

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీటు గల్లంతైంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరినా ఆయనకు నిరాశ తప్పలేదు. బీజేపీ ఉన్న గ్రూపు గొడవల్లోనే సోముకు నిరాశ తప్ప లేదని చెబుతున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఎలాగైనా సొంతంగా ఎదగాలని భావించిన బీజేపీ రకరకాల ప్రయోగాలు చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్ష Bjp President పగ్గాలను కాపులకు కేటాయించడం ద్వారా ఆ వర్గానికి చేరువయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. తొలుత కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించారు. ఆయన తర్వాత సోము వీర్రాజును అధ్యక్షుడిని చేశారు. కన్నా లక్ష్మీనారాయణ తర్వాత టీడీపీలో చేరిపోయారు.

ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీకి కమ్మ సామాజిక వర్గం, వైసీపీకి రెడ్డి వర్గం అండదండలు ఉండటంతో బీజేపీ కాపుల్ని దగ్గర చేసుకోవాలని భావించింది. కొన్నేళ్లుగా ఆ ప్రయత్నాలు చేసింది. 2019 తర్వాత ఏపీలో భారీగా చేరికలు ఉంటాయని భావించినా అలా జరగలేదు.

2014కు ముందు ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగకపోవడానికి టీడీపీయే కారణమని బీజేపీలో ఓ వర్గం బలంగా విశ్వసించింది. టీడీపీ కోసమే బీజేపీని ఎదగనివ్వకుండా చేశారని ఆ వర్గం విస్తృతం ప్రచారం చేశారు. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ -టీడీపీలు 2018లో విడిపోయాయి.

ఆ తర్వాత ఏపీలో సొంతంగా ఎదగాలని బీజేపీ భావించింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 0.85శాతం ఓట్లకు మాత్రమే పరిమితం అయ్యింది.టీడీపీని వీడిన తర్వాత కూడా ఐదున్నరేళ్లలో ఆ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఎదగలేదు.

సోము వీర్రాజు స్థానంలో పురందేశ్వరి…

సోము వీర్రాజు స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురందేశ్వరి Purandeswari కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఎన్టీఆర్‌ కుమార్తెగా, పదేళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరి 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీలో చేరారు.తన వంతు వచ్చే వరకు ఓపికగా వ్యవహరించారు.

గత ఏడాది ఏపీ బీజేపీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత జట్టును నిర్మించుకునే ప్రయత్నాల్లో ఆమెకు రకరకాల అవరోధాలు ఎదురయ్యాయి. ఏపీ బీజేపీలో మూడు వర్గాల నాయకులు ఉన్నారు. వాటిలో కొందరు 2019 తర్వాత రకరకాల కారణాలతో టీడీపీని వీడి బీజేపీలో చేరిన వారు ఉన్నారు. మరో వర్గంలో వైసీపీపై సానుకూలంగా వ్యవహరించే వారు ఉన్నారు. మరో వర్గం ఆర్‌ఎస్‌ఎస్‌, హిందుత్వ సిద్ధాంతాలతో మొదటి నుంచి బీజేపీతో కొనసాగుతున్న నాయకులు ఉన్నారు.

తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల్ని ఖరారు చేసే క్రమంలో ప్రత్యర్థులకు పురందేశ్వరి అడ్డుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సోము వీర్రాజుకు కూడా ఇలాగే టిక్కెట్ దక్కకుండా పోయిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. నర్సాపురం ఎంపీ టిక్కెట్ తనకు దక్కకుండా పోవడానికి సోము వీర్రాజు కారణమని రఘురామ సైతం ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సోముకు అసెంబ్లీ టిక్కెట్ దక్కకుండా ప్రత్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేశారని, ఫలితంగా ఆ‍యనకు టిక్కెట్ రాలేదని చెబుతున్నారు.

సోమువీర్రాజుతో పాటు మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌కు కూడా ఈసారి టిక్కెట్ దక్కలేదు. విశాఖ నుంచి పోటీ చేయాలని భావించినా ఆయన ఆశలు నెరవేరలేదు. బీజేపీ పోటీ చేసే పది స్థానాల్లో ముగ్గురు కమ్మ అభ్యర్థులకు చోటు దక్కింది. ఎచ్చెర్లలో ఈశ్వరరావు, విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి, కైకలూరులో కామినేనికి టిక్కెట్లు దక్కాయి.

రిజర్వుడు స్థానాలను మినహాయిస్తే విశాఖలో టీడీపీ అనుకూల వైఖరి ప్రదర్శించే విష్ణు కుమార్ రాజుకు జమ్మలమడుగులో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి అవకాశం దక్కింది. ఆదోని, అనపర్తి, ధర్మవరంలలో కూడా బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీజేపీ ఖరారు చేసిన పది నియోజక వర్గాల్లో ఒక్కటి కూడా కాపులకు కేటాయించకపోవడంపై ఆ వర్గం రగిలిపోతోంది.

సర్దుబాటులో భాగంగానే…

సీట్ల సర్దుబాటు, పొత్తులో భాగంగా అందరికీ న్యాయం చేయలేకపోయినట్టు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెబుతున్నారు. పది స్థానాలు మాత్రమే తమకు కేటాయించడంతో సీనియర్లకు కూడా అవకాశం దక్కలేదని చెబుతున్నారు. మరోవైపు రాజమండ్రిలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి సోము వీర్రాజు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో హాజరు కాలేదని చెబుతున్నా, టిక్కెట్ దక్కకపోవడంతో మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది.

మరోవైపు కాపులకు ఒక్క టిక్కెట్ కూడా కేటాయించకపోవడంపై బీజేపీపై కాపు ఐక్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఉపకులాలను పూర్తిగా విస్మరించారని ఇందుకు బీజేపీకి గుణపాఠం చెప్పాని కాపు ఐక్య వేదిక పిలుపు ఇచ్చింది. పురందేశ్వరి, చంద్రబాబు కలిసి ఏపీలో కాపులకు చేసిన అన్యాయంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఫిర్యాదు చేసినట్టు బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం