YSRCP vs Janasena : 'పిఠాపురం' లెక్కలు - ఎవరి తాలుకా గెలిచినా పెద్దపీటే...?
Vanga Geetha vs Pawan Kalyan in Pithapuram : ఏపీలో పిఠాపురం ఎన్నిక ఫలితం అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. ఓ వైపు వైసీపీ, మరోవైపు జనసేన కార్యకర్తలు ఇప్పటికే స్టిక్కర్ వార్ కు దిగారు. గెలిచేది మా తాలుకానే అంటూ ప్రదర్శనలు చేస్తున్నారు.
Vanga Geetha vs Pawan Kalyan : ఏపీలో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కు సమయం దగ్గరపడింది. పోలింగ్ ప్రక్రియ నాటి నుంచే పార్టీలతో పాటు ప్రతి ఒక్కరూ గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు. అయితే జూన్ 4వ తేదీతో అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది.
ఏపీలో ఎవరు గెలుస్తారు…? చంద్రబాబు సీఎం అవుతారా..? లేక మళ్లీ జగనే పీఠంపై కూర్చుంటారా..? అంటూ ఆంధ్రా ఓటర్లు చర్చించుకుంటున్నారు. అక్కడే వాళ్లు మాత్రమే కాదు… తెలంగాణలోనూ తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో….. పిఠాపురం ముచ్చట కూడా మాట్లాడుతున్నారు. ఈసారి పవన్ కల్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెడుతారా..? లేక వంగా గీతా విక్టరీ కొడుతారా..? అంటూ మాట్లాడుతున్నారు.
ఇక ఫలితాలు రాకముందే…. పిఠాపురంలో స్టిక్కర్ వార్ నడుస్తోంది. పవన్ గెలుపు ఖాయమైపోయిందంటూ జనసేన అభిమానులు…. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అంటూ స్టిక్లర్లు ప్రదర్శిస్తున్నారు. అయితే తాము ఏ మాత్రం తక్కువ కాదంటూ వైసీపీ శ్రేణులు, అభిమానులు కూడా అదే స్టైల్ లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. ‘పిఠాపురం ఎమ్మెల్యే వంగాగీత, డిఫ్యూటీ సీఎం’ అంటూ స్టికర్లు వదిలారు.
తమ బైక్‌లు, కార్లు, మొబైల్ ఫోన్లపై ఎమ్మెల్యే తాలూకా అంటూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. తమ అభ్యర్థుల గెలుపు తథ్యం అంటూ ముందస్తుగా ఇలా స్టిక్కర్లతో మద్దతు తెలుపుతున్నారు. దీంతో పిఠాపురం ఫైట్ మరింత రసవత్తరంగా మారిందని చెప్పొచ్చు.
ఎవరు గెలిచినా ‘పెద్దపీట’…!
ఇక పిఠాపురంలో ఈసారి ఎవరు గెలిచినా వచ్చే కొత్త ప్రభుత్వంలో పెద్దపీట వేసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేవలం పిఠాపురంలో మాత్రమే గెలవటం కాదు…రాష్ట్రంలోనూ సంబంధిత పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం తప్పకుండా పెద్దపీట వేయటం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పిఠాపురంలో వంగా గీతాను గెలిపిస్తే కేబినెట్ లో చోటు కల్పిస్తానని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల సాక్షిగానే హామీనిచ్చారు. అంతేకాదు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పుకొచ్చారు. ఇది జరగాలంటే…. పిఠాపురంలో వంగాగీత గెలవటం మాత్రమే కాదు రాష్ట్రంలోనూ వైసీపీ అధికారంలోకి రావాల్సి ఉంటుంది. ఇలా జరిగితే వంగా గీతాకు డిప్యూటీ సీఎంగా అవకాశం దక్కటం ఖాయమని చెప్పొచ్చు. ఒకవేళ వైసీపీ రాష్ట్రంలో గెలిచి… వంగా గీతా ఓడిపోయినప్పటికీ ఆమెకు ప్రభుత్వం కీలక పదవి దక్కొచ్చన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.
మరోవైపు పిఠాపురంలో పవన్ గెలవటంతో పాటు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ కీలకంగా మారే అవకాశం ఉంది.ప్రభుత్వంలోనూ ఆయనకు కీలకపాత్రను పోషించే అవకాశం స్పష్టంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం ఎమ్మెల్యేగానే ఉండే అవకాశం మాత్రం ఉండదని అంటున్నారు. ఇదే విషయంపై జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే… పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితం టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారిందని చెప్పొచ్చు. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల కోసం యావత్ ఆంధ్రా ప్రజానీకం ఎదురుచూస్తోంది. గత ఎన్నికల్లో రెండుచోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి విక్టరీ కొట్టి అసెంబ్లీవైపు అడుగు వేస్తారా..? లేక వంగా గీతా గెలిచి…సత్తా చాటుతారా అనేది చూడాలి..!