Election Journey: ఎన్నికల వేళ సొంతూళ్లకు ప్రయాణాలు, టిఎస్‌ఆర్టీసీ బస్సులు ఫుల్, రైళ్లలో అదనపు కోచ్‌లు
Election Journey: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో హైదరాబాద్ నుంచి జిల్లా ప్రయాణాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. టిఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలకు రిజర్వేషన్లు పూర్తయ్యాయి. సాధారణ సర్వీసుల్లో రిజర్వేషన్లు పూర్తి కావడంతో స్పెషల్ బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు.
Election Journey: సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా భావిస్తోన్న పార్టీలు ఇతర ప్రాంతాల్లో ఉంటోన్న వారిని స్వస్థలాలకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లోని ఓటర్లు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లో ఉంటున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం 25లక్షల నుంచి 35లక్షల మంది ఏపీ స్థానికత కలిగిన ఓటర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటారనే అంచనాలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉన్న వారిలో చాలామందికి తమ సొంత ఊళ్లలో కూడా ఓటు హక్కు ఉంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ మే 13న జరుగనుంది. ఒకే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండటంతో ఏపీ ఓటర్లను స్వస్థలాలకు రప్పించేందుకు అభ్యర‌్థులు ప్రయత్నిస్తున్నారు. ప్రయాణానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఇప్పటికే ఓటర్లను సంప్రదించి ఓటేసేందుకు సొంతూరికి రావాలని అభ్యర్థిస్తున్నారు.
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఏరియాల వారీగా ప్రైవేట్ బస్సుల్ని కూడా ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థల బస్సులు నిత్యం పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణిస్తుంటాయి. రెగ్యులర్ సర్వీసుల్లో సీట్లన్ని ముందే రిజర్వ్ అయిపోయాయి.
దీంతో అభ్యర్థులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్ని బుక్ చేస్తున్నారు. ఏపీలోని కడప,చిత్తూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వలసలు ఉంటాయి. రాయలసీమ జిల్లాల్లో కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మాత్రం బెంగుళూరు, చెన్నై ప్రాంతాలకు వలసలు ఉంటాయి.
ఏపీలో ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరుల నుంచి పెద్ద సంఖ్యలో జనం హైదరాబాద్‌కు విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం వెళ్ళారు. ఈ నేపథ్యంలో ప్రతి ఓటు కీలకమని భావిస్తోన్న అభ్యర్థులు ఓటు ఉన్న ప్రతి ఒక్కరిని వెనక్కి పిలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అదనపు బస్సుల ఏర్పాటు..
పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రయాణికుల రద్దీ కూడా పెరిగింది. దీంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఏపీకి ఇప్పటికే ప్రక టించిన స్పెషల్ బస్సుల్లో సీట్లు మొత్తం నిండిపోయినట్టు ఆర్టీసీ వర్గాలు ప్రకటించాయి. టిక్కెట్ల కోసం డిమాండ్ ఏర్పడటంతో గురువారం హైదరాబాద్ నుంచి మరో 160 సర్వీసులను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 400 సర్వీసుల్ని తెలంగాణ ఆర్టీసీ నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు నిత్యం 300 సర్వీసులు నడుస్తున్నాయి. ఈ బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తి కావడంతో పాటు ప్రత్యేక బస్సుల్లోనూ టికెట్లు రిజర్వు అవుతున్నాయి.
మే 10వ తేదీన 120, 11న 150, 12వ తేదీన 130 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఈ బస్సుల్ని విశాఖ, అమలాపురం, కాకినాడ, రాజమ హేంద్ర వరం, పోలవరం, కందుకూరు, కనిగిరి, ఉద యగిరి, ఒంగోలు వైపు ఎక్కువగా నడుపుతున్నారు. తిరుగు ప్రయాణంలో 13, 14 తేదీల్లో ఏపీ నుంచి వచ్చేందుకు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. అటు ఏపీఎస్ ఆర్టీసీ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ప్రత్యేక బస్సుల్ని అందుబాటులోకి తీసుకువస్తోంది.
తెలంగాణ జిల్లాలకు ప్రత్యేక సర్వీసులు…
అటు తెలంగాణ జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలకు వెయ్యికి పైగా సర్వీసులు నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. నేటి నుంచి మూడ్రోజుల పాటు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 10, 11, 12 తేదీల్లో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మూడు రోజుల్లో తెలంగాణ జిల్లాలకు 1,400 సర్వీసుల్ని నడుపుతారు.
హైదరాబాద్లో ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్‌తో పాటు ఆరాంఘర్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ప్రారంభం అవుతాయి. తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ తదితర ప్రాంతాలకు డిమాండ్‌కు అనుగు ణంగా బస్సులు నడపనున్నారు.
మరోవైపు ఆర్టీసీలో గతంతో పోలిస్తే బస్సుల సంఖ్య తగ్గిపోయింది. ఉన్నవాటినే ప్రజల ప్రయాణాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు తగినన్ని లేకపోవడంతో సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులను దూరప్రాంతాలకు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీ పెరిగితే సిటీ ఆర్డినరీ బస్సులను కూడా జిల్లాలకు నడపాలని నిర్ణయించారు.
ఆ రైళ్లకు అదనపు బోగీలు…
సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో రైళ్లలో రిజర్వేషన్ జాబితా భారీగా ఉంటోంది. వెయిటింగ్ లిస్ట్ ఉన్న రైళ్లలో ప్రయాణికుల కోసం 22 రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొన్ని రైళ్లకు 10-13 తేదీల మధ్య, మరికొన్నింటికి 11- 14 వరకు ఈ సౌకర్యాన్ని కల్పించినట్టు ప్రకటించారు.
సికింద్రాబాద్-విశాఖ, కాచిగూడ-గుంటూరు, వికా రాబాద్-గుంటూరు, విశాఖ-గుంటూరు, సికింద్రా బాద్-విజయవాడ, ధర్మవరం-నర్సాపూర్, తిరు పతి-గుంటూరు, హుబ్లీ-నర్సాపూర్, కాచిగూడ- రేపల్లె, బీదర్-మచిలీపట్నం తదితర రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
సంబంధిత కథనం